‘మల్లేశం’ నా లైఫ్‌లో టర్నింగ్‌ పాయింట్‌ ! – చక్రపాణి

‘మల్లేశం’ చూసిన వారంతా సహజ నటుడిగా నన్ను అభినందిస్తున్నారు. ఈ చిత్రం నాకు మంచి గుర్తింపుతెచ్చింది. ‘మల్లేశం’ నా నటజీవితంలో ఒక టర్నింగ్‌ పాయింట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు  చక్రపాణి ఆనంద. ఆసు యంత్ర ఆవిష్కర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’లో మల్లేశం తండ్రి నరసింహులుగా చక్రపాణి అద్భుతంగా నటించారు. చక్రపాణి తన గురించి చెప్పిన విశేషాలు …
 
‘చిటికెల పందిరి’ లో ఒక హీరోగా…
నటుడిగా ‘దాసి’ నా తొలి చిత్రం. బి.నరసింగ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేను దొర బావ మరదిగా నటించాను. ఈ చిత్రంలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు.‘చిటికెల పందిరి’ చిత్రంలో చంద్రమోహన్ ఒక హీరోగా నేను మరో హీరోగా నటించాను. జె.కె.భారవి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం ఆరు, ఏడు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించడం జరిగింది.కొంత గ్యాప్ తర్వాత ఇటీవల అల్లు శిరీష్ ‘ఏబిసిడి’లో హీరోయిన్ తండ్రిగా నటించాను. అనంతరం ‘స్వయంవద’ చేసా, ‘స్పెషల్’ చిత్రంలో హీరోయిన్‌గా తండ్రిగా నటించడం జరిగింది.
 
లక్ష్మణ్‌ యేలే ద్వారా అవకాశం
‘మల్లేశం’ సినిమాకు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేసిన ఆర్టిస్టు కమ్‌ పెయింటర్‌ లక్ష్మణ్‌ యేలేగారి ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది నాకు. ఏ పాత్ర అయినా చేయగలనని ఈ చిత్రంలో ప్రియదర్శి నిరూపించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపన ఉన్న ఈ చిత్ర దర్శకుడు రాజు ‘మల్లేశం’ని అద్భుతంగా తెరకెక్కించారు.కథ అధ్యయనం కోసం ఆయన కృషి, చిత్రీకరణ కోసం చిత్రబృందం శ్రమ వృథా కాలేదు. కథకు తగ్గ యాస, సామాజిక పరిస్థితులు, పాత్రలు, వాతావరణం సృష్టించారు. మమ్మల్ని కొత్త జీవితంలోకి తీసుకెళ్లినట్టు అనిపించింది.
 
మా నాయన గుర్తొచ్చారు !
ఈ సినిమా ప్రివ్యూ చూసి మల్లేశంగారు.. ‘అన్నా ఎంత బాగా చేసిండ్రు. మా నాయన గుర్తొచ్చారు, ఆయనతో ఉన్న అనుబంధం గుర్తొచ్చింది’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. బయోపిక్ ఎవరిదో వారే వచ్చి నా నటన పట్ల ఎమోషనల్ అవడం ‘నటునిగా నాకు ఇంకేం కావాలి’ అనిపించింది. పాత్ర కోసం నేను కొంత హోమ్‌వర్క్ చేయడం జరిగింది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని సన్నివేశాల్లో నా నటనను చూసి దర్శకుడితో పాటు చిత్ర బృందం ప్రశంసించడం ఆనందాన్ని కలిగించింది.
 
కేటీఆర్ అభినందనలు
ఇంకా ‘మల్లేశం’లోని నా నటనను చూసి పలువురు దర్శక–నిర్మాతలు ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని కొనియాడారు. ఈ చిత్రంలో నేను సహజంగా నటించానని, మహానటులు గుమ్మడి, ఎస్వీ రంగారావును గుర్తుచేశారని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు..కొందరు ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ పెట్టారు.మల్లేశం సినిమా ప్రివ్యూ షోకు కేటీఆర్ హాజరయ్యారు. వారితో కలిసి మేమూ చూశాం. సినిమా అయిపోయాక కేటీఆర్‌కు మిత్రులు ఏలె లక్ష్మణ్ నన్ను పరిచయం చేశారు. అప్పుడు కేటీఆర్ ఇంత సహజంగా ఎలా చేయగలిగారు అన్నారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు. అక్కడే డైరెక్టర్ నందిని రెడ్డి కూడా ఉన్నారు. నన్ను గమనించి నా దగ్గరకు వచ్చి పలకరించారు. ప్రొడ్యూసర్ సురేశ్ బాబు అభినందించారు. కొందరైతే నానా పటేకర్ స్థాయిలో నటించినట్టు చెప్పారు. వీర శంకర్, ప్రొడ్యూసర్ ఎస్ రంగినేని స్పందించారు. ఇదంతా ఆనందాన్ని కలిగించింది. ‘మల్లేశం’ చిత్రం నాకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. మంచి పాత్రలు ఇంకా నటించాలనే ఆసక్తిని పెంచింది.ఈ చిత్రాన్ని నా లైఫ్‌లో ఒక టర్నింగ్‌ పాయింట్‌గా భావిస్తున్నాను.
 
అల్లాణి ప్రోత్సాహం మరువలేను
ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌ లేకపోవడం, కాంటాక్ట్‌ బేస్‌ సరిగా లేకపోవడానికి తోడు నా ఆర్థిక పరిస్థితులు నన్ను కొంతకాలం ఇండస్ట్రీకి దూరం చేశాయి. అడ్వటైజింగ్‌ ఫీల్డ్‌కి షిఫ్ట్‌ అయ్యాను. కాపీరైటర్‌గా, విజువలైజర్‌గా చేశాను. యాడ్‌ఫిల్మ్‌ చేసేప్పుడు వాటిలో కొన్నింటికి డైరెక్ట్‌ చేయడం, స్క్రిప్ట్‌ రాయడం చేశాను. కానీ సినిమాల పట్ల ఉన్న ప్రేమ నాతో పాటే పెరుగుతూనే ఉంది. నాకు తెలిసిన సర్కిల్‌లో ఎవరైనా సినిమా చేస్తే ఆ సినిమా డైరెక్షన్, స్క్రిప్ట్‌ సైడ్‌ వర్క్‌ చేయడం లాంటివి చేశాను.చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా ఎదగడానికి ప్రముఖ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ఆయన మొదటి నుండి నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు.
 
పాత్రలో లీనమై నటిస్తాను !
ప్రస్తుతం క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో విజయ్‌ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నాను.రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’లో నేను ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాను. ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో నటనకు నేను అంకితం అవ్వాలనుకుంటున్నా. ఇకపై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలనీ.. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంచి నటునిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.ఎటువంటి పాత్ర అయినా సహజంగా నటించడానికి ప్రయత్నిస్తాను. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని పాత్రలో లీనమై నటిస్తాను.