రంగ‌నాథ్ `రియ‌ల్ లైఫ్‌లో క్లియ‌ర్ హీరో` పుస్తకావిష్క‌ర‌ణ !

స్వ‌ర్గీయ సీనియ‌ర్ న‌టుడు రంగ‌నాథ్ చిత్ర‌, జీవిత విశేషాల‌ను సంగ్ర‌హించి రాసిన పుస్త‌కం `రియ‌ల్ లైఫ్‌లో క్లియ‌ర్ హీరో` పుస్తకావిష్క‌ర‌ణ శ‌నివారం హైద‌రాబాద్‌లోజ‌రిగింది. తొలి పుస్తకాన్ని మా అధ్య‌క్షుడు శివాజీ రాజా విడుద‌ల చేయ‌గా, వి.ఆర్‌.కె.రావు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా…

సీనియ‌ర్ న‌టుడు గిరిబాబు మాట్లాడుతూ – “1973లో నేను సినీ రంగ ప్ర‌వేశం చేస్తే, రంగ‌నాథ్‌గారు 1974లో రంగ ప్ర‌వేశం చేశారు. ఇద్ద‌రి ప్ర‌యాణంలో మంచి స్నేహితుల‌మ‌య్యాం. స్నేహ‌మేరా జీవితం సినిమాలో ఇద్ద‌రూ క‌లిసి న‌టించాం. నా బ్యాన‌ర్‌లో కూడా త‌ను న‌టించాను. రీసెంట్‌గా త‌ను న‌టించిన నీ సుఖ‌మే నే కోరుకున్నా సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు. ఇద్ద‌రం సాధక బాధ‌కాల‌ను పంచుకుంటూ ఉండేవాళ్లం. భార్య‌కు సేవ చేయ‌డం అనే విష‌యంలో రంగ‌నాథ్‌కు మించిన వ్య‌క్తి మ‌రొక‌రు లేరు. ఆయ‌న భార్య‌ యాక్సిడెంట్ కార‌ణంగా బెడ్‌పైనే క‌ద‌ల‌లేని స్థితిలో ఉన్నా, 12 ఏళ్ల పాటు ఆమెకు సేవ‌లు చేశాడు. సాధార‌ణ మాన‌వుల వ‌ల్ల అయ్యే ప‌నికాద‌ని నాకు తెలుసు. అటువంటి మ‌హానుభావుడు అర్ధాంత‌రంగ మ‌న‌ల్ని విడిచి పెట్టి పోవ‌డం బాధాక‌రం. ఈనాటి కుటుంబ వ్య‌వ‌స్థ కార‌ణంగానే, ఒంట‌రిత‌నం భ‌రించ‌లేక ఆయ‌న మ‌న‌ల్ని వ‌ద‌లి వెళ్లిపోయాడు. ఆయ‌న శిష్యుడిగా పేరు తెచ్చుకున్న ర‌మ‌ణ బాబు ఆయ‌న‌పై బుక్ రాయ‌డం చాలా మంచి విష‌యం. ఆ బుక్‌లో ర‌మణ‌బాబు నా అభిప్రాయాన్ని రాయ‌మ‌న‌గానే..రాసిచ్చాను. ర‌మ‌ణ‌బాబుగారు ఇలా త‌న గురువుగారి రుణం తీర్చుకున్నాడు“ అని తెలిపారు.

మా అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ – “ఎన్నో సినిమాల్లో హీరోగా న‌టించిన ఆయ‌న‌కు నేనే హీరోగా క‌న‌ప‌డ్డాను. అందుక‌నే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వి.ఆర్‌.కె.రావుగారు నిర్మించిన‌ మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రంలో న‌న్నే హీరోగా తీసుకున్నారు. ఇండ‌స్ట్రీలో ఇంత మంది హీరోలున్న‌ప్పుడు నాతోనే ఎందుకు సార్ సినిమాలు చేయ‌డం అంటే..నాకు నువ్వే హీరో..నీతోనే సినిమాలు చేస్తాను అనేవారాయ‌న‌. మా మ‌ధ్య మంచి అనుబంధం ఉండేది. ప‌ది మందికి దైర్యం చెప్పే వ్య‌క్తి. దుర‌దృష్ట‌వ‌శాతు మ‌న‌ల్ని విడిచిపెట్ట‌డం బాధాకరం. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు కూడా లేవు. ఆయ‌నెందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నేది పెద్ద స‌స్పెన్స్‌. ఆయ‌న క‌చ్చితంగా మ‌ళ్లీ తెలుగు ఇండ‌స్ట్రీలోనే పుట్టి ఉంటార‌ని బ‌లంగా న‌మ్ముతున్నాను“ అన్నారు.

వి.ఆర్‌.కె.రావు మాట్లాడుతూ – “రంగ‌నాథ్‌గారు మ‌హోన్న‌త వ్య‌క్తి. ముక్కు సూటిత‌నం ఆయ‌న ఆస్థి. విలాస‌వంత‌మైన జీవితం అనుభ‌వించే స్థాయి ఉన్నా, సాదాసీదాగా బ‌త‌కడం ఆయ‌న‌కే చెల్లింది. ఆయ‌న జీవించిన విధానం యువ‌త‌రానికి స్ఫూర్తి. ఆయ‌న‌లాంటి వ్య‌క్తులు అరుదుగా ఉంటారు. ఆయ‌న భార్య‌కు సేవ చేయ‌డం చూసి క‌ళ్ల వెంట నీళ్లు తిరిగాయి. నేను ఇద్ద‌రు పనివాళ్ల‌ను కూడా పంపాను. వాళ్లు కూడా మేం చేయ‌లేమ‌ని వ‌చ్చేశారు. కానీ రంగ‌నాథ్‌గారు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా త‌న భార్య‌ను చూసుకున్నారు. నా సినిమా ద్వారా ఆయ‌న‌కు నంది అవార్డు వ‌చ్చినందుకు ఆనందంగా ఉండేది. గొప్ప న‌టుడైన రంగ‌నాథ్‌గారిపై బుక్ రాసిన ర‌మ‌ణ‌బాబుగారిని అభినందిస్తున్నాను“ అని అన్నారు.

సాయి వెంక‌ట్ మాట్లాడుతూ – “రంగ‌నాథ్‌గారు నాకు బంధువు కూడా అవుతారు. ఆయ‌న మ‌ర‌ణానికి వారం ముందు కూడా నేను ఆయ‌న్ను క‌లిశాను. చాలా యాక్టివ్‌గా క‌నిపించారు. ఆయ‌నలా చేస్తార‌నుకోలేదు. రంగ‌నాథ్‌గారు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా బాధ క‌లిగించే విష‌యం. ఆయ‌న‌పై బుక్ రాసిన ర‌మ‌ణ‌బాబుగారిని ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను“ అన్నారు.

ముప్ప‌లనేని శివ మాట్లాడుతూ – “బాల‌కృష్ణ‌గారి అశోక చ‌క్ర‌వ‌ర్తి సినిమా నుండి రంగ‌నాథ్‌గారితో మంచి ప‌రిచ‌యం ఉండేది. షాట్ గ్యాప్‌లో ఆయ‌నెన్నో క‌విత‌లు కూడా వినిపిస్తుండేవారు. ఆయ‌న్ను చూసే భార్యభ‌ర్త‌ల బంధం తెలుస్తుంది. సంస్కార‌వంత‌మైన న‌టుడు. ఆయ‌న మ‌న మ‌ద్య లేక‌పోవ‌డం విచార‌క‌రం. ఆయ‌న‌పై బుక్ రాసిన ర‌మ‌ణ బాబుగారిని ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను“ అన్నారు.

మాజీ డీజీపీ సి.ఎన్‌.గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ – “ర‌మ‌ణ‌బాబుగారు మంచి వ్య‌క్తిపై మంచి పుస్త‌కాన్ని రాశారు. రంగ‌నాథ్‌గారి శిష్యుడిగా, ఆయ‌న రుణం తీర్చుకున్నారు ర‌మ‌ణ‌బాబు. నేటి కుటుంబ వ్య‌వ‌స్థ కార‌ణంగానే రంగ‌నాథ్‌గారు మ‌న‌ల్ని విడిచిపెట్టి వెళ్లార‌నిపించింది. నాకు కూడా బంధువే. మ‌హాన‌టుడు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం బాధాక‌రం“ అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ – “నేను వార్త‌లో జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుండి రంగ‌నాథ్‌గారిని రెగ్యుల‌ర్‌గా క‌లిసేవాడిని. ఆయ‌న క‌విత‌లు చ‌క్క‌గా చెప్పేవారు. ఆయ‌న అకాల మ‌ర‌ణం న‌న్ను షాక్‌కు గురి చేసింది. ఆయ‌నెక్క‌డున్నా, ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. ర‌మ‌ణ‌బాబుగారు మంచి పుస్తకాన్ని రాశారు“ అన్నారు.

రామ్‌జ‌గ‌న్ మాట్లాడుతూ – “రంగ‌నాథ్‌గారు చ‌నిపోవ‌డానికి ముందు ఓ సీరియ‌ల్‌లో ఆయ‌న‌కు కొడుకుగా న‌టించాను. మా మ‌ధ్య డిస్క‌ష‌న్స్ వ‌చ్చేవి. నిలువెత్తు సంస్కారానికి ఆయ‌న మంచి ఉదాహ‌ర‌ణ. రంగ‌నాథ్‌గారిపై బుక్ రాయ‌డం చాలా మంచి విష‌యం. రమ‌ణ‌బాబుగారు ఇంకా మ‌రిన్ని విష‌యాలు సేక‌రించి, ఇంకా పెద్ద పుస్త‌కాన్ని తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

పుస్త‌క ర‌చ‌యిత పి.ర‌మ‌ణ‌బాబు మాట్లాడుతూ – “ఈ పుస్త‌కం నేను రాయ‌డానికి చాలా మంది పెద్ద‌లు న‌న్నెంతో ప్రోత్స‌హించారు. ముఖ్యంగా శివాజీరాజాగారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. వక్త‌లు కోర‌కున్న విధంగానే మ‌రో పుస్త‌కానికి అంకురార్ప‌ణ చేస్తాను“ అన్నారు.