‘సూపర్‌ హీరో’ చిత్రాలకు భారతీయతను జోడిస్తా !

దీపికా పదుకొనే… హాలీవుడ్‌ సూపర్‌ హీరోస్‌ ‘అవెంజర్స్‌’, ‘మార్వెల్‌’ సినిమాటిక్‌ యూనివర్స్‌ చిత్రాలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా వీటికి అభిమానులు భారీ సంఖ్యలో ఉండడం విశేషం. అలా ఉన్నారు కాబట్టే ఇప్పటి వరకూ వచ్చినవి అంతలా విజయం సాధించాయి. ఇవే సూపర్‌ హీరో చిత్రాలకు భారతీయతను జోడించి తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనేకి వచ్చింది. హాలీవుడ్‌ సూపర్‌ హీరోల్లా కాకుండా భారతీయ సూపర్‌ హీరోల్లా చేస్తే ఎలా ఉంటారో వచ్చిన ఊహను సినిమాగా చేయబోతుంది. ఈ విషయాన్నే ఇటీవల లండన్‌లో వెల్లడించింది దీపికా. మూడు రోజుల క్రితం లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన తన విగ్రహ ఆవిష్కరణకు హాజరైన ఆమె ‘మెట్రో.కో. యూకే’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించింది…

‘మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగమవుబోతున్నారా? అన్న ప్రశ్నకు దీపికా సమాధానమిస్తూ…’అవును ఎందుకు భాగం కాకూడదు. భారతీయతను జొప్పించాలన్నది నా ఉద్దేశం. అది ‘మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ అయినా, ‘అవెంజర్స్‌’ అయినా కావచ్చు. లేదా ఈ చిత్రాల్లో ఏదైనా ఐకానిక్‌ పాత్ర అయినా చేయొచ్చు. ఈ తరహాలో చేసేందుకు నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. భారతీయతను జొప్పించి తీస్తే సూపర్‌ హీరో చిత్రాలను ఇక్కడ కూడా ఆదరిస్తారనుకుంటున్నా. త్వరలోనే ఇది పట్టాలెక్కుతుందని నమ్ముతున్నా” అని చెప్పింది.

దీపికా ఇటీవల 14 మంది అంతర్జాతీయ నటీమణులతో కలసి ‘అమెరికన్‌ వోగ్’ ఏప్రిల్‌ ఎడిషన్‌ కవర్‌ పేజీకి చేసిన ఫొటో షూట్‌లో కూడా పాల్గొంది. అందులో దక్షిణ కొరియా నటి, ‘అవెంజర్స్‌ :ఎండ్‌గేమ్‌’ లో చేసిన కథానాయిక స్కార్లెట్‌ జాన్‌స్సాన్‌ ఉంది. దీపికా ప్రస్తుతం మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చాపక్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. వచ్చే వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.