గాంధీజీ ఉండుంటే ఈ చిత్రం తప్పకుండా నచ్చుండేది !

తన ‘పార్టిషన్‌ 1947’ చిత్రం జాతిపిత మహాత్మా గాంధీకి తప్పకుండా నచ్చి ఉండేది అని దర్శకురాలు గురిందర్‌ చద్దా అన్నారు. మనీశ్‌ దాయల్‌, హ్యూమా ఖురేషీ, ఓంపురి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. దేశానికి పరాయపాలన నుంచి విముక్తి లభిస్తున్న తరుణంలో భారత్‌కు బ్రిటీష్‌ వారు ఏం చేశారన్నదానిపైనా, గాంధీ ఫిలాసిఫీపైనా ఈ చిత్రం రూపొందుతోంది. దేశానికి స్వాతంత్య్ర ప్రకటించే సమయంలో లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ పాత్ర ఏమిటన్నదే మరో ముఖ్యమైన అంశం. నరేంద్ర సింగ్‌ సారిలా రాసిన ‘ది షాడో ఆఫ్‌ ది గ్రేట్‌ గేమ్‌’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా గురిందర్‌ మీడియాతో సమావేశమయ్యారు….

‘సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక నాకొకటి అన్పించింది. గాంధీజీ ఉండుంటే ఆయనకు తప్పకుండా ఈ చిత్రం నచ్చుండేదని. సినిమా మొత్తం గాంధీ ఫిలాసఫీ గురించే ఉంటుంది. భారత్‌ బ్రిటీష్‌ చెర నుంచి వేరుపడగానే గాంధీ సిద్ధాంతాలని పక్కనపెట్టేశారు. ఈ సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాను. ఒక్కోసారి సినిమా చేయలేనేమో అన్పించేది.’ అని తెలిపారు.

గురిందర్‌ చద్దా బ్రిటన్‌కి చెందిన సిక్కు మహిళ. భారత్‌ బ్రిటీష్‌ చెరలో ఉన్నప్పుడు జరిగిన ఆందోళనల్లో ఆమె తన కుటుంబీకుల్ని పోగొట్టుకున్నారట. అప్పట్లో తన కుటుంబంతో పాటు ప్రజలు పడిన కష్టాల్ని తెలియజేయడానికి ‘పార్టిషన్‌ 1947’ సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు. ఆగస్ట్‌ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.