Bookmark and Share   Cinevinodam Subscribe
 
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్‌రాజ్‌
- కాంజీవరం ఉత్తమ చిత్రం
- ఉత్తమ నటిగా ఉమాశ్రీ
- 'చక్‌దే ఇండియా' ప్రజాదరణ పొందిన చిత్రం
- జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
- ప్రాంతీయ ఉత్తమానికీ నోచుకోని తెలుగు

కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరానికి 55వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. తమిళ చిత్రం కాంజీవరం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అందులో కథానాయకుడుగా నటించిన దక్షిణాది నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆయన 1998లోనే ఇరువర్‌ (తెలుగులో ఇద్దరు) చిత్రానికి ఉత్తమ సహాయనటుడు అవార్డు సాధించారు. 2003లో ప్రత్యేక జ్యూరీ అవార్డు గెలిచారు.

ఉత్తమ నటుడు స్థానానికి 'తారే జమీన్‌ పర్‌'లో నటించిన ఆమిర్‌ఖాన్‌కు, 'చక్‌దే ఇండియా'లో నటించిన షారూక్‌ఖాన్‌కు మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావించారు. అనూహ్యంగా అవార్డు ప్రకాశ్‌రాజ్‌ను వరించింది.

పెళ్లయ్యాక భార్యను కంచి పట్టుచీరలోనే ఇంటికి తెచ్చుకోవాలని కలలు కనే చేనేత కార్మికుడి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ జీవించారు. పేదరికంతో ఆయన కల నెరవేరదు. పెళ్లి సమయంలో కంచి పట్టుచీర ఇస్తానని అప్పుడే పుట్టిన కుమార్తెకు చెవిలో వాగ్దానం చేస్తాడు. అదీ నెరవేరదు. 1948 నాటి ఈ చిత్ర కథనం తమిళనాడులోని కమ్యూనిస్టు ఉద్యమంతో ముడిపడి ఉంటుంది.

కాంజీవరం దర్శకుడు ప్రియదర్శన్‌ మళయాళీ అయినా ఆయన హిందీ మసాలా చిత్రాలకు ప్రసిద్ధుడు. ఆయన తీసిన కళాత్మక చిత్రానికి రెండు జాతీయ ఉత్తమ అవార్డులు రావడం సంచలనం సృష్టించింది. మరో మళయాళీ దర్శకుడు ఆదూరు గోపాలకృష్ణన్‌కు 'నాలు పెన్నున్‌గళ్‌' చిత్రానికి ఉత్తమదర్శకుడు అవార్డు లభించింది. ఇప్పటివరకు ఆదూరుకు 7జాతీయ ఉత్తమ అవార్డులు వచ్చాయి.

నటి ఉమాశ్రీ కన్నడ భాషా చిత్రం 'గులాబీ టాకీస్‌'లో నటనకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కలర్‌టీవీ రాకతో ఒక బెస్తకాలనీ జీవితం ఎలా మారిపోయిందో తెలిపే ఈ చిత్రానికి దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి.

మహాత్మాగాంధీకి ఆయన పెద్ద కొడుకుకు మధ్య సంబంధాలను సున్నితంగా చర్చించిన 'గాంధీ మై ఫాదర్‌' చిత్రానికి మూడు అవార్డులు లభించాయి. చిత్రానికి ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించగా, అందులో గాంధీ పాత్రధారి దర్శన్‌ జరివాలాకు ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. దర్శకుడు ఫిరోజ్‌ అబ్బాస్‌ ఖాన్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు లభించింది.

ఉత్తమనటుడు అవార్డు కొద్దిలో చేజారిన బాలీవుడ్‌ అగ్ర తారలు ఆమిర్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌లకు ఊరటనిస్తూ 'తారే జమీన్‌ పర్‌'ను కుటుంబ సంక్షేమ చిత్రంగా ప్రకటించారు. 'చక్‌దే ఇండియా'ను ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ప్రకటించారు. తారే జమీన్‌ పర్‌లో 'మేరీ మా' అనే గీతానికి చక్కటి గొంతు అందించిన శంకర్‌ మహదేవన్‌కు ఉత్తమగాయకుడిగా నిలిచారు. అదేగేయాన్ని రచించిన ప్రసూన్‌జోషిని ఉత్తమ గీతరచయితగా ఎంపికయ్యారు.

'తారే జమీన్‌ పర్‌'లో అద్భుత నటన కనబరచిన దర్షీల్‌ సఫారీకి ఉత్తమ బాలనటుడు అవార్డు వస్తుందని అందరూ భావించారు. అయితే, ఈ అవార్డు మరాఠీ చిత్రం 'తింగ్యా'లో నటించిన శరద్‌ గోయకర్‌కు దక్కింది.

భావనా తల్వార్‌ నిర్మించిన 'ధర్మ్‌' చిత్రానికి నర్గిస్‌ జాతీయ సమైక్యతా అవార్డు లభించింది. హిమాలయాల్లో ఒంటరి జీవితాల్ని ప్రతిబింబించిన 'ఫ్రోజెన్‌' చిత్ర దర్శకుడు శివాజీచంద్ర భూషణ్‌కు ఉత్తమ తొలి దర్శకుడికిచ్చే ఇందిరాగాంధీ అవార్డు ప్రకటించారు.

జాతీయ అవార్డులతోపాటు ప్రాంతీయ భాషా ఉత్తమ చిత్రాల అవార్డులు కూడా ప్రకటించారు. ఎంట్రీలుగా వచ్చిన బెంగాలీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠీ, తమిళ్‌, ఇంగ్లిష్‌ చిత్రాల్లో ఒక్కో దానికి అవార్డులు ప్రకటించారు. తెలుగు విషయానికి వచ్చేసరికి వచ్చిన ఐదు ఎంట్రీల్లో ఒక్కదానికీ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికయ్యే అర్హత లేదని న్యాయ నిర్ణేతల కమిటీ అధ్యక్షురాలు సాయి పరంజాపే తేల్చారు. తెలుగు సినీ అభిమానుల్ని అలరించిన హ్యాపీడేస్‌, చందమామ, మీ శ్రేయోభిలాషి చిత్రాలతోపాటు ఓ చిన్నారి కోరిక, అమూల్యం లాంటి చిత్రాలు కూడా ఎంట్రీల్లో ఉన్నాయి. వాటన్నింటినీ కమిటీ తిరస్కరించింది. ఈ సందర్భంగా పరంజాపే మాట్లాడుతూ, ''తెలుగు సినిమాలో విషయ ప్రమాణాలు లేవు. బాగా ఖర్చుపెట్టి తీస్తున్నారు తప్ప అవార్డులకు పనికొచ్చే విధంగా ఉండటంలేదు'' అన్నారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com