Bookmark and Share   Cinevinodam Subscribe
 
''ఏ మాయ చేసావె''
సినీవినోదం రేటింగ్‌ : 3/5

ఇందిర ప్రొడక్షన్స్‌ సమర్పణలో గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో సంజయ్‌ స్వరూప్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా దర్శకుడవ్వాలన్న తపనతో వున్న కార్తీక్‌కు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జెస్సీ పట్ల ప్రేమ పుడుతుంది. ఐలవ్‌యు చెప్పేస్తాడు. కేరళ క్రిస్టియన్‌ కుటుంబానికి చెందిన జెస్సీ, కార్తీక్‌ కన్నా రెండేళ్ళు పెద్ద. వారి పెళ్ళికి తన తండ్రి ఎంతమాత్రం అంగీకరించడని జెస్సీ చెబుతుంది. ఆ తర్వాత బంధువుల ఇంటికి కేరళ వెళ్ళిన జెస్సీని కలవడానికి కృష్ణుడు అనే మిత్రుడితో కార్తీక్‌ వెళ్తాడు. అక్కడ జెస్సీ, కార్తీక్‌ల మధ్య ప్రేమ పెరుగుతుంది. జెస్సీకి ఆమె తండ్రి వేరే పెళ్ళి చేయాలనుకుంటే, చివరి క్షణంలో ఆమె తిరస్కరిస్తుంది. తండ్రితో అనుబంధం, కార్తీక్‌తో ప్రేమ... మధ్యలో కొట్టుమిట్టాడుతున్న జెస్సీ చివరికి కార్తీక్‌తో ప్రేమను వదులుకుని విదేశాలకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మూడేళ్ళకి దర్శకుడిగా ఎదిగిన కార్తీక్‌ షూటింగ్‌ కోసం ఆ దేశం వెళ్తాడు. అక్కడ అతనికి జెస్సీ ఎదురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమాలో చూడాలి.

యాక్షన్‌ చిత్రాల స్పెషలిస్ట్‌ గౌతమ్‌ మీనన్‌ చేసిన పూర్తి ప్రేమకథా చిత్రం ఇది. పాత కథతోనే ఇప్పటి యువ ప్రేక్షకులకు కావాల్సిన కొత్త విధానంలో సినిమాని అందించాలనే ప్రయత్నంలో గౌతమ్‌ విజయవంతం అయ్యాడు. అక్కడక్కడా సాగదీసినట్లున్నా ఈ చిత్రాన్ని 'ఫీల్‌గుడ్‌ మూవీ'గానే చెప్పుకోవాలి. ప్రేమ జంటగా చేసిన నాగచైతన్య, సమంతాల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం, మనోజ్‌ పరమహంస ఫొటోగ్రఫీ, కేరళ, న్యూయార్క్‌ అందాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. హీరో హీరోయిన్ల ప్రేమ సన్నివేశాల్లో భావ వ్యక్తీకరణ కొత్తగా అనిపిస్తుంది. సున్నితమైన ముద్దు సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటాయి. కేరళలో చేసిన సన్నివేశాలు, గోవా నుండి వచ్చిన హీరోతో హీరోయిన్‌ తెగదెంపులు చేసుకోవడం, న్యూయార్క్‌లో తిరిగి కలిసిన సన్నివేశాలు బాగున్నాయి. ఉమర్జీ అనురాధ సంభాషణలు బాగున్నాయి. క్లైమాక్స్‌ సన్నివేశాలను ఈ సినిమా తమిళ్‌ వెర్షన్‌ను ఉపయోగించుకుని, సినిమా విధానంలోనే చేయడం దర్శకుడి సృజనాత్మకతకి మచ్చుతునక.

కార్తీక్‌గా నాగచైతన్య బాగా చేశాడు. యాక్షన్‌ కన్నా ప్రేమకథల్లోనే బాగా రాణిస్తాడనిపించింది. డైలాగ్‌ మాడ్యులేషన్‌లో, డాన్స్‌లో అభివృద్ధి కనిపించింది. అయితే ముఖ కవళికలు చూపేటప్పుడు కెమేరా యాంగిల్స్‌ విషయంలో జాగ్రత్తపడాలి. కథానాయిక సమంత అందంగా వుంది. పాత్రకి అనుగుణంగా బాగా చేసింది. ఆమెకు చిన్మయి చెప్పిన డబ్బింగ్‌ అదనపు ఆకర్షణ అయ్యింది. హీరో ఫ్రెండ్‌గా కృష్ణుడు మరో ప్రధానమైన పాత్ర బాగా చేశాడు. అయితే అతని డైలాగ్‌లు మాత్రం ఈ సినిమా మూడ్‌కి భిన్నంగా బిగ్గరగా వినిపిస్తాయి. దేవన్‌, సురేఖావాణి, సంజయ్‌ స్వరూప్‌, సుధీర్‌, లక్ష్మీరామకృష్ణన్‌ ఇతర పాత్రలు చేశారు. సినిమా దర్శకుడిగా పూరి జగన్నాథ్‌, నటులుగా గౌతమ్‌ మీనన్‌, శింబు, త్రిష కనిపించడం ఇందులో మరో ఆకర్షణ.

రెహమాన్‌ పాటల్లో 'కుందనపు బొమ్మా'తోపాటు అన్నీ చిత్రీకరణతో సహా మోడ్రన్‌ స్టైల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'మనసా మళ్ళీ మళ్ళీ చూసా' క్లైమాక్స్‌కి ముందు సినిమాకు హుషారునిచ్చింది. ఓ సందర్భంలో 'స్వస్తి స్వస్తి' అంటూ ఓ మలయాళ పాటను పెట్టడం విశేషం. రీరికార్డింగ్‌ కూడా కొత్తగా వుంది. ఆంథోనీ ఎడిటింగ్‌ బాగుంది.

- రాజేష్‌
 

Copy right reserved for www.cinevinodam.com 2005