‘ఘంటసాల ది గ్రేట్’ ట్రైలర్ ఆవిష్కరించిన చిత్ర

‘ఘంటసాల ది గ్రేట్’ మహా గాయకుడు ఘంటసాల జీవితం తో వెండితెర రూపం. గతంలో ‘ఘంటసాల పాటశాల’ పేరుతో ఘంటసాల ప్రసిద్ధ గీతాలని సంకలనం చేసిన సి.హెచ్. రామారావు ఈ ఘంటసాల బయోపిక్ కి రచన, దర్శకత్వం చేశారు. అన్యుక్త్ రామ్ ప్రొడక్షన్స్ పతాకంపై గాయకుడు జి.వి. భాస్కర్ నిర్మాణ సారధ్యంలో ఘంటసాల వీరాభిమాని శ్రీమతి లక్ష్మీ నీరజ ఈ బయోపిక్ ని నిర్మించారు.విశేషం ఏంటంటే…ఇందులో ఘంటసాల దంపతుల పాత్రలను నిజ జీవితంలో భార్యా భర్తలు పోషించడం. ఘంటసాలగా యువ గాయకుడు… ‘సూపర్ సింగర్స్ 7’ ఫేమ్ కృష్ణ ఛైతన్య నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా కృష్ణ చైతన్య భార్య, టీవీ యాంకర్ మృదుల చేసారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి వాసురావు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
 
దర్శకులు సి.హెచ్. రామారావు మాట్లాడుతూ… “ఘాటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఘంటసాల మహాగాయకుడిగా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డారో.. అన్ని కష్టాలూ ఈ చిత్ర నిర్మాణంలో మేం పడ్డాం.ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎందరు అడ్డు తగిలినా…ఈ చిత్రాన్నిత్వరలో విడుదల చేస్తాం. ఆ ఘంటసాల గారి ఆశీస్సులు మాకు ఉన్నాయి” అని చెప్పారు.
 
సహ నిర్మాత జి.వి. భాస్కర్ మాట్లాడుతూ, “ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ ని విదేశంలో వందలాది మంది తెలుగు ప్రేక్షకుల సమక్షములో విడుదల చేసే అదృష్టం దక్కింది. ఈ చిత్ర సమర్పకులు డా. కె.శ్రీ లక్ష్మీ ప్రసాద్ నేతృత్వంలో.. ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ అధ్యక్షతన.. ‘రాగ స్వర’ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో.. ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాం నగరంలో ప్రఖ్యాత గాయని చిత్ర గారి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసాం.. అనూహ్య స్పందన వచ్చింది. చిత్రం కూడా అదే రీతిలో ప్రేక్షకుల మన్ననలు పొందనుంది” అని తెలిపారు.
ప్రఖ్యాత హిందూస్తానీ సంగీత విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గా సుమన్ నటించారని నిర్మాత శ్రీమతి లక్ష్మీ నీరజ తెలిపారు.
 
కృష్ణ చైతన్య, మృదుల ,సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షిత్ మాస్టర్, జే.కె. భారవి, అశోక్ కుమార్, మాస్టర్ అతులి నటించిన ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్, ఎడిటింగ్: క్రాంతి, ఆర్ట్: నాని, రచన..దర్శకత్వం: సిహెచ్. రామారావు