|
చరిత్రలో ఇమిడిపోయిన అనేక మంది త్యాగపురుషుల కథలు చలనచిత్రాలుగా రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా
వుందని ఆదివాసి గిరిజన జాతుల సంస్కృతీ సంప్రదాయాలు తెలిపే విధంగా నిర్మాణమైన ‘కొమరం భీమ్’
విజయవంతంగా 50రోజులు పూర్తి చేసిన ఈ సందర్భంలో చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు
తెలియజేస్తున్నానని ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి తెలిపారు.
ఫిల్మీ మీడియా పతాకం అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో భూపాల్ రెడ్డి నాయకుడుగా నిర్మాణమై రాష్ట్ర ప్రభుత్వ
నంది అవార్డులను గెలుచుకున్న ‘కొమరమ్ భీమ్’ అర్థశతదిన విజయోత్సవ వేడుకలు హైదరాబాద్
ఎఫ్.డి.సి.లో జరిగాయి. ఈ సందర్భంగా ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి మాట్లాడుతూ-
చరిత్ర సంస్కృతి యువతకు స్ఫూర్తిగా వుండాలని స్వతంత్రం రాకముందు గొండు జాతుల అభివృద్ధికి తన
ప్రాణాలకు అర్పించిన కొమరం భీమ్ చిత్రం నిజమైన విజయాన్ని సాధించింది. అడవి బిడ్డలకు అండగా
ఆయన చేసిన పోరాటాల ఫలితాలు ఇప్పటికీ అనేక మందికి అందాయి.
గిరిజనుల అభివృద్ధికి ఆయన నాటిన బీజాలు దేశ వ్యాప్తంగా కృషి జరిగేటట్లు చేస్తుంది. ఈ చిత్రానికి రాష్ట్ర
్రపభుత్వ అండదండలు లభించడం, అవార్డులు రావడం ఎన్నడో విడుదలవ్వాల్సిన చిత్రం ఇప్పుడు
విడుదలవడానికి కారణమయ్యాయి. పి.సుబ్రహ్మణ్యం కోరిక ఈ విధంగా నెరవేరినందుకు చాలా
సంతోషంగా వుంది. చిన్న బడ్జెట్ లో చేసిన చిత్రాలు మంచి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటే ప్రజలు తప్పక
ఆదరిస్తారని కృషి ఈ చిత్ర విజయంతో అర్థమైందని తెలిపారు.
చిత్రదర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ- ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించడం
మాకు ఓ సవాల్ లాంటిదని, ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళందరూ ప్రశంసిస్తుంటే ఎంతో ఆనందంగా
వుందని, బి.నర్సింగరావు ఈ చిత్రాన్ని చూసి ‘మాభూమి’ చిత్రానికి కొనసాగింపుగా వుందన్నారు.
నిజాయితీగా ఈ చిత్రాన్నినిర్మించినందుకు దాసరి నారాయణరావు అభినందించడం చాలా సంతోషంగా
వుందని, ఈ చిత్ర విజయానికి కారణమైన సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు
తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి నటీ నటులకు మెమెంటోలు అందజేసి, సత్కరించారు. ఈ
కార్యక్రమంలో దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి, శంకర్, ఎన్.శాంతికుమారి, భూపాల్ రెడ్డి, ప్రాణ్
రావు తదితరులు పాల్గొన్నారు.
|