Bookmark and Share   Cinevinodam Subscribe
 
డా.వాసిరెడ్డి సీతాదేవి
టీవీ అవార్డుల ప్రదానోత్సవం

‘యువకళావాహిని’ ఆధ్వర్యంలో డా.వాసిరెడ్డి సీతాదేవి టీవీ అవార్డుల ప్రదానోత్సవం రవీంద్రభారతి వేదికపై జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రఖ్యాత నటుడు, దర్శకులు ఎం.బాలయ్య మాట్లాడుతూ- ‘బుల్లితెరపై ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచుతున్న నటుల్లో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. ఉత్తమ సాంకేతిక విలువలతో.. భారీ బడ్జెట్‌తో సీరియళ్లు నిర్మాణం అవుతున్నాయని వివరించారు. అయితే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించడమే కాదు.. కాసింత విసుగునూ తెప్పిస్తున్నాయన్నారు. నటీనటులు ప్రామ్టింగ్‌పై ఆధారపడకుండా.. సొంతంగా డైలాగులు చెబితే బాగుంటుందని’ సూచించారు.

అనంతరం నటుడు, నిర్మాత మురళీమోహన్‌ మాట్లాడుతూ- ‘బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియళ్లు ప్రతి ఇంట్లో, ప్రజల హృదయాల్లో తిష్టవేశాయన్నారు. యాంకర్‌ ఉదయభాను అందంలో, అభినయంలో మహానటి శ్రీదేవి ప్రతిబింబంలా మెరిసిపోతోందన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ.. సినీ పరిశ్రమ ఆమెలోని నటనను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేక పోయిందని బాధగా ఉంద’న్నారు.

పద్మశ్రీ డా.శోభానాయుడు మాట్లాడుతూ- ‘గాలికన్నా.. మనసుకన్నా.. వేగమైంది బుల్లితెర’ అని అన్నారు. ఎస్‌.కొండల్‌రావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రముఖ రంగస్థల నటులు డి.ఎస్‌.దీక్షితులు వ్యాఖ్యానం చెప్పారు. అంతకుముందు యువనర్తకి ప్రణతి చక్కటి హావభావాలు, అద్భుతమైన అభినయకౌశలంతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం రసరమ్యంగా సాగింది.

ఈ దశాబ్దపు ఉత్తమ నటుడిగా మురళీమోహన్‌, ఉత్తమ యాంకర్‌గా ఉదయభాను, ఉత్తమ కథానాయకుడిగా శ్రీకృష్ణకౌశిక్‌, కథానాయికగా సుజిత, దర్శకులుగా ఉదయభాస్కర్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బెంగళూరు పద్మ, ఉత్తమ టీవీ ఛానల్‌గా జెమినీ టీవీలకు డా.వాసిరెడ్డి సీతాదేవి టీవీ అవార్డులను అందజేశారు. సుందరకాండ టీవీ సిరియల్‌ నటులు జి.వి.నారాయణరావు, రిషి, రాజేశ్‌, నిర్మాత సుజాత గోపాల్‌, దర్శకుడు భాస్కర్, కెమేరామెన్ చల్ల పాండియన్ లను సత్కరించారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com