బుల్లితెర ప్రభాకర్‌ తనయుడి ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’

ప్రముఖ టీవి నటుడు ప్రభాకర్‌ (ఈటీవీ ప్రభాకర్‌) తనయుడు చంద్రహాస్‌ త్వరలో వెండితెరపై హీరోగా రాబోతున్నసందర్భంగా… చంద్రహాస్‌ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని  ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో  మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌లను చంద్రహాస్‌ తల్లి, ప్రభాకర్‌ భార్య మలయజ లాంచ్‌ చేశారు. ఇదే వేదికపై  బంధుమిత్రులు, మీడియా, అతిథుల సమక్షంలో పుట్టినరోజు కేక్‌ కట్‌ చేశారు చంద్రహాస్‌
ప్రభాకర్‌ మాట్లాడుతూ…  
నేను ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. మా అబ్బాయి కూడా ఇండస్ట్రీని నమ్ముకుని నటననే ప్రొఫెషన్‌గా తీసుకుని ముందుకు వెళుతున్నాడు. తండ్రిగా వాడికి ఇష్టమైన దాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక చేస్తున్నాను. చంద్రహాస్‌ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమా హీరోకు కావాల్సిన ఫైట్స్‌, డాన్స్‌లు, యాక్టింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంటూ తనను తాను తీర్చి దిద్దుకున్నాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వు డాడీ దాంతో నేను యూట్యూబ్‌లో కవర్‌ సాంగ్స్‌ చేసుకుంటాను. అలా నన్ను నేను పరిశ్రమకు పరిచయం చేసుకుంటాను అన్నాడు. అలా చేసిన ‘‘నాటు నాటు’’ అనే కవర్‌ సాంగ్‌ వీడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పేరుతో పాటు సినిమా హీరోగా కూడా రెండు అవకాశాలు వచ్చాయి.
గతంలో రెండు సినిమాలు నిర్మించిన  ప్రొడ్యూసర్స్‌ కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టిలు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన దర్శకత్వం కృష్ణ. అలాగే ఏవీఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై గతంలో రెండు సినిమాలను నిర్మించిన ఏవీఆర్‌, నరేష్‌ గార్లు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు సంపత్‌ వి. రుద్ర. వీరితో పాటు మా స్వంత సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ పై ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్‌ చేశాం. దీనికి నా మిత్రులు కళ్యాణ్‌, వెంకట్‌, కాముని శివ, ప్రేమ్‌ సాగర్‌, తోట సురేష్‌లు కో`ప్రొడ్యూసర్‌లు. శనివారం (17వ తేదీ) మా అబ్బాయి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్‌ అయితే బాగుంటుంది అని అనిపించి.. ఈ సమావేశం ఏర్పాటు చేశాం. చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది వాళ్ల అమ్మ, నా భార్య మలయజ. చంద్రహాస్‌ తాను చేసిన యూట్యూబ్‌ వీడియో ద్వారా నా ప్రమేయం లేకుండానే హీరోగా అవకాశాలు తెచ్చుకోవడం తండ్రిగా గర్వంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకోగలడనే నమ్మకం ఉంది అన్నారు.

చంద్రహాస్‌ తల్లి, ప్రభాకర్‌ భార్య మలయజ మాట్లాడుతూ…
చంద్రహాస్‌ కూడా వాళ్ల నాన్నగారిలానే హార్డ్‌ వర్కర్‌. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. తల్లిదండ్రులకు ఇంతకు మించి ఆనందం ఏముంటుంది. మా చంద్రహాస్‌ నిర్మాతలకు ఎప్పుడూ ఎస్సెట్‌ కావాలి అని కోరుకుంటున్నాను. మా అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

చంద్రహాస్‌ మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ…
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారితో పాటు అనేక మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ల మధ్య సినిమాలు, టీవీ సీరియల్స్‌, టెలీ ఫిలిమ్స్‌ ఇలా షూటింగ్‌ల వాతావరణంలోనే పెరిగాను. అందుకే నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. దీని కోసం నాన్నగారిని ఎంతగా విసిగించినా పని అవ్వలేదు. ఇక ఆగలేక నాన్నను కొంత అమౌంట్‌ అడిగి ‘‘నాటు నాటు’’ కవర్‌ సాంగ్‌ చేశాను. ఇది చూసి నాకు అవకాశం ఇచ్చారు మా దర్శక, నిర్మాతలు. నటనతో పాటు పరిశ్రమలోకి అడుగుపెట్టేటప్పుడు మన బిహేవియర్‌ కూడా చాలా ముఖ్యం. ఆయన తన బిహేవియర్‌తోనే ఇప్పటికీ వ్యక్తిగా అందరూ ఇష్టపడే స్థాయిని కొనసాగిస్తున్నారు. నేను కూడా ఇలాగే అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలని మా అమ్మగారి కోరిక. పరిశ్రమలో చాలా మందిని చూసి  ఇన్‌స్పైర్‌ అయ్యాను. ముఖ్యంగా రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లను చూసి. ప్రేక్షకులకు, ఇటు పరిశ్రమకు నన్ను నేను ముందస్తుగా పరిచయం చేసుకోవడం ఈ సమావేశం ఉద్దేశం అన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రహాస్‌ చిత్రాల నిర్మాతలు, దర్శకలు, ఇతర టెక్నీషియన్స్‌ను వేదిక మీదకు పిలిచి మీడియాకు పరిచయం చేశారు ప్రభాకర్‌.