|
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్‌ఏంజల్స్ కొడాక్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. 'ది హర్ట్ లాకర్' ఆరు అవార్డులను దక్కించుకొని అవార్డుల పంట పండించుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తొలిసారిగా ఒక మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అదే ఆస్కార్ పురస్కారం.
ఈ 'ఆస్కార్' అవార్డు అందుకున్న కేథరిన్ బిగెలో (58) ఈ ఏటి మేటి దర్శకురాలు. 82 సంవత్సరాల అకాడమీ పురస్కారాల చరిత్రలో ఇదో రికార్డు! యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ అవార్డుల పండుగ ఆదివారం రాత్రి లాస్ఏంజెలిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ విజేతల జాబితా వెలువడింది. అనేక ఆస్కార్‌లు నెగ్గిన వీరుడు జేమ్స్ కేమరూన్‌కు ఈసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ఇంకా చెప్పాలంటే... ఆయన మాజీ భార్య కేథరిన్ బిగెలో చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
కేమరూన్ సృష్టించిన సైంటిఫిక్ త్రీడీ ఫిక్షన్ 'అవతార్', బిగెలో రూపొందించిన వార్ థ్రిల్లర్ 'ది హర్ట్ లాకర్' మధ్య ఆస్కార్ బరిలో హోరాహోరీ పోరు జరిగింది. చివరికి... 'ది హర్ట్ లాకర్' ఆరు ఆస్కార్‌లతో విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, స్క్రీన్‌ప్లే రంగాల్లో 'ఆస్కార్' అవార్డులు దక్కించుకుంది. 'అవతార్' మాత్రం మూడు అవార్డులతో సరిపెట్టుకుంది. అందులోనూ... సాంకేతిక విభాగాలకు (ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్) మాత్రమే పరిమితమైంది.
ఉత్తమ చిత్రం, దర్శకత్వంతోపాటు సౌండ్‌మిక్సింగ్, సౌండ్ ఎడిటింగ్, సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాలలో అవతార్, ది హర్ట్ లాకర్ చిత్రాలు పోటీపడ్డాయి. వీటిలో... ఒక్క సినిమాటోగ్రఫీ విషయంలో మాత్రమే 'అవతార్'ది పైచేయి అయ్యింది. మిగిలిన అన్ని అవార్డులను 'ది హర్ట్ లాకర్' సొంతం చేసుకుంది. దర్శకత్వం విభాగంలో తనకు అవార్డు రాకపోవచ్చని జేమ్స్ కేమరూన్ ముందే ఊహించారు. 'టైటానిక్' తర్వాత తన 'అవతార్' ఉత్తమ చిత్రంగా ఎంపికవుతుందని ఆశించారు. కానీ... ఆయనకు నిరాశే ఎదురైంది. అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన బిగెలో పక్కనే కూర్చున్నారు. 'ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్‌టు కేథరిన్ బిగెలో...' అని ప్రకటించినప్పుడు ఆయన కూడా అందరితోపాటు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టారు. వావ్.. అంటూ కేకలు వేశారు. బిగెలోను మనస్ఫూర్తిగా అభినందించారు.
1989లో పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు రెండేళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. 1991లో విడిపోయారు. అయినప్పటికీ... ఇద్దరి మధ్య శత్రుత్వం లేదు. సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దీంతో తన మాజీ భార్య విజయాన్ని ఆయన సంపూర్ణంగా ఆస్వాదించారు. దర్శకత్వం విభాగంలో ఒక మహిళ ఈ పురస్కారం సాధించడం అకాడమీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా నలుగురు మహిళలు మాత్రమే ఉత్తమ దర్శకత్వం కేటగిరీలో నామినేట్ అయ్యారు. అవార్డు మాత్రం అందుకోలేకపోయారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో అనేక సంచలనాలు నమోదయ్యాయి. తొలిసారి మహిళకు ఉత్తమ దర్శకత్వ అవార్డు లభించడం ఒక సంచలనం. అదికూడా మాజీ భర్తపైనే పైచేయి సాధించడం మరో సంచలనం. అందులోనూ... ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 'అవతార్'పై, ఎవరూ ఏమాత్రం అంచనాలు పెట్టుకోని 'ది హర్ట్ లాకర్' పైచేయి సాధించడం అతిపెద్ద సంచలనం. 'ది బ్లైండ్ సైడ్' సినిమాలో నటించిన శాండ్రా బుల్లక్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఆస్కార్‌కు ఒకరోజు ముందు ఓ సంస్థ ప్రకటించే 'ఉత్తమ చెత్తనటి' అవార్డు కూడా ఆమెకే దక్కడం మరో విశేషం.
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, విదేశీ భాషా చిత్రాల కేటగిరీల్లో ప్రీషియస్, ది సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్ (అర్జెంటీనా) అవార్డులు గెలుచుకోవడం మరో సంచలనం. మొదటి ప్రపంచ యుద్ధంపై రూపొందించిన 'ది వైట్ రిబ్బన్' (జర్మనీ), ఫ్రాన్స్‌కు చెందిన 'ఎ ప్రాఫెట్'లలో ఒక సినిమాకు ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు లభించవచ్చని అత్యధికులు భావించారు. కానీ... ఇది అర్జెంటీనా సినిమాకు దక్కింది. 'ది హర్ట్ లాకర్' ఫైనాన్షియర్ నికొలస్ చార్టీర్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఒక విశేషం. ఆయన 'ఉత్తమ చిత్రం' అవార్డును సహ నిర్మాతలైన బిగెలో, గ్రెగ్ షాపిరోలతో కలిసి అందుకోవాల్సి ఉంది. కానీ... చార్టీర్ ఆస్కార్ నిబంధనలకు వ్యతిరేకంగా ఓటర్లకు ఈ-మెయిల్స్ పంపారు. దీంతో ఆయనపై 'అకాడమీ' నిర్వాహకులు నిషేధం విధించారు. ఇది కూడా ఓ సంచలనం.
ఇక ఉత్తమ నటుడిగా 'క్రేజీ హార్ట్'లో తాగుబోతు గాయకుడి పాత్ర పోషించిన జెఫ్ బ్రిడ్జెస్ అవార్డు గెలుచుకున్నారు. ఆయనను మినహాయిస్తే... నటుల కేటగిరీలో అవార్డులు గెలుచుకున్న శాండ్రా బులక్ (ఉత్తమ నటి), క్రిస్టొఫ్ వాల్స్ (ఉత్తమ సహాయ నటుడు), మోనిక్ (ఉత్తమ సహాయ నటి)లు తొలిసారి ఆస్కార్‌కు నామినేట్ కావడం మరో విశేషం. మోనిక్ ఆఫ్రో-అమెరికన్ మహిళ. 'ఆస్కార్‌లో రాజకీయాలకంటే నటనా కౌశలానికే ప్రాధాన్యం ఉంటుందని రుజువైంది' అని ఆమె స్పందించారు.
ఆమె 'ప్రీషియస్' చిత్రంలో గయ్యాళి తల్లి పాత్ర పోషించారు. గత ఏడాది 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంతో రెపరెపలాడిన భారతీయ పతాక ఈసారి ఆస్కార్ వేదికపై మచ్చుకైనా కనిపించలేదు. లఘుచిత్రంలో కేటగిరీలో నామినేట్ అయిన 'కవి' అవార్డు దక్కించుకోలేకపోయింది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కొడక్ థియేటర్‌లో మూడున్నర గంటలపాటు జరిగింది. అలెక్ బాల్డ్‌విన్, స్టీవ్ మార్టిన్‌లు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు.
ఉత్తమ నటుడు : జెఫ్ బ్రిడ్జస్ (క్రేజీహంట్)
ఉత్తమ నటి : సాండ్రా బుల్లక్ (బ్లైండ్ సైడ్)
ఉత్తమ దర్శకురాలు : కేథరిన్ బిజెలో (ది హర్ట్ లాకర్)
ఉత్తమ సహాయ నటుడు : క్రిస్టోఫ్‌వాజ్ (ఇన్‌గ్లోరియన్ బాస్టర్డ్)
ఉత్తమ సహాయ నటి : మోనిక్
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) : మార్క్‌బోల్ (ది హర్ట్ లాకర్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం : ఆవ్
ఉత్తమ డాక్యుమెంటరీ లఘుచిత్రం : మ్యూజిక్ బై ప్రూడెన్స్ (రోజర్‌రాస్ విలియమ్స్, ఎలినర్ బర్కెట్)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్) : ది వీరీ కైండ్,
చిత్రం : క్రేజీహార్ట్ (రేయన్ బింగ్ హామ్)
ఉత్తమ మేకప్ : స్టార్‌ట్రెక్
ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ : అవతార్
ఉత్తమ లఘు చిత్రం (యానిమేటడ్ ) : లోగోరమ
రిక్ కార్టర్ (ఆర్ట్ డైరెక్షన్ ) : కిమ్ సింక్లైర్ (సెట్ డెకరేషన్)
ఉత్తమ రచన (ఆడాప్టడ్ స్క్రీన్‌ప్లే) : పెసియస్
ఉత్తమ లఘు చిత్రం (లైవ్ ఏక్షన్) : ది న్యూటెనెంట్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : సాడీ పావెల్ (ది యంగ్ విక్టోరియా)
|