‘సైరా’ అంటూ భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ !

‘సైరా నరసింహారెడ్డి’ ….చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్‌తో పాటు విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘బాహుబలి’ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత రామ్‌చరణ్ భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలోని అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశం షెడ్యూల్ ముగిసింది.35 రాత్రులు ఏకధాటి షూటింగ్‌, భారీ వర్షం, అతి తక్కువ కాంతి, బ్రిటీష్‌ సైనికులకు వ్యతిరేకంగా పోరాటం, మాసీవ్‌ యాక్షన్‌, భారీ నిర్మాణ విలువలతో సవాల్‌తో కూడిన సన్నివేశాల చిత్రీకరణ.
కెమెరామెన్ రత్నవేలు ఈ యాక్షన్ పార్ట్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు… ‘‘సవాలుతో కూడిన షెడ్యూల్‌ పూర్తయింది. వర్షంలో బ్రిటిష్‌ సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. ‘సైరా’ ఒక అద్భుతం’’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ నిపుణుడు గ్రాగ్‌ పావెల్‌ పనిచేస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ చూసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి ని చిరంజీవి ప్రశంసల్లో ముంచెత్తారని తెలిసింది. బ్రిటిష్ ఆయుధాగారంపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి దండెత్తే కీలకమైన సన్నివేశం కోసం హైదరాబాద్ శివారులో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. బ్రిటిష్ సైన్యం, ఫిరంగులు, గుర్రాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే వర్షంతో పాటు వెలుతురులేమి ఈ షూటింగ్‌కు ఆటంకం కలిగించాయని… అయినప్పటికీ విజయవంతంగా షూటింగ్ ముగించామని ఫిల్మ్‌మేకర్స్ పేర్కొన్నారు. కీలకమైన యుద్ధ సన్నివేశాలను 35 రాత్రుల్లో తెరకెక్కించామని చెప్పారు.ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ విడుదల చేస్తారని సమాచారం.