తొలి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 80ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ
ఘనంగా సంబరాలు జరుపుకుంది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన
పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
డాక్టర్ దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ప్రసన్నకుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, మురళీమోహన్,
విజయేందర్ రెడ్డి, కోటగిరి వెంకటేశ్వరరావు, వెంకటేష్, కృష్ణవేణి, కె.రాఘవ, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కె.ఎల్.నారాయణ, డాక్టర్
మోహన్ బాబు, అశోక్ కుమార్, జగ్గారావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి డి.కె.అరుణ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నటి కృష్ణవేణి, కె.రాఘవలు కేక్ కట్ చేశారు. అనంతరం దాసరి నారాయణరావు చేతుల మీదుగా పలువురు వృద్ధ కళాకారులను శాలువాలతో
సత్కరించడంతోపాటు వెబ్ సైట్ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ- ‘తెలుగు సినిమా జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
సినిమా ఎప్పుడు పుట్టింది, తెలుగు సినిమా ఎప్పుడు పుట్టింది అనేది ఇప్పటి తరానికి చాలామందికి తెలియదు. సినిమా
పుట్టిన తరువాత వజ్రోత్సవం చేయడం జరిగింది. ఇది చారిత్రాత్మక దినం. గతంలో చెయ్యలేకపోయినా ఇది ఆరంభంగా
భావించి ప్రతి సంవత్సరం ఒక పండుగగా జరుపుకుని ఆ రోజు సెలవుదినంగా ప్రకటించే కార్యక్రమం వచ్చే ఏడాది నుంచి
జరుపనున్నాము. ఎంతోమంది సేవలు అంధించారు. ఎంతోమంది త్యాగఫలమో మనం అనుభవిస్తున్నాము. మనకు
రహదారి వేసిన గొప్పవారిని మనం ఈ రోజున గుర్తు చేసుకోవలసిన అవసరంవుంది. ప్రపంచంలోనే తొలి మూకీ సినిమా
1903లో తీశారు. 1913లో తొలి భారతీయ మూకీ సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ విడుదలైంది. ఈ సినిమాను నిర్మించింది దాదా
సాహెబ్ ఫాల్కె. ఆయన పేరుమీదనే అవార్డు కూడా ఇస్తున్నారు.
1927లో వార్నర్ బ్రదర్స్ తొలి టాకీ సినిమాను తీశారు. తెలుగు సినిమాకు రఘుపతి వెంకయ్య పితామహుడు. ఆయన
సినిమా పరిశ్రమకు ఎంతో కృషి చేశారు. తన కుమారుడు ప్రకాష్ ను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పించి సినిమా తీశారు.
కొన్ని మూకీ సినిమాల అనంతరం తొలి థియేటర్ విజయవాడలో మారుతి థియేటర్ను పోతిన శ్రీనివాసరావు నిర్మించారు.
తెలుగులో మొట్టమొదటి టాకీ సినిమా ‘భక్తప్రహ్లాద’. హెచ్.ఎం.రెడ్డి గారి దర్శకత్వంలో 1931 సెప్టెంబర్ 15న ఈ సినిమాను
విడుదల చేశారు. అయితే దీని విడుదల తేదీ మీద వివాదం వుంది. అయితే పరిశోధన అనంతరం సెప్టెంబర్ 15నే కరెక్ట్ తేదీ
అని తేలింది. ఒక ప్రింటుతో విడుదలైన ఈ సినిమా రాష్ట్రం మొత్తం తిరిగింది. ఈ సినిమాను ఆర్.డి.షేర్ ఇరాని నిర్మించారు.
ఇది కేవలం ఇన్ఫార్మర్ గా చేస్తున్న ఫంక్షన్ మాత్రమే. ఇందుకోసం ఓ జెండాను రూపొందించడం జరిగింది. దాన్ని ఈ రోజు
ఆవిష్కరించాము.
ఈ రోజు సినిమా పరిశ్రమలో వున్న సీనియర్ మోస్ట్ నటి కృష్ణవేణి గారు. ఆమె ‘మనదేశం’ సినిమా ద్వారా ఎన్టీఆర్ ను
పరిచయం చేయడం జరిగింది. అలాగే కె.రాఘవ గారు ఎంతోమందిని ఆయన సినిమాల ద్వారా పరిచయం చేశారు. ఆయన
మన మధ్య వుండడం గర్వకారణం. ఈరోజు చాలా గొప్పరోజు. తెలుగు చలన చిత్ర దిగ్ దర్శకుడు కె.వి.రెడ్డి గారి 100వ
పుట్టినరోజు. ఇదేరోజున తెలుగు సినిమా పరిశ్రమ 80వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకం’ అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ- ‘తెలుగు సినిమాకు సంబంధించిన పాత ఫొటోలు ఎవరి వద్ద వున్నా, వాటిని మాకు పంపితే ఆర్కివ్స్ గా పెట్టనున్నాము. మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ తమ సహాయ సహకారాలు
అందించవలసిందిగా కోరుతున్నాము. వచ్చే ఏడాది ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా జరపడానికి ప్లాన్ చేశాము’
అన్నారు.
కార్యక్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన అన్ని విభాగాల వారు పాల్గొన్నారు.