|
"పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. ఎప్పుడూ కెరీర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తాను. ఈసారి పెద్ద హిట్ కొట్టాలనే లక్ష్యం పెట్టుకున్నాను. అంతకుమించి ఆశయాలేవీ లేవు' అన్నారు బర్త్‌డే బోయ్ సుశాంత్. అభిమానుల మధ్య సుశాంత్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ యువహీరో పై విధంగా స్పందించారు. ఈ వేడుకలో డా. అక్కినేని నాగేశ్వరరావు పాల్గొని, మనవడ్ని ఆశీర్వదించారు. సుశాంత్ విజయాలు సాధించాలని, తమ అభిమానులు సంస్కారవంతులని, మంచి మాత్రమే కాదు లోపాలు కూడా చెబుతుంటారని, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఏఎన్నార్ అన్నారు.
సుశాంత్ హీరోగా శ్రీ నాగ్ కార్పొరేషన్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రవిశేషాలను నాగేశ్వరరెడ్డి చెబుతూ - "నా కెరీర్‌లోనే ఇదే పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది. ఈ చిత్రకథని నాగసుశీలగారికి చెబుతున్నప్పుడు ఆమె నవ్వుతూ ఎంజాయ్ చేశారు. సినిమా ఆద్యంతం వినోదంగా ఉంటుంది. కరెంట్, కాళిదాసు చిత్రాల ద్వారా యూత్, మాస్‌కి దగ్గరైన సుశాంత్ ఈ చిత్రంతో ఫ్యామిలీస్‌కి కూడా దగ్గరవుతారు' అన్నారు. "ఇదొక క్యూట్ లవ్‌స్టోరి. ఈ చిత్రంలో నా తండ్రిగా ప్రకాష్‌రాజ్ కీలక పాత్ర చేస్తున్నారు.
నాగచైతన్య నటించిన 'ఏ మాయ చేసావె' చూశాను. చాలా నచ్చింది' అని సుశాంత్ చెప్పారు. ఈ సంస్థలో నాగార్జునతో ఓ చిత్రం నిర్మించబోతున్నామని, ఈ కథకి సంబంధించిన లైన్ విని నాగార్జున బాగుందని చెప్పారని, తమ్ముడితో ఈ బేనర్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని నాగసుశీల తెలిపారు. "సుశాంత్ నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్న చిత్రం చేయబోతున్నాడు. ఇక నాగార్జునతో నిర్మించబోయే చిత్రం ఆయన రేంజ్‌కి తగ్గ స్థాయిలో ఉంటుంది' అని నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ అన్నారు.
|