పుల్లెల గోపీచంద్ బయోపిక్ త్వరలో

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ బయోపిక్ త్వరలో వెండితెరపై మెరవనుంది. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రానుంది. తన బయోపిక్ సినిమాగా రాబోతున్నందుకు సంతోషంగా ఉందని గోపీచంద్ అన్నారు. విక్రమ్ తీయబోయే ఈ చిత్రంతో బ్యాడ్మింటన్ ఆట ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

గోపీచంద్  ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించారు. ప్రసిద్ధ బాడ్మింటన్ క్రీడాకారుడు , బాలీవుడ్ నటి దీపిక పదుకొణె తండ్రి ప్రకాశ పదుకొణె తరువాత ఈ రికార్డును గోపీచంద్ కైవసం చేసుకున్నారు. గోపీచంద్ హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి ఎందరికో బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. గోపీచంద్ శిక్షణలో ఒలింపిక్ రజత పతాకం గెలుచుకున్న పివి సింధుపై కూడా బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. నటుడు సోనూ సూద్ సింధుపై చిత్రం నిర్మిస్తున్నారు.