సమీక్ష
 
 
 
 
 
అపురూప దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’
నందమూరి తారక రామారావు నటించిన ‘లవకుశ’ తెలుగు సినీ ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది. శ్రీరాముడంటే ఎన్టీఆర్, సీతమ్మ అంటే అంజలీదేవి అనే నమ్మకం వారిది. ఇక లవకుశులు ఆ తరం వారందరి మదినీ దోచిన కవలలు. ఆ సుందర సుమధుర దృశ్య కావ్యాన్ని సృష్టించడం అంటే ఎంత సాహసం కావాలి? శ్రీరాముని పాత్రను, సీత అభినయాన్ని, లవకుశుల గానామృతాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ఎంత ధైర్యం ఉండాలి? అయితే అవన్నీ నిండుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల కలయికకు ప్రతిరూపంగా ‘శ్రీరామరాజ్యం’ నిలిచింది. ‘లవకుశ’ చిత్రాన్ని ఈ తరానికీ అందించాలనే సత్ సంకల్పం నిర్మాత యలమంచిలి సాయిబాబుది అయితే, ఎనభై ఏళ్ళ వయసులో సైతం రామకథను అందంగా తీర్చిదిద్దగలననే నమ్మకం దర్శకుడు బాపుది. వీటికి తోడు తన తండ్రి ప్రాణంపోసిన శ్రీరాముని పాత్రను పోషించడానికి ఏ మాత్రం వెరవకపోవడం నందమూరి బాలకృష్ణ గొప్పతనం. అందుకే ఈ అపురూప దృశ్యకావ్యం ఇవాళ ఈ విధంగా తెలుగువారి ముందుకు వచ్చింది.

నిజానికి కథగా ‘శ్రీరామరాజ్యం’ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏముంటుంది.అలనాటి ‘లవకుశ’ కథే ఇదీనూ. రావణ సంహారానంతరం అయోధ్యకు సీతాసమేతుడై రాముడు విచ్చేస్తాడు. వశిష్ఠ మహర్షి నిర్ణయించిన ముహూర్తానికి శ్రీరామ పట్టాభిషేకమూ జరుగుతుంది. అగ్నిపునీత అయినప్పటికీ రావణుని చెరలో ఉన్న సీతను తాను ఏలుకోవడం పట్ల ప్రజలలో ఉన్న అనుమానాన్ని నివృతి్త చేయడానికి మనసు రాయి చేసుకుని ఆమెను రాముడు అడవులకు పంపిస్తాడు. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ కుశలవులకు జన్మనిస్తుంది. వీల్మీకి విరచితమైన శ్రీరామాయణ గానాన్ని మధురంగా ఆలపిస్తూ వారు అయోధ్యకు వస్తారు. తండ్రి అని తెలియకపోయినా మహారాజుగా ఉన్న రాముని ఆశీస్సులు స్వీకరిస్తారు. సీతమ్మ లభించకపోవడంతో రాముడు నిరదయుడని, ఎవరో ఏదో అన్నారని భార్యను వదిలేశాడని భావిస్తారు. ఇక రామకథాగానం చేయమని భీష్మిస్తారు. ఆ తర్వాత రాముడు అశ్వమేధ యాగాన్ని చేయాలని తలించినప్పుడు యాగాశ్వాన్ని బంధించి, శ్రీరామునితోనే కయ్యానికి కాలు దువ్వుతారు. తన భర్త, పిల్లలు ఒకరిపై ఒకరు యుద్ధానికి తలపడుతున్నారని తెలిసి సీత ఖిన్నురావవుతుంది. ఆ యుద్ధాన్ని ఆపి, శ్రీరాముని చెంతకు తన కుమారులిద్దరినీ చేర్చి, తాను తలి్ల భూదేవి ఒడిలోకి చేరిపోతుంది.

1963లో సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకత్వంలో వచ్చిన ‘లవకుశ’ కథ కూడా ఇదే. అయితే అదే పేరును తిరిగి పెట్టకుండా, ‘శ్రీరామరాజ్యం’ అని నామకరణం చేయడంలోనే బాపు, రామణ తెలివితేటలు తేటతెల్లమయ్యాయి. ప్రతి సన్నివేశంలోనూ, ప్రతి పాట విషయంలోనూ ఈ చిత్రంతో దీనిని పోల్చుతారని తెలుసు. అందుకనే మరింత జాగ్రత్త పడ్డారు. అవసరానికి మించి శ్రమపడ్డారు. ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవాళ బాపు బృదం పొందుతోంది.

తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణకు అభిమానులలో పేరు ఉండొచ్చు. కానీ తండ్రి పోషించిన పాత్రలను తిరిగి పోషించడం అంత సులువు కాదు. ఆ విషయం ‘పాండురంగ మహత్యం’ విషయంలో రుజువైంది. అయినా బాపు, రమణ మీద నమ్మకంతో బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ చిత్రానికి పచ్చజెండా ఊపారు. అంతేకాదు, మనసా వాచా శ్రీరాముని పాత్రలో లీనమవడానికి ప్రయత్నించారు. అది తెరపూ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి రెండు చోట్ల వాచకం విషయంలో తడబడినా, ఏ ఒక్క సన్నివేశంలోనూ ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఇక సీత పాత్ర నయనతార పోషిస్తోందని తెలియగానే రకరకాల విమర్శలు చెలరేగాయి. సీతమ్మ పాత్రలో నయనతారను ఎలా ఊహించుకోగలం అన్నవారు ఉన్నారు. ‘సింహా’ సాధించిన విజయాన్ని సొమ్ము చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమిది అని విమర్శించిన వారూ ఉన్నారు. అయితు దర్శక నిర్మాతలు ఈ విమర్శలకు వెరవలేదు. తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇవాళ ‘శ్రీరామరాజ్యం’ సినిమా విషయంలో అందరూ ‘ఇది నయనతార’ సినిమా అంటున్నారు. ఆమెకు అవార్డు ఖాయం అని ప్రకటించేస్తున్నారు. ప్రభుదేవాను పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పాలని నయనతార భావిస్తే ఈ సినిమా ఒక్కటి చాలు ఆమె జీవితాంతం ఉదహరించుకోవడానికి అని కితాబిస్తున్నారు. ఇక చిత్తూరు నాగయ్య పోషించిన వీల్మీకి పాత్రలో పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు సైతం చక్కగా ఇమిడిపోయారు. ఆయన కారణంగా ఆ పాత్రకు, సినిమాకు గౌరవం పెరిగింది. శ్రీకాంత్ పోషించిన లక్ష్మణుని పాత్రకు ఊహించినంత ప్రాధాన్యం లేకపోయినా పాత్రోచితంగా నటించి మెప్పించాడు. అలనాటి లవకుశలకు ఏమాత్రం తగ్గకుండా ఇందులో మాస్టర్ తన్యతేజ, మాస్టర్ సాత్విక్ అద్భుతంగా నటించారు. కె.ఆర్.విజయ, బాలయ్య, మురళీమోహన్, సన, సుబ్బరాయ శర్మ, శివపార్వతి, బ్రహ్మానందం, ఝాన్సీ, రాళ్ళపల్లి తదితరులు ఆయా పాత్రలకు వన్నె తెచ్చారు అనడం కంటే బాపు వారి నుండి తనకు కావలసిన రీతిలో చక్కని నటనను రాబట్టుకున్నారనడం సబబు.

ఇక బాపు రమణ మార్కు చమత్కారం సినిమాలో అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వాల్మీకి ఆశ్రమానికి చేరిన సీతాదేవికి ‘బాలరాజు’ రూపంలో హనుమంతుడు తోడు ఉండటం గొప్ప ఊహ. అలానే పరస్త్రీ నీడను సైతం రాముడు తనపై పడనీయడు అని చెప్పిన ఘట్టమూ అద్భుతంగా ఉంది. రమణ కాగితంపై పెట్టిన సన్నివేశాలకు బాపు తెరపై ప్రాణం పోశారు. అయితే ఆ అందాల బొమ్మకు మరిన్ని మెరుగులు దిద్దినవారిలో అగ్రస్థానం మాస్ట్రో ఇళయరాజాకు దక్కుతుంది. త్రేతాయుగంలోకి మనం అడుగిడామా అన్నంతగా మనల్ని ఆయా సంఘటనలతో మమేకం చేసేలా ఇళయరాజా నేపథ్య సంగీతం ఉంది. ఆయన అందించిన శ్రావ్యమైన బాణీలకు జొన్నవితు్తల సాహిత్యమూ అద్భుతంగా జత కలిసింది. ఇక జీఆర్కే రాజు ఛాయాగ్రహణం, రవీందర్, కిరణ్ కుమార్ కళానూపుణ్యం కను్నల పండువ కావిస్తాయి. గ్రాఫిక్ప్, స్పెషల్ ఎఫెక్ట్, డిజిటల్ ఇంటర్మీడియెట్... ఇవన్నీ బాపు తన ఆలోచనలను మరింత అందంగా, ప్రతిభావంతంగా తెరపై ఆవిష్కరించడానికి ఉపయోగపడ్డాయి.

ఆనాటి ‘లవకుశ’తో ‘శ్రీరామరాజ్యం’ను పోల్చడం తగదని ఎవరు ఎంత చెప్పినా, జరిగేది అదే. దానివల్ల ఈ సినిమాకు రావలసినంత పేరు రాదు. ఎందుకంటే నందమూరి రామారావుకు సాటి మరొకరు లేరు. ‘లవకుశ’ వంటి చిత్రం మరొకటి రాదు అన్నది వాస్తవం. ఈ సినిమా ప్రారంభమే కాస్తంత నిరాశకు గురిచేస్తుంది. ఎలాంటి ఉపోద్ఘాతం, వ్యాఖ్యానం లేకుండా సీతా సమైతుడైన రాముడు పుష్పకంలో రావడం అంతగా నప్పలేదు. సీతారాముల్ని హఠాత్తుగాచ చాలా సాదాసీదాగా తెరమీద చూపినట్టు అయింది. ఇలాంటి చిన్న చిన్న అసంతృప్తులు కొన్ని ఉన్నా. తమ శక్తిసామర్థ్యాల మేరకు అందివచ్చిన నూతన సాంకేతిక వనరులను వినియోగించుకుని బాపు ‘శ్రీరామరాజ్యం’ను అపురూప దృశ్యకావ్యంగా మలిచారు.

అలనాడు ‘లవకుశ’ చిత్ర నిర్మాణాకికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, అనారోగ్యాలు. వాటన్నింటినీ దాటుకుని వచ్చిన ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈనాటి ‘శ్రీరామరాజ్యం’ నిర్మాణ విషయంలో ఆ స్థాయి కష్టాలు లేకపోయినా. సినిమా ప్రారంభం కాగానే ముళ్ళపూడి వెంకట రమణ దివంగతులు కావడం, సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఇళయరాజాకు సతీవియోగం కలగడం వంటి విషాదాలు చోటు చేసుకున్నాయి. అయినా మొక్కవోని విశ్వాసంతో నిర్మాత యమంచిలి సాయిబాబు, దర్శకుడు బాపు ముందుకు సాగారు. ఈ తరానికి మరో ‘లవకుశ’ అందించారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ‘శ్రీరామరాజ్యం’ ముళ్ళపూడి వెంకట రమణకు బాపు బృందం ఇచ్చిన ఘనమైన నివాళి. దానిని ఆదరించడం, శ్రీరాముని ఆదర్శాలను అనుసరించడం ప్రేక్షకుల కర్తవ్యం.

- వడ్డి ఓంప్రకాశ్