|
16వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఘనంగా ముగిసింది. నాంపల్లిలోని లలితకళా తోరణంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన చిత్రోత్సవ ముగింపు, అవార్డుల ప్రదాన కార్యక్రమం అతిథులు, సినీ ప్రముఖుల మధ్య శోభాయమానంగా జరిగింది. చిత్రోత్సవంలో అంతర్జాతీయ పోటీ విభాగంలో ప్రదర్శించిన జర్మనీ చిత్రం 'ది క్రొకొడైల్స్' మూడు పురస్కారాలు గెల్చుకుంది. ప్రతిష్టాత్మక 'బంగారు ఏనుగు' అవార్డుతో పాటు ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాన్ని, బాలల జ్యూరీలో ప్రత్యేక ప్రశంసను ఈ చిత్రం సొంతం చేసుకుంది.
'ఆసియా పనోరమ' విభాగంలో చైనాకు చెందిన 'టూ మెన్స్ క్లాస్‌రూమ్' చిత్రం 'బంగారు ఏనుగు' అవార్డును కైవసం చేసుకుంది. మనదేశానికి చెందిన 'కిడ్స్' చిత్రం 'ఉత్తమ దర్శకుడు' విభాగంలో అవార్డు సాధించింది. ఉత్తమ 'బంగారు ఏనుగు'లు గెల్చుకున్న 'టూ మెన్స్ క్లాస్‌రూమ్' చిత్ర దర్శకుడు డాంగ్‌లింగ్, 'క్రొకొడైల్స్' చిత్ర దర్శకుడు క్రిస్టియన్ డిట్టర్‌కు ముఖ్యమంత్రి రోశయ్య పురస్కారాలు అం దజేశారు.
కేంద్ర సమాచార, ప్రసారశాఖల సహాయ మంత్రి చౌదురి మోహన్ జతువా, రాష్ట్ర సమాచార, పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి, బాలీవుడ్ నటి జూహీచావ్లా, నిర్మాత రామానాయుడు, నటులు రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీరామ్‌లు వేర్వేరు విభాగాల్లో ఉత్తమ చిత్రాలకు బంగారు, వెండి ఏనుగు పురస్కారాలను, నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రోశయ్య మాట్లాడుతూ ఈ చిత్రోత్సవం బాలలకు మరపురాని అనుభూతిని మిగులుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి చౌదురి మాట్లాడుతూ ఇలాంటి చిత్రోత్సవాలు బాలలకు మంచి విజ్ఞానం అందించడంతోబాటు ప్రపంచ సంస్కృతులు తెలుసుకొనేందుకు దోహదం చేశాయని పేర్కొన్నారు.
గీతారెడ్డి మాట్లాడుతూ దాదాపు లక్షా ఇరవై వేల మంది బాల లు ఈ చిత్రోత్సవాలను తిలకించారన్నారు. 'చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా' అధ్యక్షురాలు నందితాదాస్ మాట్లాడుతూ తాను పదవిలో చేరిన 3 నెలల్లోనే ఈ చిత్రోత్సవాలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఈ అనుభవాన్ని ఉపయోగించుకొని 2011 చిత్రోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. చిత్రోత్సవం డైరెక్టర్ సుషోవన్ బెనర్జీ, రాష్ట్ర సమాచార, ప్రసారశాఖ కమిషనర్ పార్థసారథి పాల్గొన్నారు.
అవార్డులు పొందిన చిత్రాలు
1. 'బంగారు ఏనుగు' అవార్డుకు ఎంపికైన చిత్రాలు :
ఆసియా పనోరమ విభాగం: 'టూ మెన్స్ క్లాస్‌రూమ్'(చైనా)
అంతర్జాతీయ పోటీ విభాగం: 'క్రొకొడైల్స్'(జర్మనీ)
2. లఘు విభాగంలో 'వెండి ఏనుగు' చిత్రాలు:
ఆసియా పనోరమ విభాగం: 'ఐ ఫీల్ పిటీ ఆన్ ఓజోన్ లేయర్'(ఇరాన్)
అంతర్జాతీయ పోటీ విభాగం: 'ఎలిఫెంట్స్'(యుకె)
3. ఉత్తమ 'స్క్రీన్‌ప్లే' విభాగంలో 'వెండి ఏనుగు' చిత్రాలు :
ఆసియా పనోరమ విభాగం: 'చైల్డ్ ఏంజిల్'(ఇరాన్)
అంతర్జాతీయ పోటీ విభాగం: 'క్రొకొడైల్స్'(జర్మనీ)
4. ఉత్తమ 'యానిమేషన్' విభాగంలో 'వెండి ఏనుగు' చిత్రాలు :
ఆసియా పనోరమ విభాగం: 'ది కన్నింగ్ టైలర్ అండ్ ది యంగ్ మ్యాన్'(ఇరాన్)
అంతర్జాతీయ పోటీ విభాగం: 'న్యూ స్పీషిస్'(లాత్వియా)
5. ఉత్తమ 'దర్శకత్వం' విభాగంలో 'వెండి ఏనుగు' చిత్రాలు :
ఆసియా పనోరమ విభాగం: 'కిడ్స్'(బారత్)
అంతర్జాతీయ పోటీ విభాగం: 'ఎ విచ్ ఇన్‌ది ఫ్యామిలీ'(స్వీడన్)
6. ప్రత్యేక ప్రశంసలు పొందిన చిత్రాలు :
శ్రీలంక చిత్రం 'సిరి రాజ సిరి'(బాలల జ్యూరీ)
జర్మనీ చిత్రం 'ది క్రొకొడైల్'(బాలల జ్యూరీ)
భారత్‌కు చెందిన 'ఫ్యూయల్ డ్యూయల్'(పెద్దల జ్యూరీ)
|