Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘రోబో’
సినీవినోదం రేటింగ్‌ : 4/5

సన్ పిక్చర్స్ పతాకంపై శంకర్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో తోట కన్నారావు అందించారు.

డా.వశీకరన్ ‘యాండ్రో హ్యూమనాయిడ్ రోబో’ను తన పోలికలతో రూపొందిస్తాడు. దానికి చిట్టి అని పేరు పెడతాడు. ఆ తరహా రోబోలను దేశ ప్రయోజనాల కోసం సైన్యంలో చేర్చాలనుకున్న వశీ ఆశలను అతని సీనియర్ ఫ్రొఫెసర్ బోరా అడ్డుకుంటాడు. రోబోలు యాంత్రికంగా పని చేస్తాయే తప్ప, వాటికి విచక్షణ ఉండదని వాదిస్తాడు. చిట్టిలో మానవ స్పందనలు ప్రవేశపెట్టేందుకు వశీ ప్రయత్నించి విజయం సాధిస్తాడు. అయితే వశీ ప్రియురాలు సనతో చిట్టి ప్రేమలో పడటంతో వశీ ఇబ్బందిలో పడతాడు. సన విషయంలో హద్దులు దాటిన చిట్టిని శరీరభాగాలు విరిచేసి నాశనం చేస్తాడు వశీ. అయితే, తిరిగి యధా రూపు సంతరించుకన్న చిట్టిని ప్రొఫెసర్ బోరా తన స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తాడు. అతనిలో వినాశకర గుణాలను చేర్చి ప్రమాదికారిగా మారుస్తాడు. దాంతో పెళ్ళిపీటల నుండి సనాను చిట్టి ఎత్తుకొస్తాడు. తనలాంటి వందలాది రోబోలను తయారు చేసి విధ్వంసం సృష్టిస్తాడు. చిట్టిని వశీ ఎలా అడ్డుకున్నాడు, ప్రియురాలు సనాను ఎలా దక్కించుకున్నాడనేది చిత్రంలో చూడాలి.

దేశంలో అత్యంత భారీ వ్యయం 130 కోట్లతో ఈ చిత్రం నిర్మించారు. ఈ స్థాయిలో స్పెషల్ ఎఫెక్ట్స్ వినియోగించిన చిత్రం కూడా దేశంలోనే ఇది మొదటిది. అతి తక్కువ పాత్రలతో చేసిన ఈ చిత్రంలో కథాంశం కూడా చెప్పుకోదగ్గ వైవిధ్యంతో ఉండదు. అయితే, గందరగోళం లేకుండా కథను నడపడంలోనూ, అత్యాధునిక సాంకేతికతను సమర్థవంతంగా వాడుకోవడంలోనూ శంకర్ సమర్థత కనిపిస్తుంది. మనకు పరిచయంలేని సైంటిఫిక్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఫిక్షన్ లా కాకుండా వాస్తవంలా ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. ‘రోబో కాన్ఫరెన్స్’లో వశీని దేవుడిగా చిట్టి చెప్పడం, సన పరీక్షల సమయంలో ఇబ్బంది పెడుతున్నవారికి చిట్టి బుద్ధి చెప్పడం... పరీక్షల్లో సనకు సహకరించడం, ట్రెయిన్ లో చిట్టి ఫైట్, అగ్ని ప్రమాదం నుండి బాధితులను కాపాడటం, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పురుడు పొయ్యడం వంటి సన్నివేశాలు బాగున్నాయి. దోమలతో చేసిన సీన్ వెరైటీగా ఉంది. చిట్టి సనను తన డెన్ కి ఎత్తుకొచ్చినప్పటి నుండి సినిమా చివరి వరకూ రోబోలతో చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం ప్రేక్షకుడిని సంభ్రమంలో ముంచెత్తుతుంది. క్లైమాక్స్ లో చిట్టి తనను తానే నాశనం చేసుకునే సన్నివేశం మనసుని కదిలించేలా ఉంది. విలన్ గా మారిన చిట్టి ఐశ్వర్యను ఎత్తుకు పోతూ పోలీసులతో చేసిన ఫైట్ ఆర్టిఫీషియల్ గా, అతిగా ఉంది. వశి నాశనం చేసిన చిట్టి తిరిగి ఎలా యధాస్థితికి వచ్చిందీ అర్థంకాదు.

రజనీకాంత్ అంటేనే మాస్ హీరో. అయితే అతని నుండి మాస్ మెటీరియల్ ఆశించేవారికి ఈ చిత్రం ఆశాభంగమే జరుగుతుంది. ప్రొఫెసర్ గా అందమైన రోబోగా రజనీకాంత్ నటన పాత్రలకి ప్రాణం పోసింది. ఇక, ప్రమాదకరంగా మారిన చిట్టిగా రజనీ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నటుడిగా రజనీ విలన్ గా నటించిన చిత్రాలను గుర్తు చేసింది. మనో డబ్బింగ్ కూడా పాత్రకి నిండుదనాన్ని ఇచ్చింది. రోబో కూడా ప్రేమిస్తానంటూ వెంటబడాలంటే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అంత అందంగానే ఉండాలి. సనగా ఐశ్వర్య సినిమాకి తన అందాలతో ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ప్రోఫెసర్ బోరోగా డానీ తన పాత్రను హుందాగా పోషించారు. రెహమాన్ పాటల్లో - శబ్ధ సౌందర్యమే తప్ప భాష వెతికినా దొరకదు. ‘ఇనుములో ఓ హృదయం’, ‘కిల్ మంజారో’ పాటలు ఫర్వాలేదు. ‘హరిమ హరిమ’తో పాటు పాటలన్నీ బాగా చిత్రీకరించారు. రెహమాన్ రీరికార్డింగ్ కొత్తగా బాగుంది. రత్నవేలు ఫోటోగ్రఫీ, ఆంధోని ఎడిటింగ్, సాబు శిరిల్ ఆర్ట్ బాగున్నాయి.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005