ఆకాశమంత పందిరి... భూదేవంత అరుగు వేసి పెళ్లి చేయాలీ అంటారు మన పెద్దవాళ్లు. ఆ స్థాయిలోనే అంగరంగ వైభవంగా సాగింది యువ కథానాయకుడు
అల్లు అర్జున్ వివాహ వేడుక. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకి
హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. 10 గంటల 33 నిమిషాలకి అల్లు అర్జున్ - స్నేహారెడ్డి వేదమంత్రాల నడుమ ఒక్కటయ్యారు.
రాత్రి ఎనిమిదన్నరకు అల్లు అర్జున్‌ని కల్యాణ మంటపం వద్దకు తీసుకొచ్చారు. అల్లు అరవింద్ దంపతులు ముందురాగా, వెనుక పట్టువస్త్రాలు ధరించిన
వరుడు వచ్చాడు. సంప్రదాయం ప్రకారం వధువు కుటుంబం ఆయన కాళ్లు కడిగి వేదికపైకి తీసుకొచ్చారు. బంగారు వర్ణంలో మెరిసిపోయే పెళ్లి వేదిక
ఆహూతుల్ని ఆకట్టుకొంది. ఈ సెట్‌ను సినీ కళా దర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో తీర్చిదిద్దారు. తెలుపు, ఆకుపచ్చ రాళ్లతో కూడిన వజ్రాల ఆభరణాల్నీ,
లేత గులాబీ రంగు చీరను వధువు స్నేహ ధరించారు. వరుడు అల్లుఅర్జున్ లేత గోధుమరంగుతో కూడిన షేర్వానీ ధరించారు. 9 గంటలకు వధువు స్నేహారెడ్డి
పెళ్లి పీటలపై ఆసీనులయ్యారు. ముహూర్త సమయానికి వేదమంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాల నడుమ జీలకర్ర-బెల్లం తంతుని నిర్వహించారు. అర్జున్
మేనమామ చిరంజీవి దంపతులతోపాటు నాగబాబు, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ వేదికపై ఉండి వివాహ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా అధ్యక్షులు చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, బీజేపీ
నేత వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ఎండీ కిరణ్, రాష్ట్ర
మంత్రులు శ్రీధర్‌బాబు, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ముఖేశ్ గౌడ్, డీకే అరుణ, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, జయప్రకాష్ నారాయణ, సినీప్రముఖులు
దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, బాలకృష్ణ, శారద, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, తమిళ హీరో సూర్య, కన్నడ హీరో పునీత్
రాజ్‌కుమార్, రాజమౌళి, వినాయక్ తదితరులు హాజరయ్యారు. వివాహ కార్యక్రమం ముగిసిన తరవాత వేదికపై నుంచి అల్లు అర్జున్ మాట్లాడుతూ అతిథులకీ,
అభిమానులకీ ధన్యవాదాలు తెలిపారు.