Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘రామ రామ - కృష్ణ కృష్ణ’
సినీవినోదం రేటింగ్‌ : 2.5/5

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై శ్రీవాసు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

గోదావరి తీరాన సరదాగా తిరిగే రామకృష్ణకు ఊరి పెద్ద అయిన తండ్రి అంటే భయభక్తులు ఎక్కువ. వాళ్ళ ఊరిలో స్థిరపడ్డ అశోక్ కి ఇద్దరు చెల్లెళ్ళు. రామకృష్ణ అన్నయ్య, అశోక్ పెద్ద చెల్లెలు కలిసి డాక్టర్ చదవడంతో ప్రేమలో పడతారు. తల్లిదండ్రులకు తెలియకుండా ముంబైలో పెళ్ళి చేసుకోవాలనుకున్న వారి ప్రయత్నాన్ని రామకృష్ణ ఆపుతాడు. తల్లిదండ్రులను ఒప్పించి వారి పెళ్ళి చేసే బాధ్యత తను తీసుకుంటాడు. అదే సమయంలో వారు ముంబైలోని ఓ మాఫియా గ్యాంగ్ బారిన పడటం, తెలివిగా రామకృష్ణ వారినుండి తప్పించడంతో క్షేమంగా ఊరికి చేరతారు. ఈ సందర్భంలో తెలుస్తుంది - అశోక్ ముంబైలో డాన్ గా వుండేవాడని, ఆ గొడవల్లో భార్య చనిపోవడంతో ఆ గొడవలకి దూరంగా ఊరికి వచ్చి వుంటున్నాడని. రెండు కుటుంబాలను దగ్గరచేసి రామకృష్ణ అన్నయ్య పెళ్ళిని ‘ఓకె’ చేయిస్తాడు. అయితే పగబట్టిన ముంబై మాఫియా గ్యాంగ్ వారిని వెతుక్కుంటూ ఆ ఊరికి రావడంతో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. వాటి నుండి రామకృష్ణ అందరినీ ఎలా కాపాడాడనేదే ఈ చిత్ర కథాంశం.

ఎక్కడా కొత్తదనం లేని రొటీన్ సినిమా ఇది. గతంలో వచ్చిన బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’లా వుంటుంది. టేకింగ్ పరంగా కూడా దర్శకుడు చాలా వీక్. అర్థం పర్థంలేని స్క్రీన్ ప్లే తో నడిచే ఈ చిత్రంలో మహా అంటే అరడజను సీన్లు తప్ప మిగతా ఏవీ ఆకట్టుకోవు. ఆ అరడజను సీన్లు కూడా కీరవాణి రీరికార్డింగ్ పుణ్యమా అని పండాయి. వున్నంతలో అశోక్ దేవాగా అర్జున్ పాత్ర, అతని నటన బాగున్నాయి. అనుభవానికి, ఆకారానికి మించిన పాత్రలో రామకృష్ణగా రామ్ బాగా చేయాలని ప్రయత్నించినా అంతంత మాత్రంగానే మిగిలింది. ఇక హీరోయిన్లు ప్రియా ఆనంద్, బిందుమాధవిల పరిస్థితి మరీ అధ్వాన్నం. బ్రహ్మానందం పాత్ర పెద్దదే కానీ, సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇతర పాత్రలు గ్రేసిసింగ్, బెనర్జీ, సయ్యాజీ షిండే, బ్రహ్మాజీ, వినీత్, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, నాజర్, ప్రగతి, రామ్, సందేష్ పోషించారు.

పెళ్ళి చేసుకోవడానికి ముంబై వెళ్ళిన అన్నయ్యని వెదుకుతూ అశోక్ చెల్లితో రామకృష్ణ వెళ్ళిన సన్నివేశాలు మరీ సుదీర్ఘంగా వున్నాయి. అలాగే పల్లెటూరి కుర్రాడు రామకృష్ణ ముంబై డాన్ పవార్ గ్యాంగ్ ని ఆట పట్టించడం మరీ అసహజంగా వుంది. క్లైమాక్స్ ముందు రామకృష్ణ, ప్రియా ఆనంద్ ల ప్రేమకు అడ్డంకులు పేరుతో సినిమాను సాగదీయడం ప్రేక్షకులను అసహనానికి గురిచేసింది. ముంబై నుండి మాఫియా గ్యాంగ్ స్కార్పియోలపై సరాసరి గోదావరి జిల్లాకు వచ్చేయడం, అందులోనూ అంతా కత్తులు పట్టుకుని రావడం వింతగా వుంటుంది.

ముంబైలో హీరో అన్నయ్య పెళ్ళిని కన్విన్స్ చేసి ఆపడం, రెండు కుటుంబాలను హీరో దగ్గరచేసి పెళ్ళికి ఒప్పించడం, అర్జున్ ఫ్లాష్ బ్యాక్ లో కొంతభాగం, నాజర్ ను సిగరెట్లు మాన్పించడం సన్నివేశాలు బాగున్నాయి. కీరవాణి సంగీతంలో ఈ సినిమా టైటిల్ సాంగ్ ఒక్కటే బాగుంది. రీరికార్డింగ్, అనంత శ్రీరామ్ సాహిత్యం బాగున్నాయి. రత్నం సంభాషణల్లో విషయం లేదు. శేఖర్ వి జోసెఫ్ గత చిత్రాల స్థాయిలో ఈ చిత్రం ఫొటోగ్రఫీ లేదు. హీరోని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ గొంతు కాసేపు వినిపించడం ఇందులో ఓ విశేషం.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005