తెలుగోడి హాలీవుడ్‌ సినిమా

వైజాగ్‌లో ఇంజనీరింగ్‌ చేసి ఎమ్మెస్‌ చేసేందుకు అమెరికా వెళ్ళిన కుర్రాడు నాగేంద్ర కర్రి కి చిన్ననాటి నుండీ సినిమాలంటే మహా ఆసక్తి. అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరినప్పటికీ సినిమా పట్ల మక్కువ అతన్ని వదలలేదు. దాంతో ఉద్యోగాన్ని వదిలేసి 'ఎటర్నల్‌ మైండ్‌ ప్రొడక్షన్స్‌' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థని ప్రారంభించి 'వేర్‌ ఆర్‌ యూ 'సోఫియా' ?' అనే చిత్రం తీసాడు. ఈ తెలుగోడి హాలీవుడ్‌ సినిమా ఎలా తెరకెక్కిందో చదవండి...

నా స్కూలింగ్‌ అంతా వైజాగ్‌లోనే. నగరంలోని కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశా. నాన్న శ్రీనివాసరావు ఆర్మీ ఆఫీసర్‌, అమ్మ సుజాత గృహిణి. కుటుంబ పరిస్థితుల కారణంగా ఎక్కువగా అమ్మమ్మ దగ్గర పెరిగా. అమ్మమ్మతో కలిసి వారానికోసారైనా సినిమా చూసేవాణ్ని. ఆ ఆసక్తే చివరికి నన్ను హాలీవుడ్‌ సినిమా రూపొందించడానికి దోహద పడింది.

కాలిఫోర్నియాలో కంప్యూటర్‌లో సిస్టమ్‌ సెక్యూరిటీ, ఫైనాన్స్‌లో ఎం.ఎస్‌. చేయడానికి వెళ్ళినా నా దృష్టంతా సినిమాల మీదే ఉండేది. ఓ పక్క చదువుతూనే... మైనర్‌ ఫిలిం థియేటర్‌ ఆర్ట్స్‌లో ఏడాది కోర్సు చేశా. అమ్మ మాత్రం 'మొదట చదువు పూర్తి చేయి. ఆ తర్వాతే సినిమాలూ, గినిమాలూ' అనేది. అందుకనే చదువుపై దృష్టి సారించి కాలిఫోర్నియాలోనే ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరా. సినిమా ప్రణాళికలు మాత్రం మానలేదు. చివరికి రెండేళ్ళ క్రితం ఉద్యోగం వదిలేసి న్యూయార్క్‌ మకాం మార్చా.

'ఎటర్నల్‌ మైండ్‌ ప్రొడక్షన్స్‌'.. ఇదీ ఏడాది క్రితం నేను స్థాపించిన చిత్రనిర్మాణ సంస్థ. ఈ బ్యానర్‌ మీదే 'వేర్‌ ఆర్‌యూ సోఫియా?' తీశా. ఇదొక సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఫైనాన్స్‌ అనలిస్టుగా ఆ అనుభవంతో సినీవ్యాపారం గురించి మెలకువలను నా క్త్లెంట్లకు వివరించా. వారే నా సినిమాకు పెట్టుబడి పెట్టారు. ఈ ఆర్థికమాంద్యం రోజుల్లో పెట్టుబడి సమకూరడం కష్టమే. కానీ తక్కువ బడ్జెట్‌లో చక్కని సినిమా తీయగలిగితే ప్రపంచ స్థాయి మార్కెట్లో లాభాల పంటే. అదే చెప్పేసరికి కొందరు ముందుకొచ్చారు. నా వాటా కూడా ఉంది లెండి. నేను సంపాదించింది కొంతైతే... అమ్మ ఇచ్చినది కొంత. ఆమె ప్రోత్సాహంతోనే సినిమాను పూర్తి చేశా. అలాగే వైజాగ్‌కి చెందిన చిన్నారావనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టారు. మిగతా ఇన్వెస్టర్లంతా అమెరికన్లే.

సుమారు రెండు మిలియన్‌ డాలర్ల ఖర్చుతో రూపొందిన 'వేర్‌ ఆర్యూ సోఫియా' కథేంటో తెలుసా? ఓ పల్లెటూరికి చెందిన సోఫియా అనే జర్నలిస్ట్‌ అకస్మాత్తుగా కనబడకుండా పోతుంది. ఓ పక్క వాళ్ళ నాన్న ఆమె కోసం వెతుకుతుంటే, మరో పక్క ఆమె మరొక వ్యక్తికి ఓ కొత్త లోకాన్ని చూపిస్తుంది. సినిమా కథని 20 ఏళ్ల క్రితం సౌత్‌జెర్సీలోని హైలాండ్‌ నూర్స్‌టౌన్‌లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా అల్లుకున్నా. ఆ సంఘటనకు సంబంధించి అనేక పుస్తకాలు చదివా. ఆ గ్రామానికి వెళ్లి ప్రజలను కలవడం... వారితో మాట్లాడటం... సెమినార్‌లలోనూ, వర్క్‌షాపుల్లోనూ పాల్గొనడం ఇలా కొన్ని నెలల పాటు క్షేత్రస్థాయిలో సేకరించిన వాస్తవ వివరాలతో స్క్రిప్టు తయారు చేసుకున్నా.

ఈ సినిమా తీయడానికి స్ఫూర్తి 'హ్యాంగోవర్‌' అనే హాలీవుడ్‌ సినిమా. దీనిని రూ. 168 కోట్లతో నిర్మిస్తే, ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వారాల్లో రూ. 3200కోట్లను వసూలు చేసింది. నేను కూడా ఇలాంటి సినిమా ఎందుకు తీయకూడదు అనుకుని గత ఏడాది ఆగస్టులో ప్రారంభించి ఈ ఏడాది ఏప్రిల్‌ కల్లా దీన్ని పూర్తి చేశా.

'మాబ్‌స్టర్‌' అనే మరో హాలీవుడ్‌ సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నా. ఇందులో ప్రధానంగా హాలీవుడ్‌ నటులు నటించినా, సహనటుల కోసం ఇండియాలో వెతుకుతున్నాం. ఇప్పటికే అడిషన్‌ ప్రారంభించాం. అమ్మాయి కోసం ఓ టాలెంట్‌ హంట్‌ కూడా నిర్వహిస్తున్నాం. ఈ చిత్ర నిర్మాణం అక్టోబరులో ప్రారంభమవుతుంది. 'మాబ్‌స్టర్‌' కథంతా రెడ్‌ మాఫియా నేర ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కామ్స్‌ తదితర వాటిపై ఫోకస్‌ ఉంటుంది. మోసగాళ్ళ ఎత్తుగడలు ప్రపంచ వ్యాప్తంగా ఎలా వ్యాపించాయనే విషయం ప్రధానం. మనదేశంలో రెడ్‌ మాఫియా కార్యక్రమాలు గోవా కేంద్రంగా సాగుతున్నాయి. వీటిని మూడేళ్ళుగా స్టడీ చేశాను .

 


 

 
Copy right reserved for www.cinevinodam.com 2005