ఆసక్తి కలిగించని… ‘నిశ్శబ్దం’ చిత్ర సమీక్ష

సినీ వినోదం రేటింగ్ : 2/5

కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ కలిసి హేమంత్ మ‌ధుక‌ర్‌ కధ,దర్శకత్వంలో వివేక్ కూచిబొట్ల‌ సహ నిర్మాతగా.. టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

వరుసగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న హీరోయిన్ అనుష్క శెట్టి ‘భాగ‌మ‌తి’ త‌ర్వాత న‌టించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం క్రాస్ జోన‌ర్ మూవీ. థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే విష‌యంలో ఓ క్లారిటీ రాక‌పోవ‌డంతో సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేశారు.

కధ… అమెరికాలోని సీటెల్ ప్రాంతానికి 70 కి.మీ దూరంలోని వుడ్ హౌస్‌లో ఉండే భార్యాభ‌ర్త‌లు పీట‌ర్, మెలిసాల‌ను 1972లో ఎవ‌రో చంపేస్తారు. ఆ వుడ్ హౌస్ ఓన‌ర్ జోసెస్ ఆత్మే వారిని హ‌త్య చేసి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కేసును పోలీసులు తేలక మిస్ట‌రీ కేసుగా వ‌దిలేస్తారు. త‌ర్వాత ఆ విల్లాను అంద‌రూ హాంటెడ్ హౌస్‌గా అనుకోవడం తో ఆ విల్లాను ఎవ‌రు కొన‌రు. 2019లో కొలంబియాకు చెందిన బిజినెస్‌మేన్ మార్టిన్ ఎస్క‌వాడో ఆ విల్లాను ధైర్యం చేసి కొంటాడు. కానీ ఆ ఇంట్లో ఉండ‌టానికి అంద‌రూ భ‌య‌ప‌డుతుంటారు. ఎవ‌రూ రారు. చాలా ఏళ్ల త‌ర్వాత అంటే..2019లో ఆ విల్లాలోకి సాక్షి(అనుష్క‌), ఆంటోని(మాధ‌వ‌న్‌) వ‌స్తారు. అప్ప‌టికే ఇద్ద‌రికీ ఎంగేజ్‌మెంట్ అయ్యుంటుంది. ఆ విల్లా ఓన‌ర్ జోసెఫ్ వేసిన ఓ పెయింటింగ్ వేయాల‌ని సాక్షి అనుకోవ‌డంతో సాక్షి, ఆంటోనీ అక్క‌డికి వ‌స్తారు. అయితే ఆ ఇంట్లోకి ఎంట‌ర్ అయిన కొద్దిసేప‌టికి అండ‌ర్ గ్రౌండ్ రూమ్‌లోకి వెళ్లిన ఆంటోనీపై ఎటాక్ జ‌రుగుతుంది, అత‌ను చనిపోతాడు. సాక్షి త‌ప్పించుకుని గాయాల‌తో బ‌య‌ట‌ప‌డుతుంది. పోలీస్ కెప్టెన్ రిచ‌ర్డ్ ‌(మైకేల్ మ్యాడ్‌స‌న్‌‌), డిటెక్టివ్ మ‌హాల‌క్ష్మి(అంజ‌లి) కేసును టేక‌ప్ చేస్తారు. అప్ప‌టికే సీయ‌టెల్‌లో చాలా మంది అమ్మాయిలు క‌న‌ప‌డ‌కుండా పోతారు. దాంతో పోలీసులు కేసును సీరియ‌స్‌గా తీసుకుంటారు. అప్ప‌టికే ఓ మోడ‌ల్‌ను పెళ్లి చేసుకున్న ఆంటోనీ.. సాక్షికి ఎలా ప‌రిచ‌యం అవుతాడు? సాక్షి ప్రాణ స్నేహితురాలు సోనాలి(షాలిని పాండే) ఏమైంది? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తును ప్రారంభిస్తారు. డిటెక్టివ్‌ మ‌హాల‌క్ష్మికి ఓ ఆలోచ‌న వ‌స్తుంది. దాంతో ఆమె సోనాలి మిస్సింగ్ కేసును ద‌ర్యాప్తు చేస్తూ వ‌స్తుంది. సోనాలి ఎవ‌రు? సీయ‌టెల్‌లో క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిలంద‌రూ ఎవ‌రు? ఇలాంటి అనే సందేహాలను తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి….

విశ్లేషణ…‌ దర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్‌, స్క్రీన్‌ప్లే రైట‌ర్ కోన వెంక‌ట్ తో కలిసి సినిమాకు ఆసక్తి కరమైన కథావస్తువు సమకూర్చినా… ఆకట్టుకునేలా దానిని చెప్పలేక పోయారు. సస్పెన్స్ థ్రిల్లర్‍కు కావాల్సిన బలమైన స్క్రీన్‍ప్లే ఇందులో మిస్‍ అయింది. సాంకేతికంగా అన్నీ మంచి స్థాయిలో వుండేట్టు చూసుకున్నా. రచనా పరంగా,స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పరంగా ఆ స్థాయి చూపించలేకపోయారు. డిటెక్టివ్ మ‌హాల‌క్ష్మి తాను ఎదుర్కొన్న విచిత్ర‌మైన కేసును గురించి వివ‌రిస్తూ వ‌స్తుంది. ఓ పాత్ర ముందుకొచ్చి అప్ప‌టి వ‌ర‌కూ ఎలా జ‌రిగిందో చెబుతూ పోతే.. సినిమాపై ఉన్న ఆస‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోతుంది. మాధ‌వ‌న్ పాత్ర ఎలా చనిపోయింది, సాక్షి ఏదో దాస్తుంద‌నే కోణంలో మొదటి భాగం న‌డుస్తుంది. ఇక సెకండాఫ్‌లో షాలిని పాండే, మాధ‌వ‌న్‌, సుబ్బ‌రాజ్‌, అనుష్క‌, మైకేల్ పాత్ర‌లు చుట్టూ క‌థ తిరుగుతుంది. సుబ్బ‌రాజ్ కోణంలో అస‌లేం జ‌రిగింద‌నేది చెబుతూ.. సినిమాలో ట్విస్ట్‌ను రివీల్ చేస్తారు. ఇర‌వై నిమిషాల ముందే సస్పెన్స్ విడిపోవ‌డంతో కిక్ పోతుంది. మిగ‌తా క‌థంతా మామూలుగానే సాగుతుంది. మెయిన్ ప్లాట్ లోనే ఇంట్రస్ట్ మిస్ అవ్వడం..పోలీసుల ట్రాక్ లో లాజిక్ మిస్ అవ్వడం.. లాంటి అంశాలు మరీ సినిమాటిక్ గా, సిల్లీ గా అనిపిస్తాయి. ఇంత మంది స్టార్స్ క‌లిసి ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చేశారంటే.. ఏదో ఓ కొత్త‌ద‌నం ఆశిస్తారు. కానీ… `నిశ్శ‌బ్దం`లో అది క‌నిపించ‌దు. అమెరికా లొకేష‌న్లు, బ్యాక్ డ్రౌండ్ స్కోర్ కాస్త ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తాయి.

నటీనటులు… అనుష్క మాట‌లు రాని, చెవులు విన‌ప‌డ‌ని దివ్యాంగురాలు సాక్షి పాత్ర‌లో చాలా చ‌క్క‌గా న‌టించింది. అనుష్క చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ఆమెను అభినందించాలి. మాట‌లు లేకుండా హావ‌భావాలతో న‌టించ‌డానికి ఆమె చాలా వ‌ర్క‌వుట్ చేసిన‌ట్లు స్ప‌షంగా క‌నిపిస్తుంది. అయితే, అనుష్క పాత్ర‌లో బ‌ల‌మైన ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేయ‌లేదు. పాత్ర‌ను మ‌లిచిన తీరు చూస్తే ఆమె ప‌డ్డ క‌ష్టానికి ఫలితం లేకుండా పోయిన‌ట్లుగా అనిపిస్తుంది. కీలకమైన మేల్ లీడ్ గా నటించిన మాధవన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఫ‌స్టాఫ్‌లో మాధ‌వ‌న్ పాత్ర పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించ‌దు. కానీ సెకండాఫ్ అంతా అత‌ని పాత్ర‌తోనే ర‌న్ అవుతుంది. అలాగే హాలీవుడ్ న‌టుడు మైకేల్ మ్యాడ్‌సేన్ కూడా  మంచి పాత్ర‌లో న‌టించాడు. డిటెక్టివ్ పాత్ర‌లో అంజ‌లి న్యాయం చేసింది. షాలిని పాండే, సుబ్బ‌రాజు ‌ల‌కు మంచి పాత్రలు దొరికాయ‌నే చెప్పాలి. ఇక అవ‌స‌రాల శ్రీనివాస్ పెద్ద‌గా అవ‌స‌రం లేని పాత్ర‌లోనే కనిపించాడు.

సాంకేతికం… షానియ‌ల్ డియో సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్. ముఖ్యంగా అమెరికా లోకేషన్లు, హారర్ సన్నివేశాల్లో  మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో బాగా చూపించారు .ఈ సినిమాకి నిజానికి పాటలు అవసరం లేదు. గోపీసుంద‌ర్ పాటలు ఓకే. గిరీశ్ నేపథ్య సంగీతం బాగుంది. ప‌్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ కూడా బావుంది – రాజేష్