|
"పరుగు ఆపడం ఓ కళ' అది శోభన్‌బాబుకే చెల్లింది. తనకు తాను ఓ లకణరేఖ గీసుకొని అందులోనే జీవించిన వ్యక్తి ఆయన. మనిషి అనేవాడు ఎలా బ్రతకాలి అనడానికి సరైన నిర్వచనం శోభన్‌బాబు. ఆయన నిజమైన ఆర్ధిక శాస్త్రవేత్త. చిత్ర పరిశ్రమలో నాకున్న ఒక్కగానొక్క మిత్రుడు శోభన్‌బాబు. ఆ మహనీయుడు చరిత్రను పుస్తకరూపంలో మనకందించిన రచయిత ఆకెళ్ల రాఘవేంద్రను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఒక్క శోభన్‌బాబు చరిత్ర మాత్రమే కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మహనీయులందరి జీవిత చరిత్రలూ పుస్తకరూపంలో రావాలి. అలాంటి సత్కార్యానికి ఎవరు పూనుకున్నా సహకరించడానికి, ఆర్థిక సహకారం అందించడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను' అని దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అన్నారు. ఆకెళ్ల రాఘవేంద్ర రచించిన 'శోభన్‌బాబు జీవిత చరిత్ర'(పరుగు ఆపడం ఒక కళ) పుస్తక ఆవిష్కరణ సభలో అతిథిగా పాల్గొన్న దాసరి పై విధంగా స్పందించారు.
నటి, శాసనసభ్యురాలు జయసుధ, నిర్మాతలు రాశి నరసింహారావు, కె.వి.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్‌బాబు, రచయిత జె.కె.భారవి ఈ సమావేశానికి అతిథులుగా హాజరయ్యారు. దాసరి నారాయణరావు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని జయసుధకు అందించారు. "శోభన్‌బాబుతో ఎక్కువ సినిమాలు చేసిన కథానాయిక నేనే అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.
ఆయనది మహోన్నతమైన వ్యక్తిత్వం.' అని జయసుధ పేర్కొన్నారు. రచయిత ఆకెళ్ల రాఘవేంద్ర మాట్లాడుతూ- "ఎనిమిదిన్నర సంవత్సరాలు తెరకు దూరంగా ఉన్న ఓ నటుడు చనిపోతే రాష్ట్ర ప్రజల్లో ఇంత స్పందన ఎందుకొచ్చింది?.. అతను సాధించిందేమిటి?... ఈ ప్రశ్నలు నన్ను వెంటాడాయి. అప్పుడే ఆయన చరిత్ర పుస్తకరూపంలో తీసుకురావాలన్న ఆలోచన నాకు కలిగింది.' అని చెప్పారు.
|