1909 సంవత్సరంలో దక్షిణాదిన తొలిసారిగా సినిమా ప్రదర్శన జరిగింది. ఈ సినిమాను ప్రదర్శించింది తెలుగు సినిమా మూలపురుషుడు రఘుపతి వెంకయ్య. సినిమా ప్రదర్శన జరిగి వందేళ్ళు అవుతున్న సందర్భంగా సీనియర్ దర్శకుడు ‘లక్షణరేఖ’ గోపాలకృష్ణ రాసిన వ్యాసం...
1873 సంవత్సరం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పుట్టిన తెలుగు బిడ్డ రఘుపతి వెంకయ్య ఫొటోగ్రఫీ మీద ఆసక్తితో మద్రాసు చేరి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఫొటో స్టూడియోను కొనసాగించి తర్వాత చిన్న చిన్న నిడివిగల చిత్రాలను, ప్రొజెక్టర్ వంటి పరికరాలను ఇతర దేశాల నుంచి తెప్పించి మద్రాసులోని విక్టోరియా హాలులో 1909లో ప్రదర్శనను ప్రారంభించారు. ప్రజలకు వినోదాన్ని అందజేసి ఆ ఉత్సాహంతో బర్మా, సిలోన్ లలో టెంట్లు వేసి ప్రదర్శన కొనసాగించారు. మద్రాసులో కూడా 1910లో ‘టెంట్ థియేటర్’ను మొదలుపెట్టి 1911లో ‘గెయిటీ’ పేరుతో పెర్మినెంట్ థియేటర్ ను నిర్మించిన ఘనత ఈయనదే. ప్రదర్శన మొదలుపెట్టిన వీరు 1912లో ఆర్.జి.టోర్నీ మొదటి నిర్మాతగా ‘పుండలిక్’ అనే చిత్రాన్ని నిర్మించారు. 1913లో ఒక గ్లాస్ స్టూడియోను నిర్మించి షూటింగ్స్ చేయడం ప్రారంభించారు. విద్యుత్ఛక్తి లేకుండా, సూర్యకాంతి ఆధారంగా షూటింగ్ చేయడం ఆయన పరిశీలనే- ఆ స్టూడియో పేరు ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’. దాంట్లోనే ‘భీష్మ’, ప్రతిజ్ఞ’, ‘గజేంద్రమోక్షం’, ‘మహాత్మ కబీర్ దాస్’ మొదలైన చిత్రాలను తీశారు. 1916లో ‘కీచక వధ’ అనే మూకీ చిత్రాన్ని నిర్మించింది నటరాజ్ మొదలియార్. అతనికే మొదటి దక్షిణ భారతీయ చిత్ర నిర్మాతగా పేరు సార్థకమయింది.
తర్వాత 1918లో ఫాల్కె ‘రాజాహరిశ్చంద్ర’ చిత్రాన్ని నిర్మించారు. అలా సినిమాల నిర్మాణం, ప్రదర్శనలు ప్రారంభం కావడంతో పోతిన శ్రీనివాసరావు విజయవాడలో మొట్టమొదటి సినిమా హాలు ‘మారుతి’ని నిర్మించారు. అది అక్టోబర్ 23న ప్రారంభమైంది.
1931 భారతదేశంలో మొదటి టాకీ చిత్రం ‘అలంఅరా’ (హిందీ)ను నిర్మించి మార్చి 14న విడుదల చేశారు. ‘కాళిదాసు’ తమిళ చిత్రం, తెలుగు ‘భక్త ప్రహ్లాద’ చిత్రం అదే సంవత్సరం విడుదలయ్యాయి. ‘భక్త ప్రహ్లాద’ చిత్రానికి హెచ్.ఎం.రెడ్డి దర్శకుడు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాభాయి నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలయ్యింది. అందులో ఎల్.వి.ప్రసాద్, చిత్రపు నరసింహారావు హాస్యనటులు. 1934లో మొదటిసారిగా మద్రాసులో చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అదే ‘సీతా కళ్యాణం’. అదే సంవత్సరం పూర్ణా పిక్చర్స్ తెలుగు చిత్ర పంపిణీ సంస్థ, పూర్ణా థియేటర్ లను నెలకొల్పారు జి.కె. మంగరాజు. అలాగే రాజమండ్రిలో కృష్ణా థియేటర్ ను నిర్మించారు నిడమర్తి సూరయ్య. 1936లో నిడమర్తి సోదరులు ‘దుర్గా టాకీస్’ స్టూడియోను రాజమండ్రిలో నెలకొల్పి ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని పుష్పవల్లి, కోడేరు రాజులతో ఆర్.నాగభూషణం, ఎస్.బి.నారాయణల దర్శకత్వంలో నిర్మించారు. 1937లో ‘దశవతారాలు’ చిత్రాన్ని నిర్మించి పది అవతారాలను 12 కానీలకు (బేడ) టిక్కెట్ కు చూపించిన ఘనత వారిదే... 1937 విశాఖపట్నంలో ‘ఆంధ్ర సినీ టోన్ స్టూడియో’ను నెలకొల్పి మోహినీ ‘భస్మాసుర’, ‘భక్త జయదేవ’ నటీనటులు రెంటచింతల, సురభి కమలాభాయిలతో నిర్మించారు. దీనికి హిరేన్ బోస్ (బెంగాలి ఆయన) దర్శకుడు కావడం విశేషం. 1938లో మద్రాస్ లోని నూటోన్, సెటాడెల్ సత్యగోల్డెన్, 1941లో శోభనాచల, 1944 జెమినీ, 1946లో ఎవియం, 1948 వాహిని స్టూడియోలు ఏర్పడ్డాయి. 1955లో హైదరాబాద్ సారథి స్టూడియో భాగ్యనగర్, ఆ తర్వాత అన్నపూర్ణ, పద్మాలయా, రామానాయుడు, రామోజీ స్టూడియోలు, సేలంలో మోడరన్ థియేటర్స్ ఎవియం, కోయంబత్తూరులో పక్షిరాజా, బెంగుళూరులో అజంతా వగైరాలతో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది. దీనికి ఆద్యుడు రఘుపతి వెంకయ్య. అందుకే ఆయన పేరుతో ప్రభుత్వం అవార్డు ఇవ్వడం జరుగుతోంది.