నేను మంచి నటుణ్ణి అని ఎప్పుడూ అనుకోను !

చదువుకునే రోజుల్లో సరదాగా మోడలింగ్‌ చేశాను. ‘దళపతి’లో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత ‘రోజా’, ఆ తరువాత ‘బొంబాయి’ సినిమాలు చేశాను. ఈ  సినిమాల తరువాత మరికొన్ని తమిళ సినిమాలు చేశాను. ఆ సమయంలో నేను చేసిన సినిమాలన్నీ సూపర్‌ డూపర్‌ హిట్టవడంతో స్టార్‌ హీరో అనిపించుకోగలిగాను….అంటూ చెప్పారు ఒకప్పటి గ్లామర్ హీరో,’ధృవ’ విలన్ అరవింద్ స్వామి.

చిన్న వయస్సులోనే వచ్చిన ఆ స్టార్‌డమ్‌ను హ్యాండిల్‌ చేయలేకపోయాను. ఆ సమయంలో వచ్చిన పేరును నిలబెట్టుకోవడం, సినిమాల ఎంపిక అనేది చాలా ఒత్తిడికి గురిచేసింది. అప్పుడు సినిమాల కన్నా చదువు ముఖ్యమనుకుని పిజి చేయడానికి విదేశాలకు వెళ్ళిపోయాను. చదువు పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే మా ఫాదర్ బిజినెస్‌ చూసుకోవలసి వచ్చింది. ఆ తరువాత పెళ్ళి, పిల్లలు, వ్యాపారాలు చూసుకోవడం…అలా దాదాపు పుష్కరకాలానికి పైగా సినిమాలకు దూరంగా ఉండిపోయాను.

నా గాడ్‌ ఫాదర్‌ మణిరత్నంగారే.. తిరిగి సినిమాలు చేయమని ఎప్పుడూ చెప్పేవారు. 2013లో మణిగారి సినిమా ‘కాదల్‌’లో ఓ ఇంపార్టెంట్‌ రోల్ చేశాను. అక్కడి నుంచి నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైందని చెప్పవచ్చు. అసలు నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ అనేది నా ఒక్కడి సమస్య కాదు. నా మీద ఆధారపడినన కొన్ని వేలమంది జీవితాలకు సంబంధించిన సమస్య. గతంలోలాగా హీరో వేషాలు వేయడం కుదరదు. క్యారక్టర్‌ ఆర్టిస్టుగానే కొనసాగాలి. అలా అయితేనే నా వ్యాపారాలు దెబ్బతినకుండా ఉంటాయి. హీరోగా అయితే నా దృష్టంతా సినిమాల మీదే పెట్టవలసి వస్తుంది. అందుకే క్యారక్టర్ ఆర్టిస్టుగా చేయాలని నిర్ణయించుకున్నాను.నాలోనూ మంచి విలన్‌ దాగి ఉన్నాడన్న విషయం ‘తనిఒరువన్‌’ చేసేదాకా నాకూ తెలియదు. ఆ సినిమా మంచి విజయం సాధించిన తరువాత విలనిజానికి ప్రాణం పోయగల నటుడు నాలో ఉన్నాడని ప్రేక్షకులతో పాటు పరిశ్రమ గుర్తించింది. అలాగని అన్నీ అలాంటి పాత్రలే చేయాలని అనుకోవడం లేదు.

అదృష్టాన్నిఅస్సలు నమ్మను. నేను కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తిని. ఏ వ్యక్తి అయినా రోజులో 22 గంటలు కష్టపడితే విజయం సాధించడం ఖాయం! అదృష్టాన్ని నమ్ముకుని కష్టపడి పనిచేయకపోతే ఎందులోనూ సక్సెస్‌ సాధించలేం.మొదటి నుంచి సినిమాల విషయంలో నాది ఒకే దృక్పధం. నచ్చిన సబ్జెక్ట్‌ వస్తే చేస్తాను. లేకపోతే లేదు. హ్యాపీగా నా వ్యాపారాలు చూసుకుంటాను. దాంతో ఫలానా సినిమా లేదా ఫలానా పాత్ర చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నేను మంచి నటుడిని అని ఎప్పుడూ అనుకోను. ఏ సినిమా చేసినా నా పాత్ర ద్వారా చిన్న సందేశమైనా ప్రేక్షకులకి చేరాలన్నదిన నా కోరిక.