కొత్త గాయనీ గాయకులను పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా ‘జీ తెలుగు ఛానల్’ వారు
‘సరిగమప నువ్వా-నేనా’ అనే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమ చిత్రీకరణ
ప్రారంభం సందర్భంగా సారథీ స్టూడియోలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ
కార్యక్రమంలో ఎల్లార్ ఈశ్వరి, ఉష, తమ్మారెడ్డి భరద్వాజ, జి.అనూరాధ,
కె.ఎం.రాధాకృష్ణన్, అభిరామ్, సాహితీ, సాయిదేవ హర్షలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- ‘జీ తెలుగు’లో సరిగమప ఏడు విడతలు
ప్రసారం అయితే, మా చరిత చిత్ర సంస్థ నాలుగు విడతలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ
కార్యక్రమంలో కూడా మా సంస్థ నుండే నిర్వహిస్తున్నాం’ అన్నారు.
జీతెలుగు బిజినెస్ హెడ్ అనూరాధ మాట్లాడుతూ- ‘గతంలో జీ తెలుగు సరిగమప కార్యక్రమ
విన్నర్స్, రన్నర్స్ ను ఒక వేదిక మీదికి తీసుకువస్తోంది. వీరంతా తాజాగా ఎంపికైన గాయనీ
గాయకులతో జత కడతారు. ఈ కార్యక్రమానికి కె.ఎం.రాధాకృష్ణన్, ఉషలు జడ్జిలుగా
వ్యవహరిస్తారు. జీ తెలుగులో ప్రసారమైన ‘గడసరి అత్త - సొగసరి కోడలు’ కార్యక్రమం ద్వారా
ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. అతనితోపాటు వర్థమాన గాయని
శ్రావణ భార్గవి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ప్రతి ఎపిసోడ్లో ఓ థీమ్ ను ఎంచుకుని దాని
ఆధారంగా కార్యక్రమం నడుస్తుంది. ప్రతి ఎపిసోడ్ కు సినిమా పరిశ్రమనుండి ఒకరిని మూడవ జడ్జిగా
ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమం ఈ నెల 27నుండి ప్రతి బుధ, గురువారాల్లో రాత్రి 9గంటలకు
ప్రసారమవుతుంది’ అన్నారు. రాధాకృష్ణన్, ఉష మాట్లాడుతూ మళ్ళీ ఈ కార్యక్రమానికి
జడ్జిలుగా వ్యవహరించడం ఆనందదాయకం అన్నారు.
|