సమీక్ష
 
 
 
 
 
‘పరమవీరచక్ర’
సినీవినోదం రేటింగ్‌ : 2/5
తేజ సినిమా పతాకంపై దాసరి నారాయణరావు రచన, దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న సినిమా హీరో చక్రధర్. అతని తల్లికి మాత్రం చక్రధర్ నటుడు కావడం కన్నా మిలిటరీలో దేశ సేవ చేస్తేనే బాగుండునని ఉంటుంది. ఓ సారి మిలిటరీ అధికారి మురళీమోహన్ చక్రధర్ ని కలిసి - దేశం కోసం ప్రాణాలకి తెగించి పోరాడిన మేజర్ జయసింహ గురించి చెబుతాడు. జయసింహ సాహసాలను వింటూ చక్రధర్ ఉత్తేజితుడవుతుంటాడు. ఆ తర్వాత మురళీమోహన్ చక్రధర్ ని హిమాచల్ లోని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి - అక్కడ కోమాలో చావు బతుకుల మద్య నున్న జయసింహను చూపిస్తాడు. జయసింహను ఆ స్థితిలో చూసిన చక్రధర్ షాక్ అవుతాడు. విదేశీ తీవ్రవాదులు, స్వదేశీ రాజకీయ వాదులు తమ ప్రయోజనాల కోసం దేశభక్తుడైన జయసింహ కుటుంబాన్ని మట్టుపెట్టి, అతన్ని దేశ ద్రోహిగా చూపించారని తెలుసుకుంటాడు. అచ్చం జయసింహలానే ఉండే చక్రధర్ శత్రువుల ఆటకట్టించడానికి జయసింహ వేషంలోకి మారి, వారిని మట్టుపెడతాడు. జయసింహపై పడ్డ అపనిందను తొలగిస్తాడు.

ఇది దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 150వ చిత్రం. బాలకృష్ణతో తొలి చిత్రం. బాలకృష్ణతో చేసేటప్పుడు మెలోడ్రామాకు ప్రాధాన్యతనిస్తూ పవర్ ఫుల్ సంభాషణలతో సినిమాను నడిపినప్పుడే విజయానికి ఆస్కారముంటుంది. అయితే, పాత కాలపు కథ, కథనంతో ఈ చిత్రం నడుస్తుంది. ఎక్కడా కొత్తదనం కనిపించదు. సంభాషణలు సైతం రొటీన్ గా సాగుతాయి. కొన్ని చోట్ల కాస్త బాగున్నట్లనిపించినా, మరికొన్ని చోట్ల మరీ నాసిగా ఉంటాయి. ‘బొబ్బిలి పులి’ నుండి ఎన్టీఆర్ సన్నివేశంతో ఇప్పటి జయసుధను కలిపిన ప్రారంభమే పేలవంగా ఉంది. రావణ బ్రహ్మగా బాలయ్యతో చేయించిన సన్నివేశం కూడా చురుగ్గా లేదు. ఉన్నంతలో బుర్రకథ రూపంలో చెప్పించిన కొమరం భీమ్’ కథ బాగుంది. మెలోడ్రామా ఉన్న సన్నివేశాలు మరీ పేలవంగా ఉన్నాయి. సినిమా అంతా ఎందరో ప్రముఖ నటీనటులున్నా ఒక్క పాత్ర కూడా రిజిస్టర్ కాదు. ఇప్పటి ప్రేక్షకులను ఏ విధంగానూ సంతృప్తి పరచని ఈ చిత్రం బాలయ్య అభిమానులను కూడా నిరాశ పరుస్తుంది.

మేజర్ జయసింహగా, హీరో చక్రధర్ గా రావణుడు, కొమరం భీమ్ పాత్రల్లోనూ బాలకృష్ణ బాగా చేసారు. అతని సంభాషణా విధానంలోనూ వైవిధ్యం కనిపించింది. ఇందులోని ముగ్గురు హీరోయిన్ల పరిస్థితి దయనీయం. ఎవరికీ చెప్పుకోదగ్గ పాత్రలేదు. మేజర్ భార్యగా పరిణితి చూపాల్సిన పాత్రకు అమీషా పటేల్ ఏ మాత్రం సరిపోలేదు. హీరో ప్రియురాలిగా గ్లామర్ తో ఆకర్షించాల్సిన షీలా చిరాకెత్తించింది. తీవ్రవాదిగా కన్నా ఓ పాటలో సెన్సార్ ని మించి అందాలు చూపడానికే నేహా దూపియా పరిమితమయ్యింది. సూపర్ హిట్ ‘రోబో’కు పేరడీగా బ్రహ్మానందం, అలీ, హేమలపై చేసిన సన్నివేశాలు కూడా అంతంత మాత్రంగానే పండాయి. ఇతర పాత్రల్లో నాగినీడు, కృష్ణభగవాన్, అశోక్ కుమార్, చరణ్ రాజ్, రాజ్ ప్రేమి, జయసుధ, ఎల్బీ శ్రీరాం, కిషోర్ దాస్, జీవా, రఘుబాబు, ఆర్కే, విజయచందర్, మురళీ మోహన్, విజయ కుమార్, కోట, రమాప్రభ, అర్చన, రాజీవ్ కనకాల, చలపతిరావు, గుమ్మడి గోపాలకృష్ణ, ఎవిఎస్, కళ్యాణి నటించారు. బాలకృష్ణ హీరోగా చేసిన సన్నివేశాల్లో డి.రామానాయుడు, సింగీతం, శ్రీనువైట్ల, బి.గోపాల్, బోయపాటి శ్రీను, కోడి రామకృష్ణ, కాశీవిశ్వనాధ్, జొన్న విత్తుల, అల్లాణి శ్రీధర్, రోజా కనిపిస్తారు.

మణిశర్మ సంగీతంలో పాటలు, నేపథ్యంలో సంగీతం రెండూ బాగులేవు. బాలుతో కొన్ని పాటలు పాడించడం ఒక్కటే వీరు చేసిన తెలివైన పని. రమణరాజు ఫోటోగ్రఫీలో కూడా ఆధునికత కొరవడింది. రామ్ లక్ష్మణ్ ల ఫైట్స్ ఎక్కడ పడితే అక్కడ అద్దాలు పగలగొట్టడంతోనే సరిపోయింది. పిల్లల్ని కాపాడేందుకు మేజర్ ప్రయత్నించడం వంటి సన్నివేశాల్లో యాక్షన్ మూమెంట్స్ మరీ అసహజంగా ఉన్నాయి. కులు లొకేషన్స్ బాగున్నాయి.

- రాజేష్