విజువల్ వండర్ గా సల్మాన్ సర్కస్‌ సాంగ్

రెగ్యులర్‌ కమర్షియల్‌ కథాంశాలకు కాలం చెల్లింది.  ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించేందుకు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆ కోవలోనే సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న ‘భారత్‌’ సినిమా లో ఓ పాటను భారీ స్థాయిలో చిత్రీకరించబోతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్‌ సినీ చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా స్లో మోషన్‌ విధానంలో ఈ పాటను చిత్రీకరించనున్నారట. ఈ డాన్స్‌లో నాయకానాయికలు సల్మాన్‌, దిశాపటానితోపాటు 500 మంది బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్లు కనిపిస్తారని, సల్మాన్‌పై సర్కస్‌ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని తెలుస్తోంది. 1960-70 టైమ్‌లో మన దేశంలో రష్యన్‌ సర్కస్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఈ పాటను రష్యన్‌ సర్కస్‌ కంపెనీలకు అంకితమివ్వాలని చిత్ర బృందం భావిస్తోంది.ఈ సినిమా సర్కస్‌ నేపథ్యంలో సాగుతుంది. సల్మాన్‌, దిశా పటానీ ఇందులో సర్కస్‌ ఆర్టిస్టులుగా కనిపిస్తారు.  హీరోయిన్‌ పాత్ర నుంచి ప్రియాంక చోప్రా ఇటీవల తప్పుకోవడంతో ఆ స్థానంలో కత్రీనా కైఫ్‌ను ఎంపిక చేశారు. సౌత్‌ కొరియన్‌ చిత్రం ‘ఓత్‌ టు మై ఫాదర్‌’ను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని దర్శకులు అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తున్నారు.

కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే !

విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సల్మాన్‌ తరఫు న్యాయవాది జోధ్‌పూర్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ వేశాడు. దీనిపై న్యాయస్థానం గతంలోనే విచారణ చేపట్టగా తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని జోధ్‌పూర్‌ కోర్టు శనివారం తేల్చి చెప్పింది.  నేడు తీర్పునిస్తూ.. విదేశాలకు సల్మాన్‌ వెళ్లాలనుకునే ప్రతిసారి కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని జోధ్‌పూర్‌ కోర్టు స్పష్టం చేసింది. కృష్ణజింకల వేట కేసులో దోషిగా తేలిన సల్మాన్‌ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఏప్రిల్‌ 5న జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను విధించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటులు సోనాలి బింద్రే, సైఫ్‌ అలీ ఖాన్‌, టబు, నీలమ్‌లను నిర్దోషులుగా తేల్చారు. రెండు రోజుల పాటు జైల్లో ఉన్న సల్మాన్‌ ఏప్రిల్‌ 7న బెయిల్‌పై విడుదలయ్యాడు.