ఏడిదకు సన్మానం,
'సినీపూర్ణోదయం' పుస్తకావిష్కరణ

పూర్ణోదయా పతాకంపై ఆణిముత్యాల్లాంటి చిత్రాలను నిర్మించి, తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అని ప్రముఖ నటుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. సంగమ్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన 'పూర్ణోదయా మూడు దశాబ్దాల వేడుక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన తొలిచిత్రం 'తాయారమ్మా బంగారయ్య'లో తాను ఓ చిన్న పాత్రలో నటించానన్నారు. ఆ తర్వాత అదే సంస్థ బ్యానర్‌పై వచ్చిన 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' చిత్రాలలో హీరోగా నటించానని చిరంజీవి చెప్పారు. ఆ చిత్రాల్లో నటనకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నానని అన్నారు. ఇవి నటుడిగా తనకు ఆయన ఇచ్చిన మరిచిపోలేని బహుమతులని. వ్యక్తిగత జీవితంలో కూడా తన పెళ్లి ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా కె.విశ్వనాథ్‌, చిరంజీవి, ఎస్పీ బాలసుబ్రహ్మమణ్యం చేతుల మీదుగా ఏడిద నాగేశ్వరరావుకు జీవనసాఫల్య పురస్కారాన్ని అందజేశారు. యువ పాత్రికేయుడు, రచయిత పులగం చిన్నారాయణ రచించిన 'సినీ పూర్ణోదయం' పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి, తొలిప్రతిని సూర్య ఇంటర్నేషనల్‌ అధినేత పెండ్యాల హరినాథ్‌బాబుకు అందించారు. పులగం చిన్నారాయణ, ప్రచురణకర్తలు సూరిబాబు, శ్రీకాంత్‌లను చిరంజీవి చేతుల మీదుగా సత్కరించారు.

అనంతరం కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ నటి శారద ద్వారా తనకు ఏడిద నాగేశ్వరరావుతో పరిచయం అయిందని చెప్పారు. ఆ పరిచయం 30 ఏళ్లుగా సుదీర్ఘంగా సాగుతూనే ఉందన్నారు. అంతర్జాతీయస్థాయిలో గుర్తుండిపోయే సినిమాలు తమ ఇద్దరి కలయికలో వచ్చాయని, ఈ పురస్కారానికి ఏడిద పూర్తి అర్హుడు అని అన్నారు. కళాత్మక చిత్రాలను నిర్మించిన ఉత్తమాభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అని జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి అభినందించారు. సినీ వ్యాపారానికి సంస్కారాన్నీ, ధైర్యాన్ని మిళితం చేసి, ఇలాంటి సినిమాలకు కూడా డబ్బులొస్తాయి అని నిరూపించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు.

ఏడిద నాగేశ్వరరావు మాట్లాడుతూ తన 40 ఏళ్ల సినీజీవితంలో ఇది చెప్పుకోదగ్గరోజని అన్నారు. ఎన్నో ఒడిదుడుకులతో తన సినీజీవనం సాగిందని చెప్పారు. దేవుని కృప వల్ల నిర్మాతను కాగలిగాను, ముందుగా దర్శకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఈ గౌరవాలు, ఈ సత్కారాలు వారికే చెందుతాయన్నారు. మొదట్నుంచీ తన ఆలోచనా విధానం కొత్తగానే ఉండేదని, ముట్టుకోవడానికే భయపడే కథలతో సినిమాలు చేశానని చెప్పారు. ఎన్నో జాతీయ, రాష్ట్రీయ పురస్కారాలను అందుకున్నానని ఏడిద తెలిపారు.

ఈ వేడుకలో సుమన్‌, కోడి రామకృష్ణ, ఎస్పీ శైలజ, విజయచందర్‌, శరత్‌ బాబు, అలీ, మంజుభార్గవి, రాళ్లపల్లి, గుండు హనుమంతరావు, జమునారాణి, స్వరవర్షిణి రాజేందర్‌రెడ్డి, వింజమూరి సుజాత పాల్గొని ప్రసంగించారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com