శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై వంశీ దర్శకత్వంలో ఎమ్.ఎల్.పద్మ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అమెరికా నుండి వచ్చిన శ్రీనివాస్ తో పెళ్ళి చూపులకి ఆహుతి ప్రసాద్ ఇంటికి వెళ్తాడు కారు డ్రైవర్ రంగబాబు. శ్రీనివాస్
అతితెలివి కారణంగా అక్కడి వారంతా రంగబాబే పెళ్ళి కొడుకని అనుకుంటూ మర్యాదలు చేస్తుంటారు. పెళ్ళి కూతురు
మణిమాల కూడా అతన్నే ఇష్టపడుతుంది. వారికి అడ్డంపడుతున్న శ్రీనివాస్ ని గదిలో పెట్టి తాళం వేస్తారు. క్రిమినల్
లాయర్ కష్ణభగవాన్ ఆహుతి ప్రసాద్ కు, అతని అన్న ఎమ్మెస్ నారాయణకు మద్య చిచ్చు పెట్టడమే కాకుండా, ఆస్తి
కోసం ఎమ్మెస్ ని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. అతని ప్రయత్నాన్ని రంగబాబు భగ్నం చేయడంతో - రంగబాబు
పెళ్ళి కొడుకు కాదని, కారు డ్రైవరని ఆహుతి ప్రసాద్ తో చెప్పేస్తాడు. అదే సమయానికి శ్రీనివాస్ తల్లిదండ్రులు కూడా
అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత ఏమైందీ సినిమాలోనే చూడాలి.
వంశీ చిత్రాలంటే కళ్ళకూ చెవులకూ విందులా ప్రేక్షకులు భావిస్తుంటారు. అయితే, ఆ మద్య వచ్చి ‘గోపి - గోపిక -
గోదావరి’ చూసి తల పట్టుకుని, వంశీ పని అయిపోయిందని అనుకున్నారు. నిజానికి వంశీ గతంలోనూ ఇలాంటి
నెత్తి నొప్పి చిత్రాలను అప్పుడప్పుడూ అందిస్తూనే వచ్చారు. వంశీ తాజా చిత్రం ‘సరదాగా కాసేపు’ చూసిన ప్రేక్షకులు
మాత్రం సరదానే ఫీలయ్యారు. కథ, కథనం, సంభాషణల్లో కొత్తదనం లేకపోయినా - పూర్తి వినోదాత్మకంగా,
ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, వేగంగా సాగడమే ఈ చిత్రం ప్రత్యేకత. మంచి డైలాగ్ పంచ్ లు, చక్కటి టేకింగ్
ఇందులో హైలైట్స్. అంత ఫ్రెష్ గా కాకపోయినా వంశీ స్టైల్ లో చక్రి అందించిన పాటలు కూడా సినిమాలో ప్రేక్షకులను
అలరిస్తాయి. పాటల చిత్రీకరణ కూడా వంశీ వరసలోనే ఆకట్టుకునేలా ఉంది. రీరికార్డింగ్ కూడా బాగుంది. వేషాలు
మార్చుకుని పెళ్ళిచూపులకు వెళ్తూ డ్రైవర్ గా శ్రీనివాస్ చేసే యాక్సిడెంట్స్, శ్రీనివాస్ కి మాజీ జైలర్ ఆహుతి ప్రసాద్
ఇచ్చే పనిష్ మెంట్స్, డ్రైవర్ ని గౌరవించడం మా సంప్రదాయం అంటూ నరేష్ కు మర్యాదు చేయడం, కృష్ణభగవాన్
ఎమ్మెస్ ని చంపడానికి చేసే ప్రయత్నాలు, కృష్ణభగవాన్ తమ్ముడి చావు డ్రామా... పికాసో పెయింటింగ్స్
సన్నివేశాలు మంచి వినోదాన్ని అందించాయి.
కారు డ్రైవర్ రంగబాబుగా నరేష్ ఆ పాత్రకు చక్కగా కుదిరాడు, బాగా చేశాడు. అమెరికా శ్రీనివాస్ గా అవసరాల శ్రీనివాస్
పాత్రకు న్యాయం చేశారు. మణిమాలగా మధురిమ అందాలతో ఆకట్టుకుంది. ఆమె తండ్రిగా ఆహుతి ప్రసాద్ నటన
ప్రత్యేకతను సంతరించుకుంది. క్రిమినల్ లాయర్ గా కృష్ణభగవాన్ మరో మారు మంచి పంచ్ లు విసిరాడు. కృష్ణేశ్వర
రావు, జీవా, ఎమ్మెస్ నారాయణ, రమ్యశ్రీ, జయలలిత, కొండవలస, సన, దువ్వాసి, సుభాష్
జయప్రకాష్ రెడ్డి, చిట్టి బాబు ఇతర పాత్రలు పోషించారు. పడాల శివ సుబ్రహ్మణ్యం మాటలు, లోకి ఫోటోగ్రఫీ
బాగున్నాయి. దర్శకుడు వంశీ రెండు పాటలు పాడటం ఈ చిత్రంలో మరో విశేషం. రేలంగా నరసింహారావు
దర్శకత్వంలో కళ్యాణ చక్రవర్తి, హరీన్ చక్రవర్తి హీరోయిన్ గా, కల్పన, సీత హీరోయిన్లుగా నిర్మించిన ‘పెళ్ళి
కొడుకులొస్తున్నారు’ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తోంది.