నవ్వించి.. ఏడిపించే సోహైల్‌ ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’

ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’.  డిసెంబర్ 30న రిలీజ్. ఈ సంద‌ర్బంగా ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈవెంట్‌లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి సోహైల్ తండ్రి సలీమ్‌కి అందించారు.

ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాల‌కు సంబందించి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్ ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారు. కొర‌మీను టీమ్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆహ్వానించారు. ఎందుకంటే డిసెంబ‌ర్ 31న కొర‌మీను సినిమా రిలీజ్ అవుతుంది. ఒక‌రికొక‌రు స‌పోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే స‌రికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం ప‌లికాయి. ఈ సంద‌ర్భంగా  కొర‌మీను సినిమా హీరో ఆనంద్ ర‌వి, హీరోయిన్ కిశోరి ధ‌త్రిక్.. ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథులుగా విచ్చేసి ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. 

హీరో సోహెల్ మాట్లాడుతూ.. ‘ ప్రతీ సక్సెస్ మెన్ వెనుక ఉమెన్ ఉంటుందని అంటారు. కానీ నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడు. నాకు సినిమా తప్ప ఇంకోటి తెలీదు. మా నిర్మాత హరిత గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ అభి ఎంతో కష్టపడ్డారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. సినిమాలో నటించిన రాజా రవీంద్ర, దేవీ ప్రసాద్, షానీ అన్న ఇలా అందరికీ థాంక్స్. తెలుగు ప్రజలే నా ధైర్యం. మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అనూప్ అన్న మంచి సంగీతాన్ని అందించారు. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంది. హరిత గారు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు, ఏడుస్తారు. డిసెంబర్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

డైరెక్టర్ అభి మాట్లాడుతూ.. ‘మనలో ప్యాషన్ ఉంటే ఏదైనా చేయగలం. కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ రావడం మాత్రం పక్కా. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు. ఇకపై నా సినిమాలన్నింటికి కెమెరామెన్‌గా ఆండ్రూ సారే ఉంటారు. అనూప్ సర్‌ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌. మోక్ష చాలా బాగా నటించారు. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. సోహైల్‌ ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ నాకు తెలుసు. కానీ ఎంత మందికి సాయం చేస్తారో మీకు తెలీదు. అవుట్ సైడ్ కాదు ఇన్ సైడ్ కూడా బ్యూటీఫుల్. నేను ఏం చేయలేను.. దేనికి పనికి రాను అనే సమయంలో హరిత నన్ను నమ్మింది . నాది లక్కీ కాదు.. అంతకు మించి. ప్రతీ క్రాఫ్ట్‌లో హరిత ఇన్వాల్వ్ అయింది. ఆమె ఓ మంచి నిర్మాత. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు’ అని అన్నారు.

నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేం ఇక్కడ ఉన్నామంటే ఆ భగవంతుడి దయ. నేను ఏ పని చేసినా దైవంగానే భావిస్తాను. అభికి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందని నాకు అర్థమైంది. అభి తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికను తీర్చాలని అనుకున్నాను. అందుకే మా ప్రతీ చెమట చుక్కని డబ్బుగా మార్చి ఈ సినిమాను తీశాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా ఇది మాకు చాలా పెద్ద సినిమా. కంటెంట్ ఉన్న మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్‌ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. సోహైల్‌ చాలా మంచి అబ్బాయి. ఎంతో కష్టపడతాడు. కాస్త షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. మనిషి కదా? అన్ని ఎమోషన్స్ ఉండాలి. సోహెల్ మంచి నటుడు. సోహెల్ పక్కా హీరో పీస్. మేం చేసిన పనిని గుర్తించండి’ అని అన్నారు.

కొరమీను హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. ‘మా సినిమాలు పోటీలో దిగుతున్నా కూడా ఇలా ఆరోగ్యకరమైన వాతావరణంతో మమ్మల్ని పిలిచినందుకు ఆనందంగా ఉంది. లక్కీ లక్ష్మణ్ ట్రైలర్ చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ చిత్రం డిసెంబర్‌ 30న రాబోతోంది’ అని అన్నారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘సోహైల్‌ను ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలోకి ఇప్పుడు మేం అధికారికంగా స్వాగతిస్తున్నాం. మోక్షది పాజిటివ్ స్మైల్. లక్కీ స్మైల్. నిర్మాతగా హరిత ఆసక్తిని చూస్తుంటే మున్ముందు మరిన్ని సినిమాలు చేసేలా ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. డైరెక్టర్ అభి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను చేసినట్టుగా కనిపిస్తోంది. నా బ్రదర్ అనూప్‌ మ్యూజిక్ చేశాడు కాబట్టి ఎలాగూ బాగానే ఉంటుంది. సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.