తెలుగు సినిమా పరిస్థితి రోజురోజుకీ మేడిపండులా మారుతోంది. గతఏడాది పట్టుమని పది విజయాలైనా
లేవు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ‘ఏ మాయ చేసావె’ ఒక్కటే హిట్ అయ్యింది. ‘అదుర్స్’, ‘నమో
వెంకటేశ’, ‘బిందాస్’, ‘లీడర్’, ‘వరుడు’ వంటి చిత్రాలు ఎంత హడావుడి చేసినా ఆర్థిక విజయం
సాధించలేదు. కథ, కథనంపై శ్రద్ధ చూపకుండా, కేవలం ఆర్భాటాలకే కోట్లు తగలేస్తూ సినిమా రంగాన్ని
కుదేలు చేస్తున్నారు.
సున్నితమైన ప్రేమని సహజమైన విధానంలో చూపించిన నాగచైతన్య, గౌతంమీనన్ ల ‘ఏ మాయ చేసావె’
ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథానాయిక సమంత, రెహమాన్ సంగీతం ఇందులో ఎసెట్ అయ్యాయి. ఈ చిత్రం
హిట్ కావడానికి మరో కారణం - పరిమితమైన బడ్జెట్ లో చేయడమే. అయితే, వీరు ప్రచారం చేసుకున్నట్లు
సినిమా సూపర్ హిట్ కాలేకపోయింది.
అనేక కారణాలతో బడ్జెట్ భారీగా పెరిగిపోయిన ఎన్టీఆర్ - వినాయక్ ల ‘అదుర్స్’ పండగలో విడుదలయి
రికార్డ్ స్థాయిలోనే వసూళ్ళు సంపాయించింది. అయితే, సినిమాలో విషయం లేకపోవడంతో క్రమంగా
తగ్గిపోయాయి. తెలంగాణ వివాదం వల్ల నైజాంలో ప్రదర్శన నిలిచిపోయింది. ఈ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్స్
కూడా హైప్ క్రియేట్ చేయడం కోసం పెద్దపెద్ద అంకెల్లో ప్రకటించారని, 155 కేంద్రాల్లో 50రోజులు నడిచిందని
చెప్పినప్పటికీ పెట్టుబడిని రాబట్టలేకపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పండగలో విడుదలైన వెంకటేష్ - శ్రీనువైట్ల ‘నమో వెంకటేశ’ కూడా ఓపెనింగ్ వసూళ్ళు బాగానే చేసింది.
అయితే, సినిమా పాత చింతకాయ పచ్చడిలా వుండటంతో త్వరలోనే వసూళ్ళు తగ్గిపోయాయి. 152
కేంద్రాల్లో 50రోజులు నడిచిందని, చెప్పినప్పటికీ దీన్ని విజయవంతమైన చిత్రంగా చూపలేం. మంచు మనోజ్
- వీరు పోట్ల ‘బిందాస్’ మంచి టాక్ సంపాయించింది కానీ, వసూళ్ళు సాధించలేకపోయింది.
మంచి రాజకీయాలు కావాలంటూ చెప్పిన రానా - శేఖర్ కమ్ముల చిత్రం ‘లీడర్’ భారీ ప్రచారం వల్ల
మొదటి రెండు వారాలు బాగానే కలెక్ట్ చేసింది. అయితే, అపరిపక్వ అవగాహనతో చేసిన ఈ చిత్రం ‘ఏ
మాయ చేసావె’ విడుదలతో వసూళ్ళు కోల్పోయింది. 50రోజుల వరకూ ఎడతెరిపిలేని ప్రచారం చేసినప్పటికీ
ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేయలేదు.
మన సంప్రదాయాన్ని గొప్పగా చూపుతామని అల్లు అర్జున్ - గుణశేఖర్ లు చెప్పిన ‘వరుడు’ కూడా
మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే కథ నడపడంలో బ్యాలెన్స్ కోల్పోయి ఇబ్బంది పెట్టిన ఈ చిత్రాన్ని
ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ఈ చిత్రం మొదటి సాధించిన వసూళ్ళంటూ ఇచ్చిన అంకెలను ఎవరూ
నమ్మడంలేదు. విడుదలకు ముందే ఓవర్ బడ్జెట్ అయిన ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు కనీసం మూడవ
వంతు నష్టపోతారని పరిశీలకుల అంచనా.
|