యూత్ కి నచ్చే లవ్ మ్యాజిక్ ….. ‘హలో’ చిత్ర సమీక్ష

                                          సినీవినోదం రేటింగ్ : 3/5
అన్న‌పూర్ణ స్టూడియోస్‌, మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌ బ్యానర్లపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మించారు
 
శీను(అఖిల్‌) అనాథ‌కుర్రాడు. త‌న‌కి జున్ను(కల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌) అనే అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురిస్తుంది. అయితే జున్ను వాళ్ల తండ్రి కి ఢిల్లీ ట్రాన్స్‌ఫ‌ర్ కావ‌డంతో ప్రియ(జున్ను) ఢిల్లీ వెళ్లిపోతుంది. అలా వెళ్లే స‌మ‌యంలో జున్ను శీనుకి వంద కాగితంపై తన ఫోన్ నంబర్ రాసిస్తుంది. అది ఎక్క‌డో పోతుంది. ఓ యాక్సిడెంట్ కారణంగా శీను.. ప్ర‌కాష్‌(జ‌గ‌ప‌తిబాబు), స‌రోజిని(ర‌మ్య‌కృష్ణ‌)ల‌కు దగ్గరవుతాడు. వారు శీను ను పెంచుకునేందుకు నిర్ణయించుకుని అతనికి అవినాష్ అనే పేరు పెడ‌తారు. అవినాష్ పెరిగి పెద్ద‌యినా ప్ర‌తి రోజూ, జున్ను, త‌ను క‌లుసుకున్నచోటుకి వచ్చి వెళుతుంటాడు. ఓ రోజు అవినాష్‌కి ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ఫోన్ చేస్తాడు. క్యాబ్ డ్రైవ‌ర్‌కి ద‌గ్గ‌ర‌లో వయోలిన్ ట్యూన్ విన‌ప‌డుతుంది. అది చిన్న‌ప్పుడు త‌ను జున్నుతో క‌లిసి ప్లే చేసిన ట్యూన్‌ని ప‌సిగ‌ట్టిన అవినాష్ ఆ ఆడ్ర‌స్ క‌నుక్కునే లోపు ఎవ‌రో త‌న ఫోన్ లాక్కుని పారిపోతారు. ఆ ఫోన్ కోసం, అందులోని నంబ‌ర్ కోసం అవినాష్ వారిని వెంటపడతాడు .అలా ఏ విధం గా అయినా జున్ను ని కలవాలని ప్రయత్నిస్తుంటాడు. అంతకు కొన్నాళ్ల ముందే శీను.. హైదరాబాద్ వచ్చిన జున్ను అనుకోని విధం గా కలుస్తారు . ఆ తర్వాత వారు ఒకరికి ఒకరు తెలియక పోయినా మరింత చేరువ అవుతారు . చివ‌రికి జున్ను నెంబ‌ర్‌ను శీను అలియాస్ తెలుసుకున్నాడా? అస‌లు జ‌న్నుని అవినాష్ ఎలా కలుసుకున్నాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమాలో చూడాలి …
 
చిన్న‌త‌నాన్ని, స్నేహాన్ని మ‌ర్చిపోని నాయికానాయ‌కులు.. వారిమ‌ధ్య విధి వ‌ల్ల ఏర్ప‌డ్డ‌ దూరం..అయినా విధి త‌మ‌ను క‌లిపి తీరుతుంద‌నే ఆ ప‌సి మ‌న‌సుల‌ విశ్వాసం.. ఆ రెండు హృద‌యాలు ప‌డే ఆవేద‌న‌ ప్రధాన అంశం గా నిర్మించిన ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఫస్టాఫ్. సినిమాను ఆహ్లాదకరంగా మొదలుపెట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంటర్వెల్ వరకు అలాగే కొనసాగించాడు. హీరో పాత్రని పెద్ద హడావుడి లేకుండా కూల్ గా నడిపిస్తూ, అతని చుట్టూ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ను జత చేశాడు. మ‌రోవైపు ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు త‌మ పెంపుడు కొడుకు మీద పెట్టుకున్న ఆశ‌లు, హీరో వారిని ‘అమ్మా’, ‘నాన్నా’ అని పిలిచే సంద‌ర్భాలూ హృద‌యాల‌ను క‌దిలిస్తాయి. ఇక హీరో హీరోయిన్ల చిన్నప్పటి స్టోరీని కూడా అందంగా, చూడాలనిపించే విధంగా తీర్చిదిద్దారు. అందులోని భావోద్వేగాన్ని కొనసాగించి మంచి మూడ్ క్రియేట్ చేశాడు.దర్శకుడు విక్రమ్ కుమార్ పాత కథనే తీసుకున్నా, దానికి యాక్షన్ ను జోడించి సినిమాలో లాజిక్కుల‌ను ప‌క్క‌న‌పెట్టి మ్యాజిక్ చేశాడు.
 
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ బాబ్ బ్రౌన్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి.ఫ్లయిట్ లో రమ్య కృష్ణ కళ్యాణి మధ్య సన్నివేశాలు సన్నివేశాలు బాగున్నాయి . ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని గుర్తు చేసిన ఈ చిత్రం లో హీరో హీరోయిన్ల చిన్నప్పటి కథలో మనసుకు హత్తుకునే ఎమోషన్ ను చూపెట్టినా… పెద్దయ్యాక కలుసుకున్నాక వారి మధ్యన అంతటి భావోద్వేగం పండలేదు. అలాగే రెండవ భాగం లో కొంత మందగించింది .
 
అఖిల్ ఈ సినిమాలో లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించాడు. నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. అఖిల్ సినిమాకు ఎంత చేయాలో అంతా చేశాడు. మంచి స్టంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ.. తేలికపాటి ఎమోషన్స్ ను అలవోకగా పలికిస్తూ ఎక్కడా ఇబ్బంది పెట్టని విధంగా పెర్ఫార్మ్ చేశాడు. రమ్యకృష్ణ, జగపతి బాబుల కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ నటన కంటతడిపెట్టిస్తుంది. హీరోయిన్ గా నటించిన కళ్యాణీ ప్రియదర్శన్ కు ఇది తొలి సినిమా అయినా చాలా స‌హ‌జంగా నటించింది . మ‌న ప‌క్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. అఖిల్అమ్మా నాన్నలుగా జగపతిబాబు రమ్యకృష్ణలు సూపర్బ్. వాళ్ల పెర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు. విలన్ గా అజయ్ ది చిన్న పాత్రే అయినా మెప్పించాడు.
 
అనూప్ రూబెన్స్ సంగీతంలో పాటలు, నైపథ్య సంగీతం అన్నీ బాగా కుదిరాయి. సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి . కొన్ని చోట్ల ‘మనం’ చిత్రం లోని సంగీతాన్ని గుర్తు చేసినా, పాటలన్నీ వినడానికి చాలా బాగున్నాయి. వ‌య‌లెన్ మీద సిగ్నేచ‌ర్ ట్యూన్ మ‌రోసారి వినాల‌న్న‌ట్టు ఉంది. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రం లో మరో హైలెట్ . తన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించాడు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. నిర్మాతగా నాగార్జున నిర్మాణ విలువలు భారీ స్థాయిలో ఉన్నాయి  -ధరణి