ఓ అమ్మాయి ఇంత అందంగా ఎలా ఉంటుంది !

రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె… బాలీవుడ్‌లో క్రేజీ జోడీగా పేరు తెచ్చుకున్న వీరి పెళ్ళి ఈ నవంబర్‌లో ఉండబోతోందంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. తాజాగా ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరు తమ పెళ్ళికి సంబంధించి, చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు.
రణ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ…‘దీపికాను ఓ రెస్టారెంట్‌లో తొలిసారి చూసినప్పుడు ఓ అమ్మాయి ఇంత అందంగా ఎలా ఉంటుందని ఆశ్చర్యపోయా. అయితే మా పెళ్ళికి సంబంధించి ఇటీవల ప్రశ్నలెదురవుతున్నాయి. మా పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఆ వార్త ముందు మీకే (మీడియా) తెలుస్తుంది. ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ‘పద్మావత్‌’ సినిమా టైమ్‌లో కొందరు దీపికను చంపుతామని బెదిరించినప్పుడు చాలా కోసం వచ్చింది. మహిళలపై వేధింపులను నేను పూర్తిగా ఖండిస్తున్నా. పనిచేసే చోట మహిళల్ని పురుషులు వేధించడం తప్పే. అది ఇంటిలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు. వేధింపులు ఎదుర్కొన్న వాళ్ళు ధైర్యంగా మాట్లాడాలి’ అని తెలిపారు.
దీపిక స్పందిస్తూ… రణ్‌వీర్‌లో నాకు నచ్చిన అంశం ఆయన నా టైప్‌ కాదు. ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ చిత్రానికి ముందు వరకు రణ్‌వీర్‌ పెద్ద స్టార్‌ అవుతాడనుకోలేదు. మహిళల వేధింపుల విషయానికి వస్తే, స్త్రీ, పురుషులు అనే విభేదాన్ని లైంగిక వేధింపుల్లో చూపకూడదు. ‘మీ టూ’ ఉద్యమం చెడుకు వ్యతిరేకంగా మంచి కోసం చేసే పోరాటం. అది మరింతగా పెరగాలి’ అని చెప్పారు.
 
ప్రస్తుతం రణ్‌వీర్‌ కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో ‘తఖ్త్‌’ చిత్రంలో నటిస్తున్నారు.
ఆ విశేషాలను రణ్‌వీర్‌ పంచుకుంటూ… ”కరణ్‌తో కలిసి మొదటిసారి పనిచేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నా. అది ఓ భారీ స్థాయి సినిమా కావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ‘తఖ్త్‌’ అమేజింగ్‌ స్టోరీ. ఇందులో నేను అద్భుతమైన దారా షికో పాత్రలో నటిస్తున్నా’ అని తెలిపారు. దీంతోపాటు ‘సింబా’, ‘గల్లీబారు’ చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారట.
 
‘పద్మావత్‌’ తర్వాత దీపిక మరే సినిమాకు సైన్‌ చేయలేదు.ఇటీవల ఆమె మేఘనా గుల్జర్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటించేందుకు ఓకే చేశారు. ప్రస్తుతం ఈమె నిర్మాతగా మారింది. దర్శకురాలు మేఘన గుల్జార్‌తో కలసి ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించబోతున్నారు. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథను ఈ బ్యానర్‌లో తొలి చిత్రంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే లక్ష్మీ పాత్రను పోషించనుంది.ఈ సినిమాను దీపికనే నిర్మించబోతుండటం విశేషం.
ఆ విశేషాల గురించి దీపిక చెబుతూ…’ఈ స్క్రిప్ట్‌ విన్నప్పుడు కథకు డీప్‌గా కనెక్ట్‌ అయ్యాను. ఇందులో హింస ఒక్కటే కాదు, బలం, ధైర్యం, ఆశ, విజయం వంటి అంశాలున్నాయి. నాపై వ్యక్తిగతంగా, సృజనాత్మకంగా ఇది బాగా ప్రభావం చూపించింది. లక్ష్మి అగర్వాల్‌ జీవిత కథ నన్ను ఎంతో ఇన్‌స్పైర్‌ చేసింది. ఇలాంటి సినిమాకు సపోర్ట్‌ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నిర్మాతగా మారాను’ అని తెలిపింది. పేదకుటుంబానికి చెందిన లక్మి 2005లో ఢిల్లీలోని ఓ బస్టాప్‌లో నిల్చుంటే ఓ దుండగుడు ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. దాడికి గురైనప్పటికీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో పోరాడి గెలిచింది. తనలాంటి బాధితులను చేరదీసి ఓ ఎన్జీవోను నడిపిస్తూ, వారికి మనోధైర్యాన్నిస్తోంది.
‘గ్లోబల్‌ బ్యూటీ స్టార్‌’ దీపిక
దీపికా పదుకొనే ఈ ఏడాది చేసిన ‘పద్మావత్‌’తో 300కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి కథానాయిక. ఓ మహిళా టైటిల్‌ రోల్‌ పోషిస్తూ…ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద 300కోట్లు కలెక్ట్‌ చేసిన చిత్రం కూడా ‘పద్మావత్‌’ కావడం విశేషం. ఈ సినిమాలో రాణి పద్మావతిగా ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. సినీ విమర్శకులు కూడా తెగ ప్రశంసించారు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారల్లో కూడా దీపికా ఉంది. ఈ ఏడాది టైమ్‌ విడుదల చేసిన ‘ప్రభావంతమైన 100 మంది వ్యక్తుల’ జాబితాలో దీపికా కూడా నిలిచింది. తాజాగా ఈమెకు ‘గ్లోబల్‌ బ్యూటీ స్టార్‌’ పురస్కారం వరించింది. ‘ఎల్లే బ్యూటీ అవార్డ్స్‌ 2018’ని ఆదివారం అందించారు. మెటలిక్‌ గౌడ్‌ ధరించి ఈ వేడుకలో దీపికా క్యాట్‌వాక్‌ చేసి హోయలొలికించింది. ప్రపంచస్థాయిలో ఈమెకు అవకాశాలు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు కూడా.