ఒక్కరోజు షూటింగ్ లేకపోతే నిద్ర పట్టదు !

“నటి కాకపోయుంటే…ఏమయ్యేదాన్నో ఊహించడం కష్టమే! నటించాలన్న కోరిక చిన్నతనం నుంచే ఉంది. అలాగని సినిమాలు పెద్దగా చూసేదాన్ని కూడా కాదు. కానీ ఎందుకో నటనంటే ఇష్టమేర్పడింది. ఇప్పుడు ఒక్కరోజు కెమెరా ముందు నిలబడకపోతే నిద్ర పట్టదేమో అనిపిస్తుంది. నటనకి అంత అడిక్ట్‌ అయిపోయాను. ఇప్పుడు సినిమానే నా ప్రపంచం. నా కంటూ వేరే ప్రపంచం లేదు”…అని అంటోంది అదితిరావు హైదరి.
 
ఇక్కడ చాలామంది సినీ నేపథ్యం నుంచి వచ్చినవారే ఉన్నారు. హీరోయిన్‌గా లేదా హీరోగా వారు ఎదగడానికి పెద్ద ఇబ్బంది ఏముండదు. నాలాంటివారు కష్టపడాల్సిందే. ఒక్కో సమయంలో పోరాటమే చేయాల్సి ఉంటుంది. కష్టపడకపోతే ఎవరూ గుర్తించరు. నటిగా గుర్తింపు పొందడానికి చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. వాటిని చూసి భయపడకుండా ముందుకు సాగాను కనుకే హీరోయిన్‌గా నిలదొక్కుకోగలిగాను.
గుర్తుండిపోతే చాలు అనుకుంటాను
తెలుగులో సినిమాలు చేయడానికి ప్లాన్‌ చేసి గ్యాప్‌ తీసుకోవడం లేదు. ఒక సినిమా పూర్తి అయిన తరువాతే మరో సినిమా ఒప్పుకోవడం నాకు అలవాటు. దాంతో నా సినిమాలు వరుసపెట్టి థియేటర్‌లో సందడి చేయవు కానీ, నేను మాత్రం ఖాళీగా ఉండను. తెలుగు సినిమాలు చేయడం లేదంటే.. నాకు నచ్చిన కథ రాకనే చేయడం లేదు. ‘అంతరిక్షం’ తరువాత చాలామంది చేయమని అడిగారు. కానీ మంచి సినిమాలోనూ, మంచి దర్శకులతోనూ పనిచేయాలని అనుకుంటాను. అందుకే నా పాత్రల నిడివి గురించి పట్టించుకోను. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు నా పాత్ర వారికి గుర్తుండిపోతే చాలు అనుకుంటాను. నేను గొప్ప సినిమాలు చేస్తున్నాననో, చేశాననో గర్వపడటం లేదు. నటిగా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను.