భవ్య క్రియేషన్స్ పతాకంపై బి.వి.ఎస్.రవి రచన, దర్శకత్వంలో వెనిగళ్ళ ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
జీవితంలో లక్ష్యమంటూలేకుండా సరదాగా తిరిగే కుర్రాడు రాంబాబు. అతని తల్లిదండ్రులు కూడా అతన్ని ఏ పనీ చేయనీకుండా గారాంచేస్తుంటారు. నందినితో పరిచయమైన రాంబాబు ఆమె ప్రేమను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఆమె ప్రేమకోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడ్డ రాంబాబు నందిని- ప్రాణాలు ఇవ్వనక్కర్లేదు... ప్రాణాలు తీయమంటుంది. ఆమె గత జీవితాన్ని తెలుసుకున్న రాంబాబు- ఆమె లక్ష్యం నెరవేర్చడం కోసం, ఆమె కోరిన వ్యక్తులను చంపడానికి సిద్ధపడ్డారు. ఆ ప్రయత్నంలో బసివి రెడ్డి వంటి బడా మాఫియా నాయకులతో తలపడిన రాంబాబు తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనేది ఈ చిత్ర కథాంశం.
రచయిత రవి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇందులో కొంత ఆసక్తికలిగించే కథ ఉన్నప్పటికీ, దాన్ని పట్టుగా చెప్పే స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. దాంతో భారీ తారాగణం సాంకేతికవర్గం ఉన్నప్పటికీ మంచి సినిమాగా రూపొందించలేకపోయారు. చిత్రంలో హీరోకన్నా ప్రాధాన్యత వున్న హీరోయిన్ నందిని పాత్రకు నూతననటి దీక్షాసేథ్ ను ఎంపిక చేయడంలోనూ తప్పు చేశారు. ప్రతిభావంతంగా చేయాల్సిన ఆ పాత్రను దీక్ష ఏమాత్రం పండించలేకపోయింది. పాటల్లో తప్ప, కనీసం ఆమెను అందంగానైనా చూపించలేకపోయారు. ఆవారాగా తిరిగే కుర్రాడు అమ్మాయి కోసం ఎవరినైనా చంపేయడానికి సిద్ధపడటం- నమ్మేలా చెప్పలేకపోయారు. హీరోయిన్ శత్రువుల్ని చంపడానికి సిద్ధపడ్డ హీరో సరాసరి నగరంలోనే అతిపెద్ద డాన్ దగ్గరకెళ్ళి - ‘నేను మర్యాదస్తుడిని కనుక, మందుగా చెప్పి పోదామని వచ్చాను’ అంటూ చెప్పడం మరీ హాస్యాస్పదంగా వుంది. విలన్లపై పగసాధించడానికి హీరోయిన్ సరాసరి వాళ్ళ అడ్డాలోకి వెళ్ళిపోవడం వంటివి దర్శకుడి అనుభవరాహిత్యానికి ఉదాహరణగా నిలుస్తాయి. హీరోని అల్లారుముద్దు చేసే తల్లిదండ్రులుగా చంద్రమోహన్, జయసుధల పాత్రలు, నందా పేరుతో బ్రహ్మానందంతో చేయించిన కామెడీ ఉన్నంతలో కాస్త బెటర్. నాజర్ తో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు బాగున్నాయి. రసూల్ ఫొటోగ్రఫీ ఈ చిత్రంలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
సిగ్గు, భయం లేదు- అంటూ బైక్ మీద రాసుకుని బలాదూరు తిరిగే రాంబాబుగా గోపీచంద్ బాగా చేశాడు. కామెడీని యాక్షన్ ని బాగా పండించడానికి కృషి చేశాడు. బసివిరెడ్డిగా ప్రకాష్ రాజ్ పాత్రలో డెప్త్, కొత్తదనం లేవు. హీరోయిన్ తండ్రి రఘు నారాయణ్ గా నాజర్ చిన్న పాత్రలో బాగా చేశాడు. డాక్టర్ చందుగా అలీ కాసేపు కనిపించాడు. సత్యం రాజేష్, ఆహుతిప్రసాద్, ఆర్కే, రఘుబాబు, బెనర్జీ, సుబ్బరాజు, షఫీ, కల్పన, దువ్వాసి ఇతర పాత్రలు పోషించారు.
చక్రి పాటల్లో ‘ఏవో పిచ్చివేషాలు’, ‘చెప్పనా’ పాటలు ఫర్వాలేదు. సినిమా మొదటిభాగంలో రీరికార్డింగ్ అపసవ్యంగా వున్నా, రెండవ భాగంలో చాలా బాగుంది. శంకర్ ఎడిటింగ్ లో హడావుడి ఎక్కువగా వుంది. యాక్షన్ సన్నివేశాల్లో ‘అతి’ ఎక్కువగా కనిపించింది. దర్శకుడు రాసిన సంభాషణలు కూడా అంతంతమాత్రంగానే వున్నాయి. తనికెళ్ళ భరణి ఈ చిత్రంలోని పాత్రలకు నేపథ్య పరిచయం చేశాడు.