Bookmark and Share   Cinevinodam Subscribe
 
 
 
జన సమ్మోహనంగా చిత్ర పరిశ్రమ ‘స్పందన’

ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలకు సర్వస్వం పోగొట్టుకున్న ప్రజానీకానికి సహాయమందించేందుకు యావత్‌ తెలుగు చిత్రపరిశ్రమ ఒక్క తాటిన నిలిచి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్టార్‌నైట్‌ ‘నభూతో..’ అన్న చందాన జయప్రదమయ్యింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా మూడు రోజులు సెలవు దినాలను ప్రకటించి తెలుగు చిత్రసీమ నిర్విరామంగా చేసిన కృషి ఫలవంతమయ్యింది. హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన స్టార్ నైట్ కార్యక్రమం ద్వారా సేకరించిన 5,28,47,101 రూపాయల చెక్కును దాసరి నారాయణరావు, బాలకృష్ణ ముఖ్యమంత్రి రోశయ్యకు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ- స్టార్ నైట్ ద్వారా సేకరించి ఎంత మొత్తం ఇస్తారో దానికి ఇంకా అంత మొత్తం సిఎం సహాయనిధి నుండి ఇస్తానని, సినీ పరిశ్రమ గుర్తుగా వరద బాధితులకు సాయం చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు.ఇంత భారీఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. అంతకుముందు దాసరి నారాయణరావు మాట్లాడుతూ- తాము సేకరించిన నిధులను తమ పరిశ్రమ గుర్తుగా బాధితులకు సాయం చేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి... అధికారులు, సినీపరిశ్రమలోని ప్రముఖులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి వారి నిర్ణయం ప్రకారం సాయం చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పీఆర్పీ అధినేత చిరంజీవి, అగ్ర హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబు, కృష్ణంరాజు, రాజశేఖర్‌, రాజేంద్రప్ర సాద్‌, తమిళ హీరోలు రజనీకాంత్‌, సూర్య, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కళ్యాణ్‌రామ్‌, సిద్దార్ధ, విష్ణువర్ధన్‌బాబు, మనోజ్‌, నితిన్‌, రామ్‌, నవదీప్‌, శ్రీకాంత్‌, సుమంత్‌, నవ దీప్‌, ప్రభుదేవా, శ్రీహరి తదితరులు పాలుపంచు కున్నారు. కేంద్రమంత్రి దగ్గుబాటి పురందీశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, రాష్టమ్రంత్రులు గీతారెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి హాజర య్యారు.

సీనియర్‌ నటీమణి జమున, రోజా, సుహాసిని, రమ్యకృష్ణ, ఎమ్మేల్యే జయసుధ, ఎం.పి జయప్రదలతోపాటు ఇలియానా, జెనీలియా, కాజల్‌, ప్రియమణి, హన్సిక తదితర హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో తొలుత నుంచి క్రియాశీలక పాత్ర పోషించిన డాదాసరి నారాయణరావు స్టార్‌నైట్‌కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి తనదైన శైలిలో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. సుశీల గానంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు కోటి, కీరవాణి, మణిశర్మ, వందేమాతరం, మాధవపెద్ది సురేష్‌, శ్రీలేఖ, రమణ గోగుల, ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌, చక్రి, మిక్కి జె.మేయర్‌, రఘుకుంచె, రాధాకృష్ణ, దేవిశ్రీప్రసాద్‌ల నేతృత్వంలో యస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మనో సునీత, శ్రీకృష్ణ వంటి గాయనీగాయకులు పలు సినిమా గీతాలు ఆలపించారు. అల్లు అర్జున్‌, సిద్ధార్ధ, జెనీలియా, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, మమతామోహన్‌దాస్‌ తదితరులు చేసిన నృత్యాలు,నాటికలు ఆహుతులను అలరించాయి.

 


 

 
Copy right reserved for www.cinevinodam.com 2005