Bookmark and Share   Cinevinodam Subscribe
 
'రఘుపతి వెంకయ్య' విగ్రహావిష్కరణ

''సినీరంగానికి ప్రాతః స్మరణీయులు రఘుపతి వెంకయ్య. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. సభ్యసమాజంలో మన సంస్కృతిని వెల్లడించడానికి, భావి తరాలకు నిన్నటి పెద్దలను గురించి చెప్పడానికి విగ్రహావిష్కరణలు ఉపకరిస్తాయ''ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. ఆయన ఫిల్మ్‌నగర్‌లోని చలనచిత్ర వాణిజ్యమండలి సమీపంలో రఘుపతి వెంకయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ''వెంకయ్య స్వయం కృషితో ఎదిగారు. నేను ఎప్పుడూ మూకీ చూడలేదు. ఆ కాలం నుంచి సినిమారంగానికి వెంకయ్య సేవ చేశారు. ఆయన సృజనాత్మకమైన మేధస్సు అనుసరణీయం. సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి రావడానికి ఎందరో కృషి చేశారు. గతంలో వైయస్‌ కూడా ఎన్నో విధాలా సాయపడ్డార''ని అన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ''వినోదాన్ని అందించడంలోనే కాదు, విపత్తులు ఎదురైనప్పుడూ సాయం అందించడానికి సినిమా ఎప్పుడూ ముందుంటుంది. మన పూర్వీకులను మర్చిపోకుండా విగ్రహావిష్కరణల ద్వారా గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంద''ని పేర్కొన్నారు. ''రఘుపతి వెంకయ్య గురించి పాత్రికేయులు ఇంటూరి వెంకటేశ్వరరావు చాలా మందిలో అవగాహన తెచ్చారు. విగ్రహ ఏర్పాటుకు ప్రధాన కారకుడు ఇంటూరి. ఇక్కడి ప్రభుత్వాలు సినిమా పరిశ్రమను మద్రాసు నుంచి తీసుకురావడానికి ఎన్నో విధాల సహకరించాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా పరిశ్రమ కళకళలాడాలని కోరుతున్నాన''ని అక్కినేని నాగేశ్వరరావు చెప్పారు. సినిమాల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన చారిత్రక పురుషుడు రఘుపతి వెంకయ్య అని డీవీయస్‌ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు డా||డి.రామానాయుడు, జమున, కె.బి.తిలక్‌, వి.బి.రాజేంద్రప్రసాద్‌, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, ఎమ్మెస్‌ రెడ్డి, కృష్ణవేణి, ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఆహుతి ప్రసాద్‌, కోటగిరి వెంకటేశ్వరరావు, కె.ఎల్‌.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com