అప్పుడే మ‌న‌మేంటనేది తెలుస్తుంది !

మోడ్రన్‌గా, గ్లామర్‌గా క‌నిపించ‌డ‌మంటే చిట్టి పొట్టి దుస్తులు ధ‌రించ‌డంలోనే ఉంటుంద‌ని నేన‌నుకోవ‌డంలేదు. ఆధునికంగా, అందంగా క‌నిపించ‌డ‌మే కాదు, మనం చేసే పాత్ర‌లు అద్భుతంగా ఉండాలి. అప్పుడే మ‌న‌మేంటి అనేది తెలుస్తుంది… అని అంటోంది అనుపమ పరమేశ్వరన్ సంప్ర‌దాయంగా కనిపిస్తే అవకాశాలు వస్తాయంటారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.
కేవలం గ్లామర్‌గా కనిపించినంత మాత్రాన మంచి నటి అనిపించుకోలేం. ఇక పోటీ అంటారా? ఏ రంగంలో అయినా పోటీ ఉంటుంది. ఈ రంగంలో పోటీ ఉండాల్సిందే! ఇక్కడ జయాపజయాలు కూడా ముఖ్యమే! నాకు కొన్ని సినిమాలు నిరాశపరిచినా, అవకాశాలు వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్‌లో నా స్థానం సుస్థిరమే అనుకుంటున్నాను.తెలుగు ప్రేక్షకులు నన్ను తమ అమ్మాయిగానే ఆదరిస్తున్నారు. వాస్తవానికి నేను ఇక్కడే సెటిల్‌ కావాలి. కానీ దానికి ఇంకా కొంత సమయంపడుతుంది. భవిష్యత్తులో ఇక్కడ సెటిల్‌ అవుతాను
లగ్జరీ లైఫ్‌ని పెద్దగా ఇష్టపడను
నేను వదులుకున్న కొన్ని పాత్రలు.. సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ సినిమాలు నేను చేసి ఉంటే వాటి విజయంలో నాకూ భాగం ఉండేది కదా! అనుకుంటాను. అంతే తప్ప, అసూయ పడలేదు. ఆ సినిమాలు వదులుకున్నాను అంటే, అంతకంటే మంచి పాత్రలు నాకోసం వస్తాయని ఆశిస్తున్నాను.
 
రెమ్యునరేషన్‌ గురించి అస్సలు పట్టించుకోను.  సినిమాకి నాకు ఎంత ఇస్తున్నారు అన్నది కూడా నాకు తెలియదు. అవన్నీ మా ఫాదరే చూసుకుంటారు. నాకు నటన తప్ప మరో ఆలోచన ఉండదు. లగ్జరీ లైఫ్‌ని పెద్దగా ఇష్టపడను. బయట పెద్దగా తిరగను. ఎప్పుడైనా తిరగాలంటే నాకంటూ ఓ కారుంటే చాలు. అంతకు మించి సౌకర్యాలు నాకు అనవసరం.
కొత్త హీరోయిన్లు ఫేస్‌ చేస్తున్నారు
ఈ రంగంలో వేధింపులు ఉన్నాయన్నది నిజం. అయితే నాకు ఇంత వరకూ అలాంటి సమస్య ఎదురు కాలేదు. కొంతమంది కొత్త హీరోయిన్లు ఈ సమస్యను ఫేస్‌ చేస్తున్నారు. అది వారు ఓపెన్‌గానే ఒప్పుకుంటున్నారు కనుక, వేధింపుల పర్వం ఆగడం లేదనే అనుకోవాలి. నా వరకూ ఇప్పటి వరకూ అలాంటి సమస్య ఎదురుకాలేదు. ఇప్పటివరకూ నన్ను అందరూ ఎంతో ప్రేమగా, మర్యాదగా చూసుకుంటున్నారు. ఈ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉంటాయని అనుకుంటున్నాను.