టీవి న్యూస్
 
 
 
 
దాసరి ‘శివరంజని’
సౌభాగ్య మీడియా పతాకంపై దాసరి పద్మ నిర్మాతగా ‘శివరంజని’ సీరియల్ నిర్మించారు. ‘మాటివి’లో ఈ సీరియల్ ఈ నెల 12 నుండి సోమవారం నుండి గురువారం వరకూ రాత్రి 8.30 కు ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ‘మా’ అద్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ - ‘శివరంజని’ సినిమాలానే ప్రతి ఇంటా చెప్పుకునేలా ఈ సీరియల్ ఉంటుంది. గ్రామీణ వాతావరణంలో ఆత్మీయత, అనుబంధాలను చూపించే ఈ సీరియల్ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని అన్నారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘శివరంజని’ రాగం అంటే నాకు ఇష్టం. మా బ్యానర్ పై తొలిచిత్రం ‘శివరంజని’. అది ఓ చిరిత్ర సృష్టించింది. రామాయణం, భారతం టివిలో చూసినప్పటి నుండీ నాకు బుల్లితెరపై మమకారం ఏర్పడింది. అప్పట్లో భారీ స్థాయిలో ‘విశ్వామిత్ర’ రూపొందించాను. మా శ్రీమతి ప్రోత్సాహంతో ఇటవీల నిర్మించిన ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’ పెద్ద హిట్ అయ్యాయి. డబ్బింగ్ సీరియల్స్ కబంధ హస్తాల నుండి తెలుగు సీరియల్స్ ని బయటికి తేవాలని ప్రయత్నించి సఫలమయ్యాను. ప్రస్తుతం ఉద్వేగాన్ని కోరుకునే ప్రేక్షకులే సినిమాలకి వెళ్తున్నారు. నిజమైన ప్రేక్షకులు ఇంటిలోనే టివి చూస్తున్నారు. టివిలో మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ‘శివరంజని’ నేను ఎక్కువ శ్రద్ధ పెట్టి అవుట్ డోర్ లో నిర్మించిన సీరియల్. ఇందులో కమర్షియల్ అంశాలు ఉండవు. జీవితం ఉంటుంది. బంధాలు, అనుబంధాలు ఉంటాయి - అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ‘మాటివి’ సి.ఇ.ఓ. శరత్ మరార్, దర్శకుడు సత్యానాయుడు, సంగీత దర్శకుడు మధవ పెద్ది సురేష్, ప్రధాన పాత్రలు పోషించిన కిన్నెర, హరితేజ, భరణి, నరసింహరాజు, దాసరి పద్మ, హేమాలయ కుమారి, రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. లత వ్యాఖ్యాతగా వ్యవహరించింది.