నాకు సినిమాలు రాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు!

“నేను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని.. కానీ ఒక​ ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని.. సినిమాలు తన వరకు రాకుండా కుట్ర చేస్తున్నారనీ”..ప్రముఖ సంగీత దర్శకుడు, ఏఆర్‌ రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆస్కార్‌ అవార్డు గ్రహీత రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
 
పలు భాషల్లో అద్భుతమైన స్వరాలను అందించిన రెహమాన్‌ హిందీలో ‘తమాషా’, ‘రాక్‌స్టార్’, ‘దిల్ సే’, ‘గురు’తో సహా మరికొన్ని సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు. ఆయన తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ కు స్వరాలు అందించారు.. ఇటీవల మరణించిన సుశాంత్‌కు నివాళిగా రెహమాన్‌ బృందం ‘వర్చువల్‌ మ్యూజిక్‌ కన్సర్ట్’‌ నిర్వహించారు. ఒక స్పెషల్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో రెహమాన్ తో పాటు ఇతర ప్రముఖ గాయకులు, ఈ చిత్ర గేయ రచయిత అమితాబ్ భట్టాచార్య తమదైన రీతిలో నివాళి అర్పించారు.
 
ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత బాలీవుడ్‌ పరిశ్రమలో నెపోటిజంపై పెద్ద దుమారమే రేగింది. సంగీత పరిశ్రమ మాఫియా గుప్పిట్లో చిక్కుకుందంటూ సోనూ నిగంలాంటి ప్రముఖ గాయకులు విమర్శలు చేశారు. ఇప్పుడు ‘మ్యూజిక్‌ మేస్ట్రో’ ఏఆర్‌ రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించిన కొన్ని పుకార్లు ఇండస్ట్రీలో వ్యాపించాయని..దీని వెనక ఒక గ్యాంగ్‌ ఉందని అన్నారు.. సంగీతాభిమానులు, బాలీవుడ్‌ తన నుంచి చాలా ఆశిస్తోంటే..దానికి ఒక ముఠా అడ్డుపడుతోందని ఆరోపించారు.
 
‘బాలీవుడ్ సినిమాలకు సంగీతాన్నిఎందుకు అందించ లేదని అడిగినపుడు.. తాను మంచి సినిమాలకు ఎపుడూ నో చెప్పలేదని అన్నారు. కానీ ఒక​ ముఠా తనపై పుకార్లను వ్యాప్తి చేస్తోందని..సినిమాలు తన వరకు రాకుండా కుట్ర చేస్తున్నారనీ..సమయానికి స్వరాలు ఇవ్వరనే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. రెహమాన్‌ను సంప్రదించవద్దని సలహా ఇచ్చారంటూ ‘దిల్ బెచారా’ దర్శకుడు ముఖేష్ ఛబ్రా మాటలను ఆయన ఈ సందర్బంగా గుర్తు చేసారు. రెహ‌మాన్ ద‌గ్గ‌రికి వెళ్లొద్ద‌ని బాలీవుడ్‌లో ఛబ్రాకు పలువురు చెప్పారని..కానీ ముఖేష్ ఛబ్రాకు కేవలం రెండు రోజుల్లో నాలుగు పాటలకు స్వరాలు కూర్చి ఇచ్చినట్టు తెలిపారు.