అద్భుతమైన కెమెరా పనితనంతో పలు సినిమాలను కళాఖండాలుగా తీర్చిదిద్దిన ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి 2008 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును దక్కించుకున్న తొలి సినిమాటోగ్రాఫర్‌గా రికార్డు సృష్టించారు. మూర్తి వయసు 87 ఏళ్లు. భారత్‌లో విడుద లైన తొలి సినిమా స్కోప్ చిత్రం 'కాగజ్ కే పూల్'కు మూర్తి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. కలర్ సినిమాటోగ్రఫీ ఆద్యుల్లో ఆయన ఒకరు. ఫాల్కే అవార్డు కింద రూ.10 లక్షల నగదు, స్వర్ణ కమలం, శాలువాలను అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్న వీకే మూర్తి గతంలోనే రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కొల్లగొట్టారు.
నాలుగు దశాబ్దాలపాటు చిత్ర రంగంలో పనిచేసిన ఆయన 2005లో ఐఐఎఫ్‌ఏ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డునూ అందుకున్నారు. ప్రముఖ దర్శకులు గురుదత్, శ్యాం బెనగల్, ప్రమోద్ చక్రవర్తి, జయంత్ దేశాయ్‌ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పలు ఉత్తమ చిత్రాలకూ ఆయన పనిచేశారు. ఆయ న మొత్తం 35 చిత్రాలకు పనిచేశారు. ముఖ్యంగా గురుదత్ చిత్రాలు 'కాగజ్ కే పూల్', 'సాహిబ్ బీబీ ఔర్ గులామ్', 'ప్యాసా', 'చౌద వీ కా చాంద్'ల లో మూర్తి చిత్రించిన సన్నివేశాలు పేరుగాంచాయి. నాటి తరాన్నే కాకుండా నేటి తరాన్నీ సమ్మోనపరుస్తున్న 'చౌదవీ కా చాంద్' పాటను ఆయనే చిత్రీకరించారు. భారతీయ సినిమాటోగ్రఫీలో ఆయన ఎన్నో అధునాతన పద్ధతులు ప్రవేశపెట్టారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేయడం సంతోషం కలిగించిందని మూర్తి చెప్పారు. ప్రముఖ దర్శకుడు, కెమరామెన్ గోవింద్ నిహలానీ, మూర్తికి అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారు.
1923లో మైసూరులో జన్మించిన మూర్తి బెంగళూరులోని శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ కళాశాలలో 1943-46లో సినిమాటోగ్రఫీలో డిప్లొమా చేశారు. విద్యార్థిగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1943లో జైలుకు వెళ్లారు. స్వాతంత్య్ర సమరయోధునిగా పింఛనును అందుకున్నారు. అయిదు దశాబ్దాల పాటు ముంబాయిలో గడిపిన ఆయన ప్రస్తుతం బెంగళూరులో శేష జీవితం గడుపుతున్నారు.