Bookmark and 

Share   Cinevinodam Subscribe
 
‘డా. ఇందిర’గా రజని ‌‌
      బాలకృష్ణ, నాగార్జున, రాజేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖ హీరోలతో పలు చిత్రాల్లో నాయికగా నటించి ప్రేక్షకులను అలరించిన అందాలనటి రజని మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పలు డైలీ, వీక్లీ సీరియల్స్‌ అందించిన 'ఫిల్మీడియా క్రియేషన్స్‌' నిర్మిస్తున్న 'డా|| ఇందిర' ధారావాహికలో డా|| ఇందిరగా రజని ప్రధాన పాత్ర పోషిస్తోంది. '104' వంటి ఆరోగ్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెచ్‌.ఎం.ఆర్‌.ఐ. (హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఈ సీరియల్‌కు వైద్య, ఆరోగ్య సలహాలనిస్తూ పర్యవేక్షిస్తోంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన పి.చంద్రశేఖర్‌రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

రజని మాట్లాడుతూ- అర్థంలేని సెంటిమెంట్‌, కమర్షియల్‌ సీరియల్స్‌ వస్తున్న ఈ సమయంలో ప్రజారోగ్యమే పరమావధిగా 'ఫిల్మీడియా క్రియేషన్స్‌' ఈ సీరియల్‌ నిర్మించడం ఎంతైనా అభినందనీయం. ఆరోగ్య సమస్యలతో బాధపడే ప్రజానీకానికి సేవచేసే 'డా|| ఇందిర' పాత్ర ఎంతో ఉదాత్తమైనది. అందుకనే చాన్నాళ్ళుగా సినిమారంగానికి దూరంగా వున్న నేను, తిరిగి ఇందులో డా|| ఇందిరగా నటించాను. నాకు ఎంతో సంతృప్తినిచ్చిన 'డా|| ఇందిర' వీక్షకుల ఆదరణ, అభినందనలు తప్పక అందుకుంటుంది- అని అన్నారు.

పి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ - వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలు, పర్యావరణం, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు ఎటువంటి చికిత్స పొందాలి. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలనే విషయాలను ఇందులో వివరిస్తున్నాము. ఎన్నో కమర్షియల్‌ చిత్రాలను జనరంజకంగా చేసిన నాకు, ప్రజల్లో ఆరోగ్యపరమైన చైతన్యం తెచ్చే సదాశయంతో నిర్మిస్తున్న 'డా|| ఇందిర'కు దర్శకత్వం వహించడం ఎంతో ఆనందంగా వుంది- అని అన్నారు.

దూరదర్శన్‌ 'సప్తగిరి' ఛానల్‌లో ప్రతి ఆది, సోమవారాల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్‌లో రజని, వైభవ్‌, ద్వారకేష్‌, చిన్నికృష్ణ, రోజా ప్రధాన పాత్రలు పోషించారు. రాజేష్‌ నందన్‌ ఫొటోగ్రఫీ, మల్లిక్‌శర్మ సంగీతం అందిస్తున్నారు. కాన్సెప్ట్‌ : 'పద్మశ్రీ' డా||కూటికుప్పల సూర్యారావు, నిర్మాణం : ఫిల్మీడియా క్రియేషన్స్‌, దర్శకత్వం: పి.చంద్రశేఖర్‌రెడ్డి.

     
     
     
     
 
 
Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com