ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ రచన, దర్శకత్వంలో ప్రసాద్ దేవినేని, శోభా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ధనవంతుల అమ్మాయిని స్వంతం చేసుకోవడానికి లేని గొప్పలు చెప్పుకుంటూ తిప్పలుపడే కేబుల్ రాజు... సమాజంతో సంబంధం లేకుండా ‘రాక్ స్టార్’గా ఎదగడమే ధ్యేయం అయిన వివేక్ చక్రవర్తి... ఎప్పటికైనా స్వంత కంపెనీ పెట్టాలనుకునే వేశ్య అమలాపురం సరోజ... వెట్టి చాకిరి నుండి మనవడిని విడిపించి చదివించుకోవాలని, కోడలి కిడ్నీ అమ్ముకునే నేత కార్మికుడు రాములు... మతవాదుల చేతుల్లో అకారణంగా అన్యాయానికి గురయిన ముస్లిం రహీమ్ ఖురేషి... ఈ అయిదుగురి జీవితాలు... అయిదు కథలుగా దేనికదే సాగుతూ- సినిమా చివరికి ఓ హాస్పిటల్లో కలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి.
సమాజంలోని వాస్తవికతను చెబుతూ ‘గమ్యం’తో తెలుగు తెరకు కొత్త దృక్కోణాన్ని చూపిన రాధాకృష్ణ, ఈ చిత్రంలోనూ అదే ప్రయత్నాన్ని మరింత విస్తృతస్థాయిలో చేసి విజయవంతం అయ్యారు. మొదట కొత్తవారితో చేయాలనుకున్న ఈ చిత్రాన్ని తారాస్థాయిలో చేయడానికి కారకుడైన అల్లు అర్జున్ ని అభినందించాలి. ఎంతమంచి విషయాన్ని అయినా ప్రజాకర్షణగల ఆర్టిస్టులతో చెప్పినప్పుడే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. అయిదు భిన్నమైన తరగతుల మనుషులను తీసుకుని వారితో మన చుట్టూ వున్న నిజమైన పరిస్థితులను రాధాకృష్ణ నిజాయితీగా తెరకెక్కించారు. రెగ్యులర్ మసాలా సినిమాలతో చిరాకెత్తిన ప్రేక్షకులకు ‘వేదం’ ఎండాకాలంలో వర్షంలాంటిది. ఎవరితోనూ పనిలేదనుకునే వివేక్ చక్రవర్తి ఒక ట్రక్ డ్రైవర్ చేసిన సాయంతో కళ్ళు తెరిచి, తోటివాళ్ళ సమస్యల పట్ల స్పందించడం, డబ్బుగల అమ్మాయిని దక్కించుకోవడానికి కొంత డబ్బు సంపాయించాల్సి వస్తే, ఎన్నో దిగజారిన పనులు చేసినా చివరికి కేబుల్ రాజు పశ్చాత్తాపపడటం, కేవలం ఒళ్ళు మాత్రమే అమ్మకునే మనుషులను చూసి తన వృత్తికి స్వస్తి చెప్పడం, కోడలి కిడ్నీ అమ్ముకుని, వచ్చిన డబ్బుని కూడా పోగొట్టుకున్నా, చివరికి నేత కార్మికుడు రాములు వెట్టి చేస్తున్న మనవడిని విడిపించుకోవడం, మత ఛాందసుల వల్ల అన్నివిధాలా నష్టపోయి, టెర్రరిస్టుగా ముద్రపడినా... రహీం ఖురేషి పౌరుడిగా బాధ్యతను నెరవేర్చడం... ఈ అయిదుగురి కథల క్రమంలో మనసుని తాకే సన్నివేశాలు చాలా వున్నాయి. రాధాకృష్ణ స్క్రీన్ ప్లే కూడా కొత్తగా నడిచింది. సంభాషణలు కూడా సహజంగా బాగున్నాయి. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ఎంతగానో తోడ్పడింది. మూడ్ కి తగిన పాటలు, నేపథ్యసంగీతం అందించారు కీరవాణి. జ్ఞానశేఖర్ ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. శ్రావణ్ ఎడిటింగ్ కూడా బాగుంది.
కేబుల్ రాజుగా అల్లు అర్జున్ నటుడిగా ఒక మెట్టు ఎదిగాడు. డబ్బు సంపాదనకు అడ్డదారులు తొక్కినా మానసికంగా అతను పడే సంఘర్షణను ప్రతిభావంతంగా చూపించాడు. అమలాపురం సరోజగా అనూష్క చేయడమే నటిగా ఆమె తపనకు తార్కాణం. సరోజ పాత్రకు తగినట్టుగానే ఆహార్యంలో ఎటువంటి అరమరికలు లేకుండా, అద్భుతంగా నటించింది. వినయ్ చక్రవర్తిగా మంచు మనోజ్, నేత కార్మికుడు రాములుగా నాగయ్య, రహీమ్ ఖురేషిగా మనోజ్ వాజ్ పాయ్, అర్జున్ మిత్రుడిగా సత్యం రాజేష్, కిడ్నీ అమ్ముకునే రాములు కోడలిగా శరణ్య, భజన బృందం సుభానిగా రఘుబాబు, పోలీసు అధికారిగా డా.రవిప్రకాష్, అవినీతి పోలీసు అధికారిగా పోసాని కృష్ణమురళి, సరోజ సహచరి కర్పూరంగా చేసిన నటి తమ పాత్రలకు జీవం పోశారు. బైరాగిగా బ్రహ్మానందం కూడా ఓ సీన్లో కనిపించాడు.