ఎందుకంటే.. నా విలువ నాకు తెలుసు !

“స్క్రిప్ట్‌ నచ్చినా పారితోషికం దగ్గర కాంప్రమైజ్‌ కానంటోంది” బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకునే. అవసరమైతే ఆ సినిమా చాన్స్‌ను వదులుకోవడానికి కూడా సిద్ధం అంటోంది. ఈ విషయం గురించి తను ఎదుర్కొన్న ఓ సంఘటనను షేర్‌ చేసింది దీపికా. ‘‘ఇటీవల ఓ దర్శకుడు నాకు ఓ కథ చెప్పారు. క్రియేటివ్‌ యాంగిల్‌లో ఆ సినిమా నాకు నచ్చింది. ఆ తర్వాత రెమ్యూనరేషన్‌ డిస్కషన్స్‌ స్టార్ట్‌ చేశాం. నా మాట చెప్పాను. ఆ డైరెక్టర్‌ వెళ్లిపోయి మరలా రెండు రోజుల తర్వాత వచ్చారు. మెయిన్‌ లీడ్‌ యాక్టర్‌ కన్నా నాకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇప్పించలేనని తన అభిప్రాయం చెప్పారు. సినిమా చేయనని నేను చెప్పేశాను.
 
ఎందుకంటే నా విలువ నాకు తెలుసు. నా ట్రాక్‌ రికార్డ్‌పై నాకు అవగాహన ఉంది. ఆ సినిమాను వద్దనుకున్నందుకు కూడా బాధపడటం లేదు. నేటి రోజుల్లో సినిమాల్లో మహిళల అవకాశాలకు కొదవ లేదు. మహిళల పాత్రలకు కూడా ప్రాముఖ్యత పెరిగింది. ఓ మార్పు వస్తోంది’’ అని చెప్పుకొచ్చింది దీపికా. ‘పద్మావత్‌’ సినిమా సక్సెస్‌తో బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా ఎంటో నిరూపించుకున్న దీపికా ప్రస్తుతం ‘చెప్పాక్‌’ అనే సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. ‘రాజీ’ ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
 
ఈ పాత్రను సవాలుగా స్వీకరించా !
ఏదో ఒక పంథాకు పరిమితమై పోకుండా పాత్రలపరంగా ప్రయోగాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తుంది అగ్ర నాయిక దీపికాపదుకునే. యాసిడ్‌దాడి బాధితురాలు లక్ష్మీఅగర్వాల్ జీవిత కథా చిత్రంలో దీపికాపదుకునే నటిస్తున్న విషయం తెలిసిందే. మేఘనా గుల్జార్ దర్శకురాలు. ‘చపాక్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా దీపికాపదుకునే నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపికాపదుకునే ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది….
“దర్శకురాలు మేఘనాగుల్జార్ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో ఉద్వేగానికి గురయ్యాను. ఈ తరహా కథలు నాకు సరిపోవని చాలా మంది అనేవారు. అయితే వ్యక్తిగతంగా నాకు మాననీయగాథలు, మహిళల్లో స్ఫూర్తినింపే కథాంశాలు అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు అలాంటి కథలతో నన్నెవరూ సంప్రదించలేదు. మేఘనా ఈ కథ చెప్పగానే నిర్మాతగా కూడా నేనే ఉంటానని అడిగాను. అత్యంత సంక్షుభిత పరిస్థితులు ఎదురైనప్పటికీ సడలని ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న లక్ష్మీఅగర్వాల్ జీవిత కథలో శిఖరమంత స్ఫూర్తి ఉంది. ఈ పాత్రను ఓ సవాలుగా స్వీకరించా! ” అని చెప్పింది దీపికాపదుకునే. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.