పబ్బులకు. పార్టీలకు తిరిగినా సందీప్ కు కుటుంబ విలువలంటే ఇష్టం. అందుకే ప్రేమ పెళ్ళి కన్నా పెద్దలు నిర్ణయించే వివాహానికే మొగ్గు చూపుతాడు. వధువు ఫోటో కూడా చూడకుండా పెళ్ళికి అంగీకరిస్తాడు. అతని అభిరుచికి తగ్గట్లుగానే అయిదు రోజుల పెళ్ళిని అంగరంగవైభవంగా పెద్దలు జరిపిస్తుంటారు. అయితే పెళ్ళి చివరిలో దివాకర్ అనే క్రూరుడు దీప్తిని ఎత్తుకు పోతాడు. ఆమెను తీసుకురావడంలో పోలీసులు కూడా విఫలం అవుతారు. ఆ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సందీప్ దీప్తిని దివాకర్ నుండి రక్షిస్తాడు. అయితే, దివాకర్ వారిని వేటాడే మృగంలా వెంటాడుతూనే ఉంటాడు. అతని బారి నుండి వారెలా బయట పడ్డారనేదే ఈ చిత్ర కథాంశం.
మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పెళ్ళి వాతావరణం నేపథ్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసిన గుణశేఖర్ ని అభినందించాలి. అయితే తొలిభాగంలో ఆహ్లాదకరమైన పెళ్ళి వాతావరణంలో నడిచే ఈ చిత్రాన్ని రెండవ భాగంలో పూర్తి భిన్నమైన మొరటు యాక్షన్ లోకి దించి దెబ్బతీశారు. ప్రతినాయకుడు సినిమాలో ఉండొచ్చు కానీ, హెవీ బిల్డప్ వల్ల సినిమాలో సరళత్వంతో పాటు బ్యాలెన్స్ కూడా పోయింది. విలన్ క్యారెక్టరైజైషన్ లో ‘అరుంధతి’ని స్ఫూరిగా తీసుకున్నట్లున్నారు. ఇక, పబ్బుల్లో అమ్మాయిలతో మందేసి చిందేసే హీరోలో సంప్రదాయ భావాలుండటం విడ్డూరం. జీవిన విధానమే మనిషి ఆలోచనా విధానానికి దర్పణం. కుటుంబ విలువల పట్ల గొప్ప అభిప్రాయం ఉన్న హీరో పార్టీలకు, పబ్బులకి రెచ్చిపోయి ఎలా తిరుగుతాడో? మంచి కుటుంబానికి, చేసుకోబోయే భార్య ఎంపిక ఎంతో ముఖ్యమని చెప్పే హీరో - ఆమెను కనీసం చూడనైనా చూడకుండా పెళ్ళికి అంగీకరించడం ఏంటో? హీరో కూడా చూడట్లేదు కనుక, హీరోయిన్ ని ప్రేక్షకుల్లో కూడా సస్పెన్స్ లో పెట్టాలని అనుకోవడం బాగానే ఉంది. అయితే అంత ఆసక్తిరేకెత్తించిన ఆమె హీరోని, ఆమెను ఎత్తుకు పోయిన విలన్ ని ఆకట్టుకునేంత అందంగత్తె అయిఉండాలి కదా? అయితే ఇందులో హీరోయిన్ ఎంపిక మరీ నాసిరకంగా ఉంది. భానుశ్రీ మెహ్రా చెప్పుకోదగ్గ అందగత్తె కాకపోగా ఆమె నటనలో ఈజ్ నెస్ కూడా లేదు. పెళ్ళి వాతావరణం బాగా చూపించేందుకు దర్శకుడి కృషి మాత్రం బాగా కనిపిస్తుంది. అయితే అది కూడా మరింత హృద్యంగా చిత్రీకరించి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ కు ముందు సీన్ లో హీరోయిన్ హీరోను ముద్దు పెట్టుకోవడం, మానసికంగా అతన్ని రమించేశానని చెప్పడం ఆర్టిఫీషియల్ గా ఉంది.
అల్లు అర్జున్ పర్సనాలిటీ విషయం ఎలా ఉన్నా, బాగా చేయాలనే అతని తపన మరోసారి ‘వరుడు’ సందీప్ పాత్రలో కనిపిస్తుంది. డాన్స్ లు, ఫైట్స్ లో కూడా బాగా చేశాడు. అయితే, అతని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల పెద్దగా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇబ్బందికరంగా వినిపిస్తుంది. విలన్స్ పైకి ఒక్కడే వెళ్ళడం, ఆర్య వంటి భారీ పర్సనాలిటీని ఓడించడం వంటివి అంత కన్విన్సింగ్ గా లేవు. తమిళ హీరో ఆర్య సైకో దివాకర్ గా చాలా బాగా నటించి పాత్రకి న్యాయం చేశాడు. ఇతర పాత్రల్లో సయ్యాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, రావు రమేష్, నాజర్, నరేష్, సమీర్, సుహాసిని, అనితా చౌదరి, వినయ్ ప్రసాద్, ఆహుతి ప్రసాద్, రావికొండలరావు, రాధాకుమారి, హర్షవర్థన్, కొండవలస నటించారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ పాత్రలో నటించడం విశేషం. బ్రహ్మానందం రెండు సన్నివేశాల్లో, స్నేహా ఉల్లాల్, సునీల్, అలీ ఒక్కో సన్నివేశంలో నటించారు. మణిశర్మ పాటల్లో ‘బహుశా చెంచల’ వంటి ఒకటీ అరా పాటలే బాగున్నాయి. రీరికార్డింగ్ బాగుంది. తోట ప్రసాద్ మాటలు, వేటూరి పాటలు, రేజశేఖర్ ఫోటోగ్రఫీ, అశోక్ ఆర్ట్, ఆంథోనీ ఎడిటింగ్ బాగున్నాయి. పెట్రోల్ ట్యాకంర్ సీన్, క్లైమాక్స్ ఫైట్ లో స్టన్ శివ ప్రతిభ కనిపించింది.