జనరంజకం.. కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ చిత్ర సమీక్ష

 సినీవినోదం రేటింగ్ : 3/5

ఎన్టీ ఆర్ ఆర్ట్స్ పతాకం పై కె. హరికృష్ణ  వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రేక్షకుల్ని సినిమా హాల్ వరకూ రప్పించడం పెను సవాలుగా మారిన ఈ రోజుల్లో కళ్యాణ్ రామ్ ఈ సినిమా విడుదల చెయ్యడం అతనికి  ‘బింబిసార’ మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం. అదీ కాకుండా వశిష్ట అనే కొత్త దర్శకుడికి ఈ  భారీ బడ్జెట్ సినిమా నిర్మాణ సారథ్యాన్ని అప్పగించడం కూడా సాహసమే. అలా వచ్చిన ‘బింబిసార’ మీద అంచనాలు ఉండటం కూడా సహజమే…

కథ…   ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ఈ సినిమాకి ట్యాగ్‌లైన్. క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యానికి అధినేత బింబిసారుడు (కళ్యాణ్ రామ్) అనే రాజు. అతి క్రూరుడైన బింబిసారుడు.. తన రాజ్యంలోని ప్రజలను తన అధికారం, అహంకారం, బలగర్వంతో ఎంతో బాధిస్తూ ఉంటాడు. ఎదురు తిరిగిన ఎంతటి వాడైనా.. తన కత్తికి బలి కావాల్సిందే. అలాంటి క్రూరుడైన బింబిసారుడుని.. తన కవల సోదరుడు దేవదత్తుడు (కళ్యాణ్ రామ్) ఎదిరిస్తాడు. దీంతో బింబిసారుడు తన సోదరుడిని చంపేందుకు ప్రయత్నించగా.. ఈ ప్రయత్నంలో బింబిసారుడిని దేవదత్తుడు ఓ మాయాదర్పణంపై విసిరేస్తాడు. ఆ మాయాదర్పణ మహత్యంతో బింబిసారుడు వర్తమాన కాలంలోకి వచ్చి పడతాడు. వర్తమాన కాలంలోకి వచ్చిన బింబిసారుడు‌కి ఎదురైన అనుభవాలు ఏంటి?  త్రిగర్తల సామ్రాజ్యం చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే…

సమీక్ష…  వశిష్ట రెండు భిన్నమైన కాలాలను సమన్వయం చేసి కధను నడిపిన తీరు బాగుంది. దాన్ని తెర‌కెక్కించిన తీరు బావుంది. నిజంగా కొత్త ద‌ర్శ‌కుడనే భావ‌న లేకుండా సినిమాను చ‌క్క‌గా ముందుకు న‌డిపించ‌టంలో వ‌శిష్ట స‌క్సెస్ అయ్యాడు.  కమర్షియల్ హంగులు అన్నీ పెట్టి  సోషియో ఫాంటసీ కథని మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా నడిపాడు. అతను ‘బింబిసార’ పాత్రని మలిచిన విధానం చాలా బాగుంది. ‘బింబిసార’తో వచ్చే సన్నివేశాలన్నీ చాలా రిచ్‌గా ఆకట్టుకునే విధంగా వున్నాయి. దీనికి తోడు పోరాట సన్నివేశాలు కూడా చాలా బాగా తీసి, ప్రేక్షకుడిలో మరింత ఉత్సుకత పెంచాడు. బింబిసారుడిని ఎలివేట్‌ చేసే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. అయితే, కొన్ని సీన్లు, విజువల్స్‌ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. రెండో సగం వీక్‌గా అనిపించినా.. మొత్తం మీద బింబిసార చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తార‌న‌టంలో సందేహం లేదు.

నటీనటులు…  నందమూరి కల్యాణ్ రామ్ నటన ఈ చిత్రంలో అతని కెరీర్‌లోనే ది బెస్ట్‌. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి  నెగెటివ్‌ పాత్రలో కల్యాణ్ రామ్‌ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్‌ చూపించిన అభినయం ఆకట్టుకుంటుంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్‌గా, రాజుగా హుందాతనాన్ని చాలా చక్కగా చూపించాడు. మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్‌ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. అదే స‌మ‌యంలో బింబిసారుడి నిధి, అత‌ని వ‌ద్ద ఉన్న అమూల్య‌మైన ధ‌న్వంత‌రి గ్రంథం కోసం విల‌న్స్ అత‌న్ని ఇబ్బంది పెట్టాల‌నుకున్న‌ప్పుడు క‌ళ్యాణ్ రామ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూపించిన హీరోయిజం బావుంది. యువరాణి ఐరాగా కేథరీన్‌ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్‌ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారికి అంతప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్‌, చమ్మక్‌ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్‌ భటేనా, ప్రకాశ్‌ రాజు, రాజీవ్‌ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రలకు న్యాయం చేసారు..

సాంకేతిక వర్గం…  ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. సన్నివేశాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్ళింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాటా అలరిస్తుంది. ఇలా ఒక్కో పాటను చిరంతన్‌ భట్‌, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. పాటల చిత్రీకరణ బాగుంది. ఇక అనిల్‌ పాడురి విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చోటా.కె. నాయుడు పనితనం స్క్రీన్ మీద చక్కగా కనపడుతుంది -రాజేష్