|
వెండితెర విజేతల జాబితా వెలువడింది. సినీ అవార్డుల పండుగలో కేరళ తారలు మరోమారు వెలిగాయి. వైవిధ్యం బాటలో
నడుస్తూ ప్రేక్షకుల గుండెను తాకుతున్న బాలీవుడ్ అత్యధిక అవార్డులు అందుకుని విజయ పతాక ఎగురవేసింది. ఇంకా
చెప్పాలంటే... మలయాళం, హిందీ చిత్రాలు పోటాపోటీగా అవార్డులు సాధించాయి.
కలెక్షన్ల రికార్డులను తుత్తునియలు చేసిన తెలుగు 'మగధీర' రెండు జాతీయ అవార్డులు సాధించింది. ఈ సినిమాకు
స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కణ్నన్, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన శివశంకర్ జాతీయ అవార్డులు అందుకున్నారు.
బుధవారం 57వ జాతీయ సినీ పురస్కారాల జాబితా వెలువడింది. మలయాళ చిత్రం 'కుట్టి శ్రాంక్' జాతీయ ఉత్తమ
చిత్రంతోపాటు మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సినిమాటోగ్రఫీ,
స్క్రీన్‌ప్లే, దుస్తుల అవార్డులతోపాటు న్యాయ నిర్ణేతల ప్రత్యేక గుర్తింపు పురస్కారాన్ని కూడా సాధించింది.
ఇక... 'పా' చిత్రంలో శారీరక, మానసిక వికలాంగుడి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను అచ్చెరువొందించిన బాలీవుడ్
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డును అందుకోవడం అమితాబ్‌కు ఇది మూడోసారి.
గతంలో అగ్నిపథ్, బ్లాక్ సినిమాలు ఆయనకు ఈ అవార్డును అందించాయి. 'పా' సినిమాకు మరిన్ని అవార్డులూ
వచ్చాయి. ఉత్తమ సహాయ నటిగా అరుంధతీ నాగ్, ఉత్తమ మేకప్ క్రిస్టీన్ టిన్స్‌లే, డొమినీ టిల్‌లు అవార్డులు
అందుకున్నారు. అంతేకాదు... ఉత్తమ హిందీ చిత్రంగా కూడా 'పా' ఎన్నికైంది.
ఇక... బెంగాలీలో 'అబోహోమన్' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రీతూపర్ణా ఘోష్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు
సాధించారు. ఇదే చిత్రంలో అసమాన్య ప్రతిభ కనబరచిన నటి అనన్యా ఛటర్జీ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇదే చిత్రానికి
ఎడిటింగ్ విభాగంలోనూ అవార్డు లభించింది. కడుపుబ్బ నవ్వించే కామెడీ, కన్నీళ్లు తెప్పించే భావోద్వేగం,
ఆలోచింపచేసే నేపథ్యంతో ఆబాలగోపాలాన్ని అలరించిన 'త్రీ ఈడియట్స్' అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా విజయ
కేతనం ఎగురవేసింది. ఈ సినిమాలో హీరో 'రాంచో' వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే 'బెహతీ హవా సా థా వో'ను రచించిన
స్వానంద్ కిర్‌కెరెకు ఉత్తమ గీతం అవార్డు లభించింది.
శ్యామ్ బెగనల్ రూపొందించిన 'వెల్‌డన్ అబ్బా' ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా ఎంపికైంది. అభిషేక్ బచ్చన్ హీరోగా
నటించిన 'ఢిల్లీ 6' ఉత్తమ సామాజిక సమైక్యతా చిత్రం అవార్డు గెలుచుకుంది. ఆస్కార్‌తో సహా పలు అంతర్జాతీయ
అవార్డులు గెలుచుకున్న సౌండ్ ఇంజనీర్ రసూల్ పోకుట్టి 'కేరళ వర్మ పలాసి రాజా' చిత్రానికి జాతీయ అవార్డు
అందుకున్నారు. ఈ అవార్డును ఆయన సుభాష్ సాహూ (కమీనే), అనూప్ దేవ్ (త్రీ ఈడియట్స్)లతో కలిసి
పంచుకోనున్నారు. 'పలాసి రాజా' చిత్రానికి ఇళయరాజా ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యారు.
కమల విజేతలు
ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైన 'కుట్టీ శ్రాంక్' చిత్రాన్ని నిర్మించిన రిలయన్స్ బిగ్ పిక్చర్, దర్శకుడు షాజీ
ఎన్.కరుణ్‌లకు స్వర్ణ కమలంతోపాటు, రూ.2.50 లక్షల చొప్పున నగదు పురస్కారం లభించనుంది. 'త్రీ
ఈడియట్స్' నిర్మాత విధూ వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హీరానీలకు స్వర్ణ కమలం, రూ.2 లక్షల చొప్పున నగదు
పురస్కారం అందిస్తారు. ఉత్తమ నటుడు అమితాబ్‌కు రజత కమలంతోపాటు రూ.50వేల నగదు బముతి ఇస్తారు.
ఐదు చిత్రాల డైరెక్ట్ ఎంట్రీ
ఫీచర్ ఫిలిమ్స్, నాన్ ఫీచర్ ఫిలిమ్స్, ఫిలిమ్ రైటింగ్ విభాగాల జ్యూరీ అధ్యక్షులు ఈ అవార్డులను ప్రకటించారు. ఫీచర్
ఫిలిమ్స్ విభాగానికి రమేశ్ సిప్పీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. "తొలుత ప్రాంతీయ స్థాయిలో ఎంపిక చేసిన చిత్రాలను ఆ
తర్వాత జాతీయ స్థాయిలో పరిశీలించాం. ఈసారి విశేషమేమిటంటే... ప్రాంతీయ స్థాయిలో పరిశీలనకు నోచుకోని ఐదు
చిత్రాలను నేరుగా పరిగణనలోకి తీసుకున్నాం. ఇందులో 'నట్రంగ్' (ఉత్తమ మరాఠీ చిత్రం), హౌస్‌ఫుల్ (ఉత్తమ
గాయని) అవార్డులు దక్కించుకున్నాయి'' అని రమేశ్ సిప్పీ తెలిపారు.
'ఉత్తమ' విజేతలు...
ఉత్తమ చిత్రం: కుట్టీ శ్రాంక్ (మలయాళం)
ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పా)
ఉత్తమ దర్శకుడు : రీతూపర్ణా ఘోష్ (అబోహోమన్)
ఉత్తమ నటి: అనన్యా ఛటర్జీ (అబోహోమన్ - బెంగాలీ)
ఉత్తమ సహాయ నటుడు: ఫరూఖ్ షేక్ (లాహోర్)
ఉత్తమ సహాయ నటి: అరుంధతీ నాగ్ (పా)
ఉత్తమ సంగీత దర్శకుడు: అమిత్ త్రివేదీ (దేవ్ డి - హిందీ)
ఉత్తమ గీత రచయిత : స్వానంద్ కిర్‌కిరె (బెహతీ హవాసే - 3 ఈడియట్స్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : కమల్ కణ్నన్ (మగధీర)
ఉత్తమ కొరియోగ్రఫీ : శివశంకర్ (మగధీర)
ఉత్తమ గాయకుడు : రూపమ్ ఇస్లామ్ (మహానగర్)
ఉత్తమ గాయని : నీలాంజన సర్కార్ (హౌస్‌ఫుల్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : కుట్టీ శ్రాంక్, కమీనే (సంయుక్తంగా)
జాతీయ ఉత్తమ చిత్రం: కుట్టీ శ్రాంక్
ఉత్తమ హిందీ చిత్రం : పా
ఉత్తమ మరాఠీ చిత్రం : నట్రంగ్
ఉత్తమ వినోదాత్మక చిత్రం : 3 ఈడియట్స్
జాతీయ సమైక్యతా చిత్రం (నర్గీస్‌దత్ అవార్డు): ఢిల్లీ 6
సామాజిక సందేశాత్మక చిత్రం : వెల్‌డన్ అబ్బా
ఉత్తమ బాలల చిత్రం: పుఠానీ పార్టీ (కన్నడ), కేశు (మలయాళం) (సంయుక్తంగా)
ఉత్తమ బాల నటులు: జీవా, అన్బ కరౌస్ (సంయుక్తంగా)
|