మోహ‌న్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ `లూసీఫ‌ర్` రీమేక్

`ఆచార్య`చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే 153 వ సినిమా స్క్రిప్టును, ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసీఫర్` తెలుగు రీమేక్ లో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి స‌ర్వ‌స‌న్నాహ‌లు జరుగుతున్నాయి. సంక్రాంతి త‌ర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈసినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. `లూసీఫ‌ర్ సినిమా స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యింది. `త‌నిఒరువ‌న్` (ధృవ‌) ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. రీమేక్ క‌థ ఆయినా.. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి త‌ర్వాత సెట్స్ కెళ‌తాం. ఫిబ్ర‌వ‌రి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో  మొత్తం పూర్త‌వుతుంది. నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ..నా సినిమాల పంపిణీదారుడిగా ఆయ‌నతో ఎంతో అనుబంధం ఉంది. అయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు“అని తెలిపారు.

`మెగాస్టార్ చిరంజీవి న‌టించిన హిట్ల‌ర్ (ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌కుడు‌) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాను. ఇప్పుడు ఆయ‌న‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం అదృష్ఠం ద‌క్క‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం` అని ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా అన్నారు .

ఎన్.వి. ప్ర‌సాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) అండ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్ర‌సాద్ మాట్లాడుతూ..`చిరంజీవి గారి సినిమాని మోహ‌న్ రాజా తెర‌కెక్కించ‌డం చాలా సంతోషంగా ఉంది. అందరికీ  న‌చ్చేలా మార్పులు చేర్పుల‌తో ఎంతో అద్భుతంగా ఈ  స్క్రిప్టును మ‌లిచి మోహ‌న్ రాజా మెప్పించారు. రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం`అని అన్నారు.

ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్ మోహ‌న్ వార‌సుడిగా మోహ‌న్ రాజా సుప‌రిచితం. ఆయ‌న త‌మిళంలో పాపుల‌ర్ డైరెక్ట‌ర్. ఐదు తెలుగు సినిమాల్ని త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు చేసిన రికార్డ్ త‌న‌కు ఉంది. ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన `హిట్ల‌ర్` సినిమాకి ముత్యాల సుబ్బ‌య్య వ‌ద్ద మోహ‌న్ రాజా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటార‌నే అభిమానులు భావిస్తున్నారు.  త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `త‌ని ఒరువ‌న్` (జ‌యం ర‌వి హీరో) ద‌ర్శ‌కుడిగా అత‌డి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ధృవ` టైటిల్ తో ‘త‌నిఒరువ‌న్’ రీమేకై తెలుగులోనూ ఘ‌న‌విజ‌యం సాధించిన విషయం తెలిసిందే.