`దంగల్`.. ‘కేజిఎఫ్’.. ‘రౌడీ బేబీ’ రికార్డులు

రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవితకథ ఆధారంగా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన `దంగల్` చిత్రం భారత్‌లోనూ..చైనాలోనూ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా ఆమిర్ ఖాన్ నటించిన `దంగల్` చిత్రం నిలిచినట్టు యాహూ ఇండియా ప్రకటించింది. 2016లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ‘దంగల్‘ తర్వాతి స్థానంలో సల్మాన్ ఖాన్ `భజరంగీ భాయ్‌జాన్` నిలిచింది.ఆ తర్వాత వరుసగా `పీకే`, `సుల్తాన్`, `టైగర్ జిందా హై`, `ధూమ్-3`, `సంజు`, `వార్`, `చెన్నై ఎక్స్‌ప్రెస్`, `దబాంగ్` సినిమాలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నట్టు యాహూ ఇండియా పేర్కొంది. పైన పేర్కొన్న సినిమాల గురించే నెటిజన్లు ఎక్కువగా శోధించారని తెలిపింది. అయితే భారత్‌లో దాదాపు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న `బాహుబలి-2`కి ఈ జాబితాలో చోటు దక్కలేదు .
 
అమెజాన్ ప్రైమ్‌లో ‘కేజిఎఫ్’
పలుభాషలలో ఘన విజయం సాధించింది ‘కేజీఎఫ్’ చిత్రం.ఈ చిత్రంలో యష్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ రూపొందుతోంది . ఇప్పటికే ‘కేజీఎఫ్’ ఖాతాలో అనేక రికార్డ్స్ ఉండగా..మరో రికార్డ్ చేరింది. 2019 సంవత్సరానికి గాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన చిత్రాలలో అన్ని భాషలలో అత్యధికంగా చూసిన సినిమాగా ‘కేజిఎఫ్’ నిలిచింది. కేజిఎఫ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ‘అమెజాన్ ప్రైమ్’ దక్కించుకోగా.. ఎక్కువ వ్యూస్ సాధించి లాభాలు తెచ్చిపెట్టింది.
 
యూట్యూబ్ రికార్డు ‘రౌడీ బేబీ’
యూట్యూబ్ కొత్త కొత్త రికార్డులకు వేదికగా మారుతోంది.సోషల్ మీడియా రాకతో ఎంటర్టైన్మెంట్ రంగం రూపు రేఖలే మారిపోతున్నాయి. సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ధనుష్-సాయి పల్లవిల ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ పాట యూట్యూబ్ వ్యూస్ లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకూ 725 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ రికార్డుల్లో 7 స్థానాన్ని స్వంతం చేసుకుంది. ధనుష్ స్వయంగా రాసి,పాడారు. ఈ పాటకు స్వరకర్త యువన్ శంకర్ రాజా.అదిరి పోయే స్టెప్పులను ప్రముఖ కొరియో గ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా అందించారు. ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ టాప్ 7లో నిలిచి రికార్డు సృష్టించిందని యూట్యూబ్ స్వయంగా ప్రకటించింది.